ఫీజు గోడు పట్టదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫీజు గోడు పట్టదా?

ఫీజు గోడు పట్టదా?

Written By news on Tuesday, August 14, 2012 | 8/14/2012

* ఇంజనీరింగ్ ఫీజుపై ప్రభుత్వం దోబూచులాట
* అడుగడుగునా నిర్లక్ష్యం.. అంతులేని జాప్యం
* విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం
* ఇంత జరుగుతున్నా స్పందించని సీఎం

హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడుతోంది. ఇంజనీరింగ్ కోర్సుల ఫీజును త్వరగా ఖరారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడుపుతోంది. కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలన్న పట్టింపునే కనబరచడం లేదు. ప్రభుత్వ తీరులో అడుగడుగునా నిర్లక్ష్యం, అంతులేని జాప్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఎంతసేపూ ఖజానాపై భారాన్ని ఎలా తగ్గించుకోవడమా అనే కోణంలోనే ఆలోచిస్తోంది తప్ప లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు మొక్కుబడి సమావేశాలు పెట్టి, తామేదో చేస్తున్నామని చెప్పుకోవడంతో సరిపెడుతున్నారని అధికారులు కూడా వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యంతో, పంతాలకు పోయి లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని వారంటున్నారు.

పితాని చెప్పిందొకటి.. జరిగిందొకటి
ప్రభుత్వ ప్రతిపాదనకు కాలేజీలు అంగీకరించాయని ఆదివారం వాటి యాజమాన్యాలతో చర్చల అనంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ పితాని సత్యనారాయణ చెప్పారు. వాటినుంచి హామీ పత్రాలు తీసుకుని సోమవారమే కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించామనీ అన్నారు. రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానాన్నే కొనసాగిస్తామని, సీఎంతో మాట్లాడి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. కానీ సోమవారం అంతా అందుకు సరిగ్గా విరుద్ధంగా జరిగింది. 

ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు, రీయింబర్స్‌మెంట్ విధానంపై ఎక్కడా చర్చే జరగలేదు. పితాని తన సొంత జిల్లాలో, ఉప ముఖ్యమంత్రి సచివాలయంలోని తన చాంబర్‌లో గడిపారు. ఉపసంఘంలోని మిగతా మంత్రులెవరూ ఫీజుల గురించి పట్టించుకోనే లేదు. చర్చల సాకుతో ఎంతసేపూ యాజమాన్యాలను బెదిరించి దారికి తెచ్చుకోజూశారే తప్ప పరిష్కార మార్గాలపై మంత్రులు దృష్టే పెట్టలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా తమను బెదిరించారని కాలేజీల యాజమాన్యాలంటున్నాయి. మరోవైపు పితాని చెప్పినట్టుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇవ్వలేమంటూ ఉన్నత విద్యా మండలి చేతులెత్తేసింది. 

ప్రభుత్వం ఫీజులు నిర్ణయిస్తే తప్ప కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించలేమని మండలి చైర్మన్ వెల్లడించారు. ఇక కాలేజీల నుంచి తీసుకోవాల్సిన అంగీకార పత్రాల విషయంలోనూ వాటికీ ప్రభుత్వానికీ విభేదాలే పొడసూపాయి. ప్రభుత్వం తమకు ఒకటి చెప్పి, మరోటి చేస్తూ మోసగిస్తోందని కాలేజీలు ఆరోపించాయి. సమస్య పరిష్కారానికి సీఎంను కలుస్తామని స్పష్టం చేయడంతో సోమవారం సీన్ మొత్తం రివర్సయింది. ఫీజులపై స్పష్టత వచ్చి కౌన్సెలింగ్ తేదీల ఖరారుకు వారమైనా పట్టొచ్చనే సంకేతాలు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

సీఎం జోక్యమేదీ..!?
ఇంత జరుగుతున్నా సీఎం కిరణ్ తనకేమీ పట్టదనే విధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాదిగా ఇంజనీరింగ్‌కోర్సుల్లో చేరే విద్యార్థులకు సంబంధించిన అతి కీలకమైన అంశంలోనూ కిరణ్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన సమస్యను మంత్రులు, అధికారుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడి మార్గనిర్దేశనం చేయాల్సింది పోయి, వాళ్లే తేల్చుకొస్తారు లెమ్మనే ధోరణిలో వెళ్తున్నారు’’ అంటూ అధికార పక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో దీనిపై కొందరు అధికారులు సీఎంను కలిసినా తానొక్కడిని ఏమీ చేయలేనని, ఉపసంఘంతో మాట్లాడి ఏదో ఒకటి నిర్ణయించుకు రావాలని కుండబద్దలు కొట్టారంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంపై భారం పడని మార్గం చూడాలని ఉప సంఘానికి కిరణ్ నిర్దేశించారంటున్నారు.
Share this article :

0 comments: