ఓటింగ్‌పై స్పష్టత ఏదీ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటింగ్‌పై స్పష్టత ఏదీ?

ఓటింగ్‌పై స్పష్టత ఏదీ?

Written By news on Friday, January 24, 2014 | 1/24/2014

ఓటింగ్‌పై స్పష్టత ఏదీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు సంబంధించి శాసనసభలో ఓటింగ్ నిర్వహించే విషయంలో ఇప్పటివరకు ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మ అసెంబ్లీలో స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించారు. తొలుత చర్చకు అవకాశం ఇచ్చి తర్వాత ఓటింగ్ సంగతి చూద్దామని పేర్కొన్నా ఇప్పటివరకు ఓటింగ్ మాటే ఎత్తడం లేదని ఆమె అన్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే టీ బిల్లుపై ఓటింగ్‌కు డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభను 15 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్ తిరిగి ప్రారంభం కాగానే నేరుగా చర్చకు అవకాశం కల్పించారు.
 
వైఎస్సార్‌సీపీ సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగటంతో విజయమ్మకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచీ తమ పార్టీ ఓటింగ్ కోసం పట్టుపడుతున్న విషయూన్ని ఆమె గుర్తుచేశారు. దీనికి నేరుగా సమాధానం చెప్పని స్పీకర్.. బీఏసీలో చర్చించుకున్న విధంగానే సభను నిర్వహిస్తున్నానని, దీనికి సంబంధించి పలుమార్లు సభ్యులకు స్పష్టత ఇచ్చానని అన్నారు.
 
 కోడలు వల్లే ముక్కలు: ప్రసన్న
 
 అత్త ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచితే, ఆమె కోడలు సోనియా గాంధీ ముక్కలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. విడిపోవడం వల్ల అన్ని ప్రాంతాల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇంతకంటే పెద్ద ఉద్యమాలు వచ్చినా ప్రభుత్వం అణచివేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
 
 సీమాంధ్ర ఎడారే: అమర్‌నాథ్‌రెడ్డి
 
 తెలంగాణ ఏర్పడితే తాగునీరు, సాగునీరు లేక సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యుడు అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. విభజనకు వ్యతిరేకంగా గడచిన 180 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు.
Share this article :

0 comments: