స్కాముల పుట్ట యూపీఏ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్కాముల పుట్ట యూపీఏ!

స్కాముల పుట్ట యూపీఏ!

Written By news on Saturday, August 18, 2012 | 8/18/2012

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే యూపీఏ చిత్తుగా ఓడిపోవచ్చన్న సర్వే మీడియాలో గుప్పుమన్న రోజే... ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడంద్వారా యూపీఏ ప్రభుత్వం ఖజానాకు 3 లక్షల 80 వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిందన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) దేశ ప్రజల ముందుంచింది. ఆ సంస్థ పార్లమెంటుకు శుక్రవారం సమర్పించిన మూడు నివేదికలనూ చూస్తే యూపీఏ పుట్టలో ఇంకెన్ని స్కాములున్నాయోనన్న సందేహం కలుగుతుంది. ఇప్పటికే లక్షా 76 వేల కోట్ల రూపాయల 2జీ స్పెక్ట్రమ్ స్కాం, రూ.70,000 కోట్ల కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఆదర్శ్ హౌసింగ్, టట్రా ట్రక్కుల స్కాంలు యూపీఏ సర్కారును ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే ఇప్పుడు కాగ్ బయటపెట్టిన కొత్త కుంభకోణాలు వాటన్నిటినీ తలదన్నాయి. 

ఇందులో బొగ్గు స్కాం విలువే లక్షా 85 వేల కోట్ల రూపాయలు. గత ఏడాది మార్చి వరకూ వివిధ ప్రైవేటు సంస్థలకు ఎలాంటి బిడ్డింగ్ ప్రక్రియనూ పాటించకుండా బొగ్గు క్షేత్రాలు కేటాయించడంవల్ల ఈ నష్టం సంభవించిందని కాగ్ నివేదిక చెబుతోంది. ఈ స్కాంలో టాటా, నవీన్ జిందాల్, ఎస్సార్, ఆర్సెలర్, వేదాంత తదితర సంస్థలు లబ్ధి పొందాయన్నది నివేదిక సారాంశం. 

అలాగే, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డయల్)కు రూ.24,000 కోట్ల విలువైన భూముల్ని కట్టబెట్టి అనుచితమైన లబ్ధిచేకూరేలా పౌర విమానయాన శాఖ వ్యవహరించిందని, దీనివల్ల రాగల 58 ఏళ్లలో దాన్నుంచి లక్షా 63వేల 557 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, అందులో డయల్ వాటా రూ. 88,337 కోట్లని కాగ్ లెక్కేసింది. డయల్‌లో జీఎంఆర్‌తోపాటు భాగస్వామిగా ఉన్న ఎయిర్‌పోర్ట్ అథారిటీకి 26 శాతం వాటా మాత్రమే ఉంది. ఇక మూడో నివేదిక రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఒక పవర్ ప్రాజెక్టుకు సంబంధించింది. దానికి కేటాయించిన బొగ్గు క్షేత్రాలనుంచి అదే సంస్థ ఆధ్వర్యంలోని మరో పవర్ ప్రాజెక్టుకు బొగ్గు మళ్లించడానికి అనుమతించినందువల్ల రిలయన్స్ రూ. 29,033 కోట్ల రూపాయల లబ్ధిపొందిందని చెబుతోంది. 

ఈ నివేదిక చెప్పిన నిజాలే ఇంత దిగ్భ్రాంతిగొలుపుతుంటే అది చెప్పకుండా వదిలేసిన నిజాలు, ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సిన మరికొన్ని వ్యవహారాలు కలుపుకుంటే స్కాంల విలువ ఇంకెన్ని లక్షల కోట్లుంటుందో చెప్పడం సామాన్యులకు సాధ్యంకాదు. వాస్తవానికి కాగ్ ముసాయిదా నివేదిక ఒక్క బొగ్గు స్కాం విలువే రూ. 10 లక్షల కోట్లని గత ఏడాది మార్చిలో వెల్లడించింది. అయితే, పబ్లిక్‌రంగ సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలన్నీ వేరుగా నిర్వహిస్తారు గనుక ఆ సంస్థల లెక్కల్ని ఇందులో చూపించడం సరికాదని బొగ్గు మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తంచేయడంతో కాగ్ ప్రైవేటు సంస్థల లావాదేవీల శోధనకే పరిమితమైంది. అంతేకాదు... చాలా సంస్థలు తమ ‘ప్రాజెక్టు ప్లాన్’లను అధిక ధరకు అమ్ముకోవడం ద్వారా కేటాయించిన బొగ్గు క్షేత్రాలను వేరొకరికి బదిలీచేశాయని మీడియాలో ఆమధ్య కథనాలు వెలువడ్డాయి. ఈ తరహా చీకటి లావాదేవీలు బయటికొస్తే కాగ్ ఇప్పుడు చెబుతున్న రూ. 1.85 లక్షల కోట్లు అనేది చాలా చిన్న మొత్తంగా మిగిలిపోయే ప్రమాదముంది.

మౌలిక సదుపాయాల రంగం బలహీనంగా ఉందన్న ఉద్దేశంతో సిమెంట్, విద్యుత్తు, ఉక్కు రంగాలను ప్రోత్సహించడం కోసం ఆయా పరిశ్రమల సొంత అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గు క్షేత్రాలను కేటాయించామని ప్రభుత్వం అంటోంది. ఆ బొగ్గును వాణిజ్య అవసరాలకోసం ఉపయోగించరాదనే షరతు ఉన్నందువల్ల మార్కెట్ రేటు ప్రకారం లెక్కేసి భారీగా నష్టం వచ్చిందని చెప్పరాదని కూడా వాదిస్తోంది. ప్రభుత్వ వాదన నిజమే అనుకున్నా...దాన్ని వేలం ద్వారా కేటాయించడానికి ప్రభుత్వానికున్న అభ్యంతరమేమిటి? పైగా వేలం ద్వారానే బొగ్గు గనుల కేటాయింపు జరగాలని 2004లో స్వయంగా మన్మోహనే అభిప్రాయపడ్డారు. 

అందుకు అనుగుణమైన చట్టం చేయడానికి ఆనాటినుంచి ఈనాటి వరకూ పీఎంఓ ఏదో సాకు చూపి అడ్డుకుంటూనే ఉన్నది. ఇప్పుడు కాగ్ నివేదిక ఈ విషయంలో ప్రధానిని నేరుగా తప్పుపట్టకపోవచ్చుగానీ అది చేసిన విమర్శలన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఎందుకంటే, బొగ్గు మంత్రిత్వ శాఖ వ్యవహారాలను 2006-09మధ్య నేరుగా ఆయనే పర్యవేక్షించారు. ఇప్పుడున్న విధానం ఎంత లోపభూయిష్టమైనదో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూర్చిన వ్యవహారం చూస్తేనే అర్ధమవుతుంది. ఆ సంస్థ ఆధ్వర్యంలోని ససాన్ పవర్ ప్రాజెక్టు ఉత్పత్తిచేసే 3,960 మెగావాట్ల విద్యుచ్ఛక్తికి రెండు బొగ్గు క్షేత్రాలను తొలుత కేటాయించారు. ఆ ప్రాజెక్టుకు అది సరిపోతుందని నిపుణులు అంచనావేశారు. అయినా, ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన బొగ్గు క్షేత్రాన్ని లాక్కొని, దాన్ని ససాన్ పవర్ ప్రాజెక్టుకు కట్టబెట్టారు. 

ఆ తర్వాత అక్కడ మిగులు బొగ్గు ఉందంటూ రిలయన్స్ తన ఆధ్వర్యంలోనే ఉన్న చిత్రాంగి పవర్ ప్రాజెక్టుకు దాన్ని తరలించడం ప్రారంభించింది. సరైన చట్టాలు, తగిన నిబంధనలూ ఉంటే ఇలా గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం చేకూర్చడం సాధ్యమయ్యేది కాదు. బొగ్గు అపురూపమైన ప్రకృతి వనరు. వచ్చే అయిదేళ్లలో దేశంలో అదనంగా ఉత్పత్తి చేయాలనుకుంటున్న 76,000 మెగావాట్ల విద్యుత్తుకు అది ప్రధాన ఆధారం. దేశ భవిష్యత్తుతో ఇంతగా ముడిపడి ఉన్న ఈ వనరును బాధ్యతారహితంగా, ఇష్టానుసారంగా ఎవరెవరికో కట్టబెట్టడమంటే అది ఘోరమైన నేరం. ఈమధ్య అన్నా బృందం తనపై అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ప్రధాని ఎంతగానో నొచ్చుకున్నారు. మరి కాగ్ నివేదికకు ఆయన జవాబేమిటి? యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐలాంటి జేబు సంస్థ ద్వారా కాక, ఒక స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు అంగీకరించాలి. నిజానిజాలేమిటో ఈ దేశ ప్రజలను తెలుసుకోనివ్వాలి. 
Share this article :

0 comments: