30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే మేం 60 ఏళ్లుగా కలిసి ఉన్నాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే మేం 60 ఏళ్లుగా కలిసి ఉన్నాం

30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే మేం 60 ఏళ్లుగా కలిసి ఉన్నాం

Written By news on Sunday, October 27, 2013 | 10/27/2013

అమ్మా సోనియాగాంధీ..
 
 1968లో మీకు రాజీవ్‌గాంధీతో పెళ్లయ్యింది. ఆ తర్వాత 15 ఏళ్లకు అంటే 1983లో మీరు భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ 30 ఏళ్లలో భారత పౌరసత్వం తీసుకుని మాలో ఒకరిగా అయ్యారు. ఇవ్వాళ పార్లమెంటులో బిల్లు తెచ్చి.. భారత పౌరసత్వం తీసుకున్న వారంతా వెనక్కి వెళ్లాలంటే మీకు నచ్చుతుందా అమ్మా..?
 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే మేం 60 ఏళ్లుగా కలిసి ఉన్నాం.
 మాకెంత బాధ ఉంటుంది?
 
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తుదివరకూ అలుపెరుగని పోరాటం కొనసాగిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అశేష జనవాహినికి పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న పోరాటం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అభివర్ణించారు. రాష్ట్రాన్ని నిరంకుశంగా విభజించేందుకు ముందుకు వెళుతున్న ఢిల్లీ కోటను బద్దలు కొడదామని పిలుపునిచ్చారు.
 
 ‘‘ఈ రాష్ట్రం ముక్కలు కాకుండా పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకూ పోరాటం చేస్తూనే ఉందాం. రేపు జరగబోయే ఎన్నికల వరకూ పోరాటం చేద్దాం. రాష్ట్రంలో 30 పార్లమెంటు స్థానాలను మనమే గెలిపించుకుందాం. ఆ తరువాత ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం. ఎలా విభజిస్తారో చూద్దాం. ఇక్కడ 30 లోక్‌సభ స్థానాలు మనమే తెచ్చుకుని.. రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని స్థానంలో కూర్చోబెడదాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దాం...’’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పూరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శనివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభలో అశేష జనవాహినిని ఉద్దేశంచి ఆయన 45 నిమిషాల పాటు ప్రసంగించారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో తల్లడిల్లుతున్న కోట్లాది మంది ప్రజల ఆవేదనను జగన్ ఎలుగెత్తిచాటారు.
 

 ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును తూర్పారబట్టారు. తన కొడుకు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయటానికి కోట్ల మంది తల్లుల కొడుకులు, కూతుళ్ల భవిష్యత్తును కాలరాస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైఖరిని ఎండగట్టారు. విభజనకు వంత పాడుతూ ఓట్లు, సీట్లు పోతాయని.. ప్యాకేజీల పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, సోనియాకు మడుగులొత్తుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరూ 80 రోజులుగా ఉద్యమిస్తోంటే.. ఆ ముగ్గురిలో ఒక్కరూ ఆలోచించకపోవటం ఎంతో బాధకలిగిస్తోందన్నారు. అడ్డగోలుగా విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరు తప్ప మంచి నీరులేని దిగువ రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పదేళ్లలో విడిచిపెట్టిపోవాలంటే.. చదువు అయిపోయిన ప్రతిపిల్లాడు సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ ల కాలర్ పట్టుకుని.. తాము ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలని అడిగితే ఏం సమాధానం చెబుతారని జగన్ నిలదీశారు.
 
హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం లేకపోతే దిగువ రాష్ట్రంలో జీతాలకు, పథకాలకు డబ్బులెక్కడి నుంచి వస్తాయన్నారు. ‘‘30 ఏళ్ల క్రితం భారతదేశ పౌరసత్వం తీసుకున్న సోనియాగాంధీకి ఈ దేశంపై ఇంత వ్యామోహం ఉంటే 60 ఏళ్లుగా కలిసి ఉన్న తెలుగు ప్రజలను విడదీస్తే మనకెంత బాధ ఉంటుంది..? ఈ దేశ పౌరసత్వం తీసుకున్నవాళ్లంతా మీ దేశాలకు వెళ్లిపోండని పార్లమెంటులో బిల్లు తెస్తే సోనియాగాంధీకి నచ్చుతుందా..?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాలాంధ్ర కోసం ఇరు ప్రాంతాల్లో ఎందరో మహనీయుల ఆకాంక్షలు, వారు జరిపిన  పోరాటం, వారి త్యాగాల చరిత్రను సోనియాగాంధీ తెలుసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ కేంద్రం నిరంకుశ విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని దేశ రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకుంటే.. రేపు మిగతా రాష్ట్రాలకూ ఇదే పరిస్థితి వస్తుందని జగన్ హెచ్చరించారు. ఓట్ల కోసం సీట్ల కోసం విభజించి పాలించే రాజకీయాలు తెరమరుగు కావాలన్నారు. జగన్ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే...
 
 కలిసుందామని వచ్చిన ప్రతి ఒక్కరికీ సలాం..
 

 ‘‘సమైక్య శంఖారావాన్ని పూరించి కలిసి ఉందామని అప్యాయత చూపిస్తూ, కలిసి ఉందామని నినదిస్తూ.. వర్షాల వల్ల, వరద ల వల్ల అపార నష్టం జరిగినా.. హైదరాబాద్ వరకూ రావడానికి కష్టమనిపించినా.. అన్ని బాధలనూ పక్కనబెట్టి లక్షలాదిగా తరలివచ్చిన అశేష జనవాహినికి.. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించి ఇక్కడికి పంపించిన ఆ కోట్లాది తల్లులకు, అక్కచెల్లెళ్లకు, అవ్వాతాతలకు, చిన్నారులకు, సోదరులకు, స్నేహితులకు చేతులు జోడించి శిరసు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయతీ చూడడం కోసం ఆరాటపడుతున్న ప్రతి హృదయానికీ సలాం చేస్తున్నా. రాజకీయాలంటే ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం కాదు.. రాజకీయం అంటే ప్రతి పేదవాడి మనసు తట్టాలని, ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలని.. అలా మనసు తట్టినప్పుడు, అలా గుండెచప్పుడు విన్నప్పుడు ఆ పేదవాడు ఆశీర్వదించినప్పుడే రాజకీయమని, అలా చేస్తేనే రాజకీయమని చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నా. మనుషులమోయి.. ఆటవస్తువులం కాదు.. మీ రాజకీయ చదరంగంలో పావులం అంతకంటే కాదు.. అన్యాయం చేస్తే ఊరికే చూస్తూ కూర్చోం.. వందేమాతర గీతం నినదిస్తాం.. విప్లవ జెండా అందుకుంటాం.. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి వెనకడుగు వేయమని చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరికీ సలాం చేస్తున్నా.
 
 ఇన్ని కోట్ల మంది ఉద్యమం వారికి పట్టదా?
 
 రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి పిల్లాడు గత 80 రోజులుగా పుస్తకాన్ని పక్కనబెట్టి.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తూ ఉద్యమబాట పట్టాడు. పనిచేస్తున్న ప్రతి ఒక్కరు 80 రోజులుగా తమకు రావాల్సిన జీతాలు వదులుకుని తినడానికి తిండి దొరికే పరిస్థితి లేకపోయినా ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమ బాటపట్టారు. విభజిస్తే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని 80 రోజులుగా రైతన్న నాగలి పక్కనపెట్టి ఉద్యమబాట పట్టాడు. అక్కాచెల్లెళ్లు తమ చంటిపిల్లలను చంకనవేసుకుని రోడ్డుపైకొచ్చి పిల్లలను చూపిస్తూ.. వీరి భవిష్యత్తు ఏంటని ఉద్యమబాట పట్టారు. మేం రాజీనామా చేశాం. నిరాహార దీక్ష చేశాం. లేఖల మీద లేఖలు రాసి విభజించవద్దని జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నించాం. కానీ.. ఇన్ని కోట్ల మంది ఉద్యమాలు చేస్తుంటే.. వీరంతా ఎందుకు ఉద్యమం చేస్తున్నారని కనీసం ఆలోచన చేయలేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం విభజించవద్దని సోనియాగాంధీ ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. తన కొడుకును ప్రధానిని చేయాలన్న సోనియాగాంధీకి ఉద్యమాలను చూసి విభజన చేయవద్దని తట్టలేదా? ప్యాకేజీలని అడుగుతున్న చంద్రబాబుకు తట్టలేదా? మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి తట్టలేదా? నిజంగా ఈ వ్యవస్థ ఇంతలా దిగజారుతున్న పరిస్థితులు చూస్తుంటే బాధనిపిస్తోంది. వీళ్లందరూ మనుషులేనా అని బాధ కలుగుతోంది.
 
 ఇప్పుడు ట్రిబ్యునళ్లు, బోర్డులున్నా నీళ్లు వస్తున్నాయా?
 
 రాష్ట్ర విభజన కోసం ఉర్రూతలూగుతున్న సోనియాగాంధీని అడగదలుచుకున్నా.. ప్యాకేజీలంటూ మోసం చేస్తున్న చంద్రబాబును అడగదలుచుకున్నా.. పట్టపగలు మోసం చేస్తూ సోనియా గీతను దాటని కిరణ్‌కుమార్‌రెడ్డిని అడగదలుచుకున్నా.. సమైక్యంగా ఉన్నప్పుడే కృష్ణానది నీళ్ల పరిస్థితిని చూడండి. రాష్ట్రంలో ఇప్పుడు ట్రిబ్యునళ్లు లేవా? బోర్డులు లేవా? కోర్టులు లేవా? అవన్నీ ఉన్నపుడే.. కృష్ణానది నీళ్లు పైన మహారాష్ట్ర అవసరాలు తీరాకే కింద కర్ణాటకకు వస్తున్నాయి. కర్ణాటకలోని నారాయణ్‌పూర్, ఆల్మట్టి డ్యాములు నిండాక గానీ మన రాష్ట్రానికి రాని పరిస్థితి. ఇది మీకు కనిపించడం లేదా? కళ్లుండీ చూడలేని కబోదులా? ఈ పరిస్థితుల్లో మన మధ్య మరో రాష్ట్రం వస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయి? నాగార్జునసాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? విభజన సంకేతాలు అందగానే మహారాష్ట్ర, కర్ణాటకలు నికరజలాల్లో వాటా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మిగులు జలాల్లో హక్కు అడుగుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఒకటి చెబితే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకోటి చెబుతుంది.
 
 ఒక్కటిగా ఉన్నప్పుడే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడుతుంటే కనిపించడం లేదా? కింద కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రం తప్ప తాగడానికి మంచినీళ్లు ఏవీ? ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారు? మహబూబ్‌నగర్‌లోని బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? నల్లగొండలో ఎస్‌ఎల్‌బీసీకి ఎక్కడి నుంచి వస్తాయి? రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెలిగొండ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజలస్రవంతి పథకాలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా ఆయకట్టులో రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? కావేరి నదీ జలాలపై కర్ణాటక, తమిళనాడు ప్రతి సంవత్సరం కొట్టుకునే పరిస్థితి. ప్రతి సంవత్సరం కోర్టులు, ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. అయినా ఏటా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ట్రిబ్యునళ్లు లేవా? బోర్డులు లేవా? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారట. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశాక నీళ్లెలా ఇస్తారు? ప్యాకేజీలు ఇస్తే సరిపోద్దంటున్నారు. ఇంకో ట్రిబ్యునల్, ఇంకో బోర్డు ఇస్తామంటున్నారు. మీ చావు మీరు చావండని అంటున్నారు. చంద్రబాబు ఇదే గొప్ప ప్యాకేజీ అని మోసం చేస్తూ ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లా పాలకులు?
 
 60 ఏళ్లుగా కలిసున్న మాకు ఎంత బాధగా ఉంటుంది?
 
 వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రెండుసార్లు సోనియాగాంధీని ప్రధానమంత్రి సీటులో కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చారు. కానీ ఆయన చనిపోయాక సోనియాగాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేసేందుకు ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రంతో చెలగాటమాడుతున్నారు. నీ కొడుక్కి ఉద్యోగం కోసం మా కొడుకుల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతారా? అమ్మా సోనియాగాంధీ.. 1968లో నీకు రాజీవ్‌గాంధీతో పెళ్లయ్యింది. ఆ తర్వాత 15 ఏళ్లకు అంటే 1983లో మీరు భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ 30 ఏళ్లలో భారత పౌరసత్వం తీసుకుని మాలో ఒకరిగా అయ్యారు. ఇవ్వాళ పార్లమెంటులో బిల్లు తెచ్చి.. భారత పౌరసత్వం తీసుకున్న వారంతా వెనక్కి వెళ్లాలంటే మీకు నచ్చుతుందా అమ్మా..? సోనియాగాంధీ గారికి అది నచ్చదు. కాంగ్రెస్ వారంతా కల్లుతాగిన కోతుల్లా రెచ్చిపోతారు. 30 ఏళ్లకే నీకు ఇంత వ్యామోహం ఉంటే మేం 60 ఏళ్లుగా కలిసి ఉన్నాం. మాకెంత బాధుంటుంది.
 
 రాష్ట్రం అన్ని రకాలుగా నాశనం అవుతోంది..
 
 హైదరాబాద్ నుంచి ఆదాయం రాష్ట్ర బడ్జెట్‌లో సగానికి పైగా ఉంటుంది. పదేళ్లలో విడిచిపెట్టి పోవాలంటున్నారు. ఈ డబ్బులు రాకపోతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మా వద్ద డబ్బులెక్కడి నుంచి వస్తాయి? సంక్షేమ పథకాలు అమలుచేసేందుకు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్‌లో చిన్నచిన్న మనుషులు చిన్నచిన్న వ్యాపారాలు, చిన్నచిన్న షాపులు నిర్వహిస్తూ చిన్నచిన్న ఇళ్లు కట్టుకుని, ఫ్లాట్లు కట్టుకుని వాటిల్లో బతుకుతున్నారు. విభజన జరిగితే వారి ఆస్తుల విలువ సగానికి పడిపోతే ఆ విలువను సోనియాగాంధీ ఇస్తారా? చంద్రబాబు ఇస్తారా? దేశంలో హిందీ తరువాత రెండో అతిపెద్ద జాతి తెలుగుజాతి. 28 రాష్ట్రాలు ఉన్న మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఒకసారి విభజన జరిగితే 17 లోపు ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలు 12 అవుతాయి. ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్న రాజకీయాల కారణంగా రాష్ట్రం అన్ని రకాలుగా నాశనం అవుతుంది.
 
 విభజన కోసం బాబు ఢిల్లీలో దీక్ష చేశారు...
 
 చంద్రబాబు దగ్గరికి ఏపీఎన్‌జీవోలు పోయి విభజన కోసం ఇచ్చిన లేఖను వెనక్కితీసుకోవాలని, సమైక్యాంధ్ర కోసం పాటుపడాలని ప్రాధేయపడితే.. ఆయన నిర్దయగా ‘ఆ లేఖను నేను వెనక్కి తీసుకోను. బెంగళూరు, చెన్నై నగరాల్లో తెలుగువాళ్లు ఎలా బతుకుతున్నారో ఇక్కడ కూడా బతుకుతారు’ అని చెప్పారట. మూడు పార్టీలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నాయని, మీరు కూడా వ్యతిరేకిస్తూ రాజీనామా చేయాలని ఎన్‌జీవోలు అడిగితే.. నిర్దయగా ‘చేయను పో’ అని చెప్పారట. అంతటితో ఆగలేదు. ఢిల్లీ వెళ్లి ఏకంగా విభజన చేయాలంటూ నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష సమయంలో ఎవరెవరితో ఏం మాట్లాడారో నాకు తెలియదు గానీ.. దీక్ష అయ్యేలోగా ఇక్కడ కిరణ్ ఉద్యమ సంఘాలను పిలిచి బెదిరించి ఒక్కొక్కరిగా సమ్మె విరమణ చేయించారు. వీళ్లు మనుషులేనా? పట్టపగలే మోసం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.
 
 ముందే ‘తీర్మానం’ చేద్దామన్నా కిరణ్ స్పందించలేదు
 
 రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ ఎందుకు రాజీనామా చేయలేదు? సోనియాగాంధీ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు అంతా అయిపోయాక రాజీనామా చేసి మొసలి కన్నీరు కారుస్తారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఆమోదం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ విభజిస్తున్నారు. కేబినెట్ నోట్‌కు ముందే అసెంబ్లీని సమావేశపరిచి మనం సమైక్యంగా ఉండాలని తీర్మానించి పంపుదామని, అలా పంపితే దేశం మొత్తం చూస్తుందని, అలజడి పుడుతుందని కిరణ్‌ను కలిశాం. గవర్నర్‌ను కలిసి ప్రాధేయపడ్డాం. కానీ ఎవరూ పలుకలేదు. ఆ తరువాత నేను నిరాహార దీక్ష చేశా. గతంలో అమ్మ చేసింది. మళ్లీ కిరణ్‌గారిని అడిగాం. కార్యాలయం వద్ద ధర్నా చేశాం. ఇప్పటికైనా ముసాయిదా బిల్లు రాకముందే సమావేశమై సమైక్యంగా ఉండాలని తీర్మానం పంపుదామని ముఖ్యమంత్రిని, గవర్నర్‌ను అడిగాం. కానీ మేం చేసిన ప్రతి ప్రయత్నం అరణ్యరోదనే అయ్యింది. మన రాష్ట్రంలో ఉండి వెన్నుపోటు పొడుస్తున్న తీరుతో బాధ కలుగుతోంది.
 
 చంద్రబాబు, కిరణ్‌ల గూబలు అదిరేలా చెప్పండి
 
 ఇక్కడ జరుగుతున్న పోరాటం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను మీకు.. అందుకు మీరంతా అవుననో కాదనో సమాధానం చెప్పాలి. ఢిల్లీకి వినబడేలా చెప్పాలి. చంద్రబాబు, కిరణ్ గూబలు అదిరేలా చెప్పాలి. ఈ విడగొట్టడాన్ని ఒప్పుకొంటారా?... (ఒప్పుకోబోమని దిక్కులు పిక్కటిల్లేలా సభికుల నినాదాలు.) తెలుగులో చెబితే వాళ్లకు అర్థం కాదు. నో అని చెప్పండి. తెలుగుజాతి రెండు ముక్కలు కావాలా? నీటికోసం కొట్టుకోవాలా? మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకు చావాలా? అన్నదమ్ముల మధ్య రోజూ గొడవలుండాలా? తెలుగు జాతికి అన్యాయం చేస్తున్న సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా? నీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అటకెక్కితే చూస్తూ ఊరుకోవాలా? (అన్నింటికీ సభికుల నుంచి పెద్ద ఎత్తున ‘నో’ అనే సమాధానం) ఇప్పటికైనా జ్ఞానోదయమై చరిత్రహీనులుగా మిగిలిపోకుండా తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తారని ఆశిస్తున్నా. శీతాకాల సమావేశాల వరకూ పోరాటం చేస్తూనే ఉందాం. అవసరమైతే రేపు జరగబోయే ఎన్నికల వరకు పోరాటం చేద్దాం. 30 లోక్‌సభ స్థానాలను మనమే గెలిపించుకుందాం. ఆ తరువాత ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం. ఎలా విభజిస్తారో చూద్దాం. ఇక్కడ 30 పార్లమెంటు స్థానాలు మనమే తెచ్చుకుని రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని స్థానంలో కూర్చోబెడదాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దాం. జై తెలుగుతల్లి. జై సమైక్యాంధ్రప్రదేశ్. జై వైఎస్సార్.’’
 
 విపత్తు మృతులకు సంతాపం...
 
 జగన్‌మోహన్‌రెడ్డి సభలో తన ప్రసంగానికి ముందు.. రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ‘ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మకు శాంతి కలిగేలా ఒక నిమిషం పాటు అందరం కూడా మౌనం పాటిద్దాం’ అంటూ ఆయనతో పాటు సభికులంతా మౌనం పాటించి నివాళులర్పించారు.
 
 
 వాళ్ల ముగ్గురి కాలర్ పట్టుకుని అడిగితే ఏం చెప్తారు?
 
 నిజంగా బాధనిపిస్తుంది హైదరాబాద్ నగరాన్ని చూస్తున్నప్పుడు. హైదరాబాద్‌ను పదేళ్లలో విడిచిపెట్టిపోవాలంట ? చదువు అయిపోయిన ప్రతిపిల్లాడు సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ .. ఈ ముగ్గురిని కాలర్ పట్టుకుని.. ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలని అడిగితే ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రంలో హైదరాబాద్ అనేది మహానగరం. ఎక్కడైనా, ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే మహానగరం, సముద్రాలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు అన్నీ ఒక్కటిగా ఉండాలి. అన్నీ ఒక్కటిగా ఉన్నప్పుడు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి. ఉద్యోగాలొస్తాయి. కానీ గత మూడేళ్లలో వీళ్లు చేసిన పాపానికి.. దేశం మొత్తం మీద పెట్టుబడులు ఆకర్షించడంలో మూడు లేదా నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ 12వ స్థానానికి పడిపోయింది. చివరికి కోయంబత్తూరు కూడా ఏడో స్థానంలో ఉంది. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు హైదరాబాద్ పరిస్థితి ఒక్కసారి గమనించండి. కళాశాలలకే కంపెనీలు వచ్చి క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ల ద్వారా ఏటా 57 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మూడేళ్లకూ కలిపి 25 వేలకు పడిపోయింది. హైదరాబాద్ ను ఎలా నాశనం చేశారో ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?
 

 విశాలాంధ్ర చరిత్ర సోనియాకు తెలుసా?
 
 సోనియాగాంధీని ప్రశ్నించదలుచుకున్నా. అమ్మా.. అసలు నీకు విశాలాంధ్ర చరిత్ర తెలుసా? తెలుగువాళ్లంతా ఒక్కటిగా ఉండాలని 1955లో తెలంగాణ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విశాలాంధ్ర కోసం పాటుపడ్డారు. ఆ రోజు అసెంబ్లీలో 147 మంది సభ్యులకు 103 మంది సభ్యులు విశాలాంధ్ర కోసం ఓటేసి తెచ్చుకున్న సమైక్యాంధ్ర రాష్ట్రం ఇది. విశాలాంధ్ర కావాలని పోరాటం చేసిన రావి నారాయణరెడ్డి నీకు తెలుసా? మాడపాటి హనుమంతరావు తెలుసా? సురవరం ప్రతాపరెడ్డి తెలుసా? డాక్టర్ జయసూర్య తెలుసా? రావి నారాయణరెడ్డి ఏమన్నారో తెలుసా..? ‘వీర తెలంగాణ నాది.. వేరు తెలంగాణ కాదు’ అని అన్నాడు. చీలికవాదం తెలంగాణకు హానికరం అన్న మాటలు గుర్తుతెచ్చుకోవాలి. మీ అత్తగారైన ఇందిరాగాంధీ 1972 డిసెంబర్ 21న ప్రధానమంత్రి హోదాలో పార్లమెంటులో చేసిన ప్రసంగం చదువు తల్లీ. ‘1972లో నేనున్నా.. 1955 నాకు ఇంకా గుర్తుంది. దక్షిణ భారతదేశంలో తిరుగుతున్నా. విశాలాంధ్ర కావాలని తెలుగువాళ్లు ఘోషపెడుతున్నప్పుడు ఆ మాటలు ఇవాళ్టికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయ’ని ఇందిర అన్నారు. విశాలాంధ్ర అంటే తెలంగాణ కూడా అని అర్థం. రాయలసీమ అని కూడా అర్థం. కోస్తాంధ్ర అని కూడా అర్థం. బలమైన రాష్ట్రాన్ని చీల్చి బలహీనం చేసే మీ ప్రయత్నం న్యాయమేనా? .
 
 ఈ అన్యాయాన్ని చూస్తూ ఉంటే..రేపు మీ వెనక ఎవ్వరూ ఉండరు!
 
 రాష్ట్రాన్ని విభజించటానికి కేంద్రం చేస్తున్న నిరంకుశ ప్రయత్నానికి.. మార్టిన్ నిమోలర్ అనే ఒక జర్మన్ మేథావి రాసిన ఒక వాక్యం అద్దం పడుతుంది. హిట్లర్ తన సేనలతో నరమేథం సృష్టించేందుకు వస్తున్న సమయం అది. ‘హిట్లర్ సేనలు నాజీలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు.. నేను కమ్యూనిస్టు కాదు కదా.. నాకోసం కాదు కదా అని గమ్ముగా ఉండిపోయాను. తరువాత నాజీలు సోషలిస్టుల కోసం వచ్చారు.. నేను సోషలిస్టును కాదు కదా.. నా కోసం కాదు కదా అని గమ్ముగా ఉండిపోయాను. తరువాత ట్రేడ్ యూనియన్ నేతల కోసం వచ్చారు. నేను ట్రేడ్ యూనియన్ నేతను కాదు కదా.. వాళ్లొచ్చింది నాకోసం కాదు కదా.. అని మళ్లీ గమ్ముగా ఉండిపోయాను. తరువాత యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాదు కదా.. వాళ్లొచ్చింది నా కోసం కాదు కదా అని గమ్ముగా ఉండిపోయాను. తరువాత నాజీలు నా ఇంటికోసం వచ్చారు. నా కోసం వచ్చారు.
 
నేను వెనక్కి తిరిగి చూసేసరికి నా కోసం ఎవ్వరూ కనిపించలేదు’ అని ఆయన రాసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం విషయంలో అదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ తీర్మానాన్ని పక్కనబెట్టి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీచేస్తున్న తీరుపై దేశ రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం మీరు చూస్తూ ఊరుకుంటే రేపు బెంగాల్‌కు వస్తారు.. మమతాబెనర్జీ, కమ్యూనిస్టుల వెనక ఎవరూ ఉండరు. తమిళనాడుకూ వస్తారు.. కరుణానిధి, జయలలిత, చిదంబరం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరు. ఒడిశాకూ వస్తారు.. నవీన్‌పట్నాయక్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరు. కర్ణాటకకూ, పంజాబ్‌కూ వస్తారు.. పంజాబ్‌లో మన్మోహన్‌సింగ్ ఆమోదిస్తారేమో తెలియదు కానీ అక్కడి నాయకులు, ప్రజలు వెనక్కితిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరు. ఇక్కడ జరుగుతున్న తీరు రేపు ఇంకొక రాష్ట్రంలో జరగొచ్చు. విభజించి పాలించడం, ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేయడం తెరమరుగుకావాలి.
 
 జగన్‌కు జస్టిస్ లక్ష్మణరెడ్డి సంఘీభావం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి సమైక్య శంఖారావం వేదికపై వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. జనసంద్రంలో చిక్కుకున్న జస్టిస్ లక్ష్మణరెడ్డి ఎల్బీ స్టేడియానికి ఆలస్యంగా చేరుకున్నారు. అందువల్ల వేదికపై నుంచి ఆయన ప్రసంగించలేకపోయారు. సభ ముగిసే సమయానికి వేదిక వద్దకు చేరుకున్న ఆయనను జూపూడి ప్రభాకరరావు తీసుకెళ్లి జగన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న జగన్‌కు జస్టిస్ లక్ష్మణరెడ్డి సంఘీభావం ప్రకటించారు.
Share this article :

0 comments: