skip to main |
skip to sidebar
రైతుకు అండగా..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో జననేత పర్యటించనున్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు ఇతర వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3న జిల్లాకు రానున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జగన్ పర్యటనపై జిల్లా పార్టీ నాయకులతో శనివారం సమీక్ష జరిగింది. జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త హెనీ క్రిస్టినా, నాయకులు కత్తెర సురేష్‌కుమార్, మాజీ శాసనసభ్యు డు జంగా కృష్ణమూర్తి తదితరులు రాజధాని గ్రామాల్లోని పరిస్థితులను వివరించారు. అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు భూ సమీకరణలో రైతుల హక్కులకు భిన్నంగా వ్యవహరించారని చెప్పారు. ఇప్పటికే రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ, పార్టీ శాసన సభాపక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల్లో నమ్మకం కలిగించారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఉద్యమ ఫలితంగానే జరీబు గ్రామాల రైతులకు చివరి రెండు రోజుల్లో ప్రభుత్వం ప్యాకేజీ పెంచిందని, భవిష్యత్‌లోనూ ప్రభుత్వ పరంగా రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా వారికి అండగా ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలనే అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.
0 comments:
Post a Comment