తిరుగులేని శక్తిగా ఎదుగుదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుగులేని శక్తిగా ఎదుగుదాం

తిరుగులేని శక్తిగా ఎదుగుదాం

Written By news on Wednesday, March 4, 2015 | 3/04/2015

హైదరాబాద్: దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డికి రంగారెడ్డి జిల్లా మానసపుత్రిక లాంటిదని, అలాంటి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా బలోపేతం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కె.శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా వైఎస్సార్ పనిచేశారన్నారు. రైతుల క్షేమం కోరి సీఎం పదవి చేపట్టిన మరుక్షణమే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు.

జిల్లాలో దాదాపు 78 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. బంగారు తెలంగాణ, డబుల్ బెడ్‌రూంలు.. అంటూ కాలం వెల్లదీస్తున్నారని, ముందు రాజీవ్ గృహకల్ప కింద పేదలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తేచాలని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి కాలనీలకు మంజీరా నీరు సరిగా రావడం లేదని, ఇంట్లో నలుగురుంటే ఇద్దరికే రేషన్ వస్తోందని విమర్శించారు. ఒక ఉన్న పింఛన్లు సైతం తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. అంగన్‌వాడీ, డ్వాక్రా మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సరిపోవడం లేదని అన్నారు. మున్ముందు రోజుల్లో హామీల సీఎంగా కేసీఆర్ ఖ్యాతికెక్కుతారని విమర్శించారు. రాబోయే రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవేనని జోష్యం చెప్పారు.
 
జగనన్న ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటున్నారని, వాడవాడలా కమిటీలు వేసుకుని ప్రజా సమస్యలపై పోరాడుదామని అన్నారు. గ్రేటర్‌లో పాదయాత్రకు షర్మిల సిద్ధంగా ఉన్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 25 స్థానాలకు తక్కువ లేకుండా గెలుచుకోవాలని సూచించారు. సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.అమృతసాగర్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి ఆదరణ ఉందని, అందరం కలిసికట్టుగా సురేష్ రెడ్డి నాయకత్వంలో పనిచేద్దామని అన్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు సమావేశానికి తరలివచ్చారు. మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కూకట్‌పల్లి, శంషాబాద్, శేరిలింగంపల్లికి చెందిన పార్టీ నాయకులు ఎం.కుమార్ రెడ్డి, సీహెచ్ త్రిపాఠి, ఆర్.సతీష్ రెడ్డి, టి.ఇన్నారెడ్డి, గోపాల్ రెడ్డి, యాదయ్య, వెంకట్‌రెడ్డి, టి.ఆరోగ్యరెడ్డి, శ్రీధర్, బి.సంతోష్ కుమార్ నేత, విద్యార్థి నాయకుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
 తీర్మానాలివే..
     
జిల్లాలోని రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం  వెంటనే స్పందించాలి.
ప్రభుత్వం కరువు ప్రాంతాల్లోని రైతులకు పెట్టుబడి రాయితీతోపాటు వివిధ దశల్లో ఆర్థిక సాయం చేయాలి.
 రబీ సీజన్‌లో జిల్లాలో 14వేల ఎకరాల్లో వరిపంట ఎదిగే దశలో ఉంది. నీటి అవసరం అధికంగా ఉంది. కూరగాయల పంటలు కూడా దాదాపు 10వేల హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇవన్నీ బోరునీటిపైనే ఆధారపడ్డాయి. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి.
 వేసవి సీజన్ మొదలైంది. గ్రామాల్లో, నగర శివారు ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దటి తీవ్రంగా ఉంటుంది. తక్షణమే నీటి ఎద్దడి తీర్చాలి.
 వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా మారుస్తానన్న కేసీఆర్ ఎన్నికల హామీ నెరవేర్చుకోవాలి.
Share this article :

0 comments: