టీడీపీలో సీట్ల చిచ్చు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీలో సీట్ల చిచ్చు

టీడీపీలో సీట్ల చిచ్చు

Written By news on Tuesday, January 28, 2014 | 1/28/2014

టీడీపీలో సీట్ల చిచ్చు

బాబు అన్యాయం చేశారంటూ మోత్కుపల్లి, సోమిరెడ్డి ఆగ్రహం
సమైక్యం కోసం రాజీనామా చేసిన తనకు టికెట్
ఇవ్వాలన్న హరికృష్ణ విజ్ఞప్తిని పట్టించుకోని చంద్రబాబు
రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి, సీతారామలక్ష్మిల పేర్లు ఖరారు
పొలిట్‌బ్యూరో నేతలతో ఏకాంత సమావేశాల్లో అభ్యర్థుల పేర్లు చెప్పిన చంద్రబాబు
పార్టీ అధినేత అన్యాయం చేశారంటూ మోత్కుపల్లి, సోమిరెడ్డిల తీవ్ర ఆగ్రహం
సమైక్యం కోసం రాజీనామా చేసిన తనకు టికెట్ ఇవ్వాలని హరికృష్ణ విజ్ఞప్తి
బావమరిది వినతిని సైతం పక్కనపెట్టిన టీడీపీ అధ్యక్షుడు.. సీటు నిరాకరణ

 
తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చిచ్చు రేపింది. పార్టీ నేతల నిరసనలు, ఆగ్రహావేశాల మధ్య పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో అన్యాయం చేశారంటూ చంద్రబాబుపై పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయగా.. మరో నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుతిరిగారు.
 
  సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ తనకు మరోసారి అవకాశమివ్వాలని కోరినా పక్కనపెట్టటంతో ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున రాజ్యసభ బరిలో దింపడానికి ఇద్దరు నేతల పేర్లను ఖరారు చేయటంలో తీవ్ర అసంతృప్తులు, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు మాత్రం ముందుగా తాను అనుకున్నట్టే గరికపాటి మోహన్‌రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ముందునుంచి భావిస్తున్నట్టుగానే మరో స్థానం కోసం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పేరును ఖరారు చేశారు.
 
 చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ పేర్లను చెప్పి ఆమోదింపజేశారు. అనంతరం రాత్రి విలేకరుల సమావేశంలో వీరిద్దరి పేర్లను ప్రకటించారు. మంగళవారం వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వీరిని ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. సాధారణ ఎన్నికల తర్వాత అయితే మోత్కుపల్లికి రాజ్యసభ టికెట్ ఇచ్చే వాడినన్నారు. గరికపాటి టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు వియ్యంకుడు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. సీతారామలక్ష్మి కూడా సంపన్నురాలే. ఆమె భర్త సత్యనారాయణ జగదీష్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి అధిపతి.

 నేతలతో ఏకాంత చర్చలు: 
ప్రస్తుతం ప్రాంతీయ భావోద్వేగాలు నెలకొన్న పరిస్థితుల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఒక్కో సీటు ఇవ్వాలని టీడీపీ నేతలు పొలిట్‌బ్యూరో భేటీలో సూచించారు. ఈ సందర్భంగా బాబు నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి గరికపాటి, సీమాంధ్ర నుంచి నారాయణ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ పి.నారాయణ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప, తోట సీతారామలక్ష్మిల పేర్లను వారికి చెప్పారు. గతంలో కార్పొరేట్ సంస్థలు నడిపే వ్యక్తులకు సీట్లు ఇచ్చామన్న విమర్శలు ఉన్నందున ఈసారి అలా జరక్కుండా చూడాల్సిందిగా వారు కోరారు.
 
 మోత్కుపల్లి ఆగ్రహం.. బుజ్జగింపులు:  ఎంతో కాలంగా పార్టీకి సేవచేస్తుంటే ఈ రకంగా అవమానించడం దారుణమని చంద్రబాబు నివాసంలోనే నేతల వద్ద మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తాను పార్టీని కాపాడేందుకు ముందున్నానని, ఎన్‌టీఆర్ భవన్‌కు ఎవ్వరూ రాని సమయంలో తాను అక్కడే తిష్టవేసి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించానని, అలాంటి తనకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా ఆర్థికంగా బలవంతులైన వారికి పెద్దపీట వేయటం దారుణమని మండిపడ్డారు.
 
 ఆవేశంగా చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, చింతమనేని ప్రభాకర్ పరుగున వచ్చి ఆయన్ను నిలువరించారు. నామా ఆయనకు నచ్చచెప్పి తిరిగి బాబు నివాసంలోకి తీసుకెళ్లారు. బాబు విలేకరుల సమావేశం ముగిసే వరకూ నామా, ముద్దుకృష్ణమ తదితరులు ఆయన్ను బుజ్జగిస్తూనే ఉన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ సీటు కోరుకుంటే ఆ సీటు ఇస్తారని, ఎన్నికల ఖర్చు మొత్తాన్ని పార్టీ భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీలు ఇచ్చారు. అయినా ఆయన శాంతించలేదు.
 
 అర్ధంతరంగా సోమిరెడ్డి నిష్ర్కమణ..: రాజ్యసభ సీటును ఆశించిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పొలిట్‌బ్యూరో సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్ర్కమించారు. తన పేరు పరిశీలన దశలోనే తిరస్కరించారని పసిగట్టిన ఆయన చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అయ్యి అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయం చెప్పాల్సి ఉన్నప్పటికి వెనుదిరిగారు. ఫోన్‌లో కూడా ఆయన ఎవ్వరికీ స్పందించకుండా స్విచాఫ్ చేశారు.

 హరికృష్ణ కోరికా మన్నించలేదు..: 
సుదీర్ఘ విరామం తరువాత జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశానికి  నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నందున ఈసారి సీటు తనకే కేటాయించాల్సిందిగా కోరారు. రాజ్యసభ సీటును ఆశిస్తూ సమావేశంలో పాల్గొనటం సరికాదని బయటకు వెళ్లారు. చంద్రబాబు మాత్రం బావమరిది విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పొలిట్‌బ్యూరో సమావేశానికి ముందు చంద్రబాబు టీడీఎల్‌పీ కార్యాలయంలో శాసనసభ్యులతో సమావేశమయ్యారు. మరో ఎంపీ సి.ఎం.రమేష్ కాంగ్రెస్ తరఫున రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగిన జె.సి.దివాకర్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలతో రాజ్యసభ ఎన్నికలపై చర్చలు జరిపారు.
Share this article :

0 comments: