ఇది చంద్రబాబు ఘోర వైఫల్యమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది చంద్రబాబు ఘోర వైఫల్యమే

ఇది చంద్రబాబు ఘోర వైఫల్యమే

Written By news on Monday, March 2, 2015 | 3/02/2015


ఇది చంద్రబాబు ఘోర వైఫల్యమే
- బడ్జెట్‌లో ఏపీకి ఏదీ సాధించలేకపోయారు: అంబటి రాంబాబు
- రాష్ట్ర ప్రజలను బాబు, మోదీ, వెంకయ్య మోసగించారు

సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ, రైల్వే బడ్జెట్‌లలో రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోవడం సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు, కేంద్ర మం త్రి వెంకయ్యనాయుడు ఇద్దరూ కలిసి తెలుగు ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు తెచ్చేందుకు టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లేయాలని ఎన్నికలకు ముందు కోరిన వారిద్దరూ అధికారంలోకి వచ్చాక మాట మార్చడాన్ని చూస్తే అసలు రంగేమిటో తెలిసిపోతోందన్నారు. టీడీపీ, బీజేపీ కలయికతో రాష్ట్రానికి ఏదో ఒరుగుతుందని ఓట్లేసిన తెలుగు ప్రజలను సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ కలసి నిట్టనిలువునా ముంచేశారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసే  లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు ఇచ్చి దులిపేసుకున్నారని, విభజన చట్టంలో పేర్కొన్న వాటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని దుయ్యబట్టారు.
 
మొసలి కన్నీళ్లతో ఏం లాభం?
రాష్ట్రం రెక్కలు విరిచేసి పరిగెత్తమంటే ఎలా సాధ్యమని అడుగుతున్న సీఎం బడ్జెట్‌కు ముం దు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను సమావేశపరిచి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయారన్నారు.బాబు సరైన తరుణంలో స్పందించకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ప్రయోజనం ఏమిటన్నారు. తీరిగ్గా రాష్ట్రానికి అన్యా యం జరిగిందంటే ప్రయోజనం ఏమిటన్నారు. ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేశానని సీఎం చెప్పడాన్ని అంబటి ఎద్దేవా చేశారు.

‘ఆయన ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లడంపై చూపే శ్రద్ధను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవటంపై చూపితే బాగుండేది’ అని అన్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో ప్రగల్భాలు పలికిన వెంకయ్యనాయుడు బడ్జెట్‌లో ఆ విషయాన్ని ఎందుకు చేర్చలేదని అంబటి ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తామని విభజన చట్టంలో పేర్కొనలేదని వెంకయ్య చెప్పటాన్ని చూస్తుంటే ఈ ప్రాజెక్టు ఇక రాదేమో అన్న అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీయే, టీడీపీ ప్రభుత్వాలు కూడబలుక్కునే పోలవరం ప్రాజెక్టును నీరుగారుస్తున్నట్లుగా ఉందన్నారు.

కేంద్రం బడ్జెట్‌లో పోలవరానికి రూ.వంద కోట్లు , టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడం చూస్తే పోలవరం ఇక రాదేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వాల్తేరులో రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని కూడా రైల్వే బడ్జెట్‌లో చేర్చకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఏమీ సాధించలేక పోయారని అంబటి విమర్శించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ఓ దేశాధ్యక్షుడి మాదిరిగా మలేసియా, సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు వారంతా రాష్ట్ర రైతులకు ఏదో ఒరగబెడతారనుకోవడం తప్పన్నారు.
Share this article :

0 comments: