వైఎస్ విగ్రహానికి నాలుగడుగుల స్థలం ఇవ్వరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ విగ్రహానికి నాలుగడుగుల స్థలం ఇవ్వరా?

వైఎస్ విగ్రహానికి నాలుగడుగుల స్థలం ఇవ్వరా?

Written By news on Thursday, January 23, 2014 | 1/23/2014

వారిద్దరినీ చెత్తబుట్టలో విసిరేయాలి
  • సమైక్య శంఖారావం యాత్రలో కిరణ్, చంద్రబాబుపై జగన్ మండిపాటు
  •  కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకే సోనియా రాష్ట్రాన్ని విభజిస్తున్నారు
  •  దీనికి ప్రతిపక్ష నేత, సీఎం సహకరిస్తున్నారు
  •  చంద్రబాబు నోట సమైక్యం అన్న మాట రాదేం?
  •  సమైక్యం అంటున్న సీఎం అసెంబ్లీలో ఆ మేరకు ఎందుకు తీర్మానం చేయలేదు?
  •  30 ఎంపీ సీట్లు గెల్చుకుని వీళ్లకు బుద్ధి చెబుదాం
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఓట్లు, సీట్ల కోసం.. తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చేందుకు సిద్ధపడితే.. అందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్  వంత పాడుతున్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మాభిమానానికి నడుమ జరుగుతున్న ఈ సమరంలో.. విలువలు, విశ్వసనీయత లేని కిరణ్, చంద్రబాబులను చెత్తబుట్టలో విసిరేయాల్సిందే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. విభజన కుట్రదారులైన సోనియా, కిరణ్, చంద్రబాబులకు బుద్ధి వచ్చేలా వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను మనమే గెల్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ చేపట్టిన ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగో విడత మూడోరోజున బుధవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సాగింది. కొత్తపల్లిమిట్ట కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 బాబూ.. నువ్వు నాయకుడివేనా?
 వైఎస్ మరణం తర్వాత ఒక్క రాజకీయ నాయకుడికి కూడా‘విశ్వసనీయత’ అన్న పదానికి అర్థం తెలియకుండా పోయింది. రాజకీయాలను ఎత్తులు, పైఎత్తుల చదరంగంగా మార్చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని చూస్తున్నారు. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో చూడాలంటే.. టీవీ ఆన్ చేసి అసెంబ్లీ సమావేశాల ప్రసారం చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో కూర్చొని ఆయన పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. మరోవైపు తెలంగాణ నేతలతో విభజన డిమాండ్ చేయిస్తారు. అసలు మీరు ఒక నాయకుడేనా అని ప్రశ్నిస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే రెండో మాట లేకుండా సమైక్య రాష్ట్రం కావాలని డిమాండ్ చేయవచ్చు కదా? గతంలో ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవచ్చు కదా? అది చేయకుండా పార్టీ నేతలతో రెండు రకాలుగా మాట్లాడించే మిమ్మల్ని ఏమనాలి?
 
 సమైక్య ముసుగులో కిరణ్..: సోనియా రచించిన విభజన నాటకాన్ని సమైక్యవాది ముసుగులో కిరణ్ రక్తి కట్టిస్తున్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటుంటే.. సీఎంగా కిరణ్ చేస్తున్నదేమిటి? రంగురంగుల టీవీ ప్రకటనల్లో తనను తాను గొప్ప సమైక్యవాదిగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు సోనియా గీసిన గీత దాటకుండా రాష్ట్ర విభజనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశం కిరణ్‌కు ఉంటే.. అసెంబ్లీలో ఎప్పుడో ‘సమైక్య’ తీర్మానం చేసి ఉండేవారు.’’
 
 మూడో రోజు యాత్ర సాగిందిలా: నెలవాయి గ్రామంలో ఉదయం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమైంది. అక్కడ్నుంచి క్షీరసముద్రం, నాయుడుపల్లె, ఎస్‌ఆర్‌పురం క్రాస్, పుల్లూరు క్రాస్, శూలగిల్లు మీదుగా తెల్లగుండ్లపల్లె జగన్ చేరుకున్నారు. అక్కడ పోతగంటి నరసయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కొత్తపల్లి మిట్ట చేరుకుని సభలో ప్రసంగించి, వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కినేని భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించేం దుకు హైదరాబాద్‌కు వెళ్లారు. యాత్రలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, గాంధీ, వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం యాత్ర యథాతథంగా కొనసాగనుంది.
 
 వైఎస్ విగ్రహానికి నాలుగడుగుల స్థలం ఇవ్వరా?
 ఈ కూడలి (కొత్తపల్లిమిట్ట) పక్కనే దివంగత నేత వైఎస్ విగ్రహం ఉంది. అయితే ఆవిష్కరణ ఆగిపోయింది. కారణం ఆ విగ్రహానికి అనుమతి లేదట. వైఎస్సే లేకపోతే అసలు వీళ్ల ప్రభుత్వం ఉండేదా? మండుతున్న ఎండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను బతికించిన నేత విగ్రహం పెట్టడం కోసం నాలుగడుగుల స్థలానికి అనుమతి ఇవ్వని ఈ పాలకులను ఏమనాలి?
     -వైఎస్ జగన్
Share this article :

0 comments: