ప్రభుత్వం నిద్ర మత్తును వదిలిద్దాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం నిద్ర మత్తును వదిలిద్దాం

ప్రభుత్వం నిద్ర మత్తును వదిలిద్దాం

Written By news on Friday, March 6, 2015 | 3/06/2015


మబ్బు వదిలిద్దాం
వీరపునాయునిపల్లె: ‘ఇది మొద్దు ప్రభుత్వం. నిద్ర మత్తు నుంచి ఇంకా లేవలేదు. ప్రజలందరూ సమష్టిగా ఉద్యమంచి ప్రభుత్వం నిద్ర మత్తును వదిలిద్దాం’ అని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం సాయంత్రం అఖిలపక్ష నాయకుల కోరిక మేరకు దీక్షను విరమించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు రవీంద్రనాథ్‌రెడ్డిని అభినందించి ప్రభుత్వం తీరును ఎండ గట్టారు. రాయలసీమ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
 
 చీమ కుట్టినట్టు కూడా లేదు
 కమలాపురం నియోజకవర్గ ప్రజలకు సాగు-తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో కమలాపురం ఎమ్మెల్యే ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేశారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత కంటే దారుణం లేదు. కనీసం జిల్లా యంత్రాంగం వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇది నియోజకవర్గ ప్రజలను అవమానించడమే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష చేసిన తరువాతే సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు.
 - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి,
 
 వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
 ప్రాజెక్టులు పూర్తి అయ్యేందుకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. నాడు వైఎస్, మైసూరారెడ్డి చేసిన ఉద్యమాల ఫలితంగానే ‘గాలేరు-నగిరి’కి పునాది పడింది. ప్రజలను మభ్య పెట్టడమే చంద్రబాబు నైజం.
 -చంద్ర మౌళీశ్వర్‌రెడ్డి,
 
 జిల్లా రైతు నాయకుడు
 దీక్ష అభినందనీయం
 ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి దీక్ష చేయడం అభినందనీయం. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదు. ఇది ప్రజా ప్రతినిధులను, ప్రజలను అవమానించడమే. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారు.
 - శివారెడ్డి, ఆప్ జిల్లా నాయకుడు
 
 రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
 సాగు-తాగు నీటి కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టారు. వైఎస్ హయాంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా జిల్లా యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించేది. నేటి టీడీపీ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవడం కాదు కదా కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోక పోవడం దుర్మార్గం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
 -నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు
 
 ప్రభుత్వాన్ని నిలదీస్తాం
 జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కమలాపురం ప్రాంతాభివృధ్ధికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టారు. దీక్ష ఎందకు చేస్తున్నారో తెలుసుకొని హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలి.
 - జయరాములు, ఎమ్మెల్యే, బద్వేలు
 
 టీడీపీ తొత్తుగా జిల్లా యంత్రాంగం
 జిల్లా యంత్రాంగం టీడీపీ తొత్తులుగా పని చేస్తోంది. ఐదు రోజులుగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేస్తున్నా జిల్లా యంత్రాంగం కనీసం సమస్యను తెలుసుకొనే ప్రయత్నం చేయకపోవడం దారుణం. ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండ గట్టి ప్రాజెక్టులకు నిధులు సాధించుకుంటాం.
 -అంజద్ బాషా, ఎమ్మెల్యే కడప.
 
 ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?
 ప్రజల కోసం దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. అయినా జిల్లా యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోక పోవడం సిగ్గు చేటు. ఇలాంటి జిల్లా యంత్రాంగం ప్రజలకు ఏమి న్యాయం చేస్తుంది? ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలంతా పోరాడుతాం.
 -కొరముట్ల శ్రీనివాసులు,
 
 ఎమ్మెల్యే, రైల్వే కోడూరు
 ఉద్యమం తీవ్రతరం చేస్తాం
 తాగు-సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న దీక్ష కేవలం ఆరంభం మాత్రమే. బడ్జెట్ సమావేశాల్లో ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే తిరిగి అఖిల పక్షంతో కలిసి ఉద్యమాలు చేపడుతాం.
 - దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ
 
 ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది
 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని, తాగు-సాగు నీటి సమస్య తీర్చాలని అఖిల పక్ష సమావేశంలో తీర్మానించాం. సాగు నీటి కోసం రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం. టీడీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. అయినా సమస్యను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండ గట్టాలి.
 -నారాయణ, సీపీఎం రాష్ట్ర నేత
 
 రాజకీయాలు చేసేది ప్రభుత్వం కాదు:
 ప్రజల సమస్యల గురించి పట్టించుకునేదే నిజమైన ప్రభుత్వం. ప్రాజెక్టులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దీనిని కూడా రాజకీయంగానే చూస్తోంది. ఇప్పటికైనా స్పందించి ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి.
 - సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, కార్మిక నాయకుడు
 
 రాజీనామాలకైనా సిద్ధమే
 జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసేందుకు రాజీనామాలకైనా సిద్ధమే. ఒక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం. కరువు పీడిత ప్రాంతానికి గాలేరు-నగరి అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తి కావాలంటే ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వానికి ప్రాజెక్టులపై చిత్త శుద్ధి లేదు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మెడలు వంచి నిధులు ఇచ్చేంత వరకు పోరాడుతాం.
 
 -రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే,  మైదుకూరు.
 ప్రజలు కూడా ఉద్యమించాలి
   సమస్యల పరిష్కారానికి ప్రజలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల ప్రాజెక్టులు చివరి దశకు వచ్చాయి. గతంలో ఆయన అధికంగా నిధులు కేటాయించారు. ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేక ఏనాడు ఆయన నిధులు కేటాయించలేదు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. దురదృష్టవశాత్తు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టులకు నిధులు తెచ్చుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, అఖిల పక్ష నాయకులు చంద్రబాబును కలిసేందుకు గండికోటకు వెళ్తే కనీసం ఆయన మాట్లాడేందుకు కూడా నిరాకరించారు. ఇది జిల్లా ప్రజలను అవమానించడమే. ఇలాంటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జరిగే ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
 
 -వైఎస్ వివేకానంద రెడ్డి, మాజీ మంత్రి
 ప్రాణ త్యాగానికైనా సిద్ధమే: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
 గాలేరు-నగరి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపు కోసం తాను ప్రాణ త్యాగానికైనా, పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేయాలని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆయన అఖిల పక్షం నాయకుల కోరిక మేరకు గురువారం సాయంత్రం దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల సాధనకు, నిధుల మంజూరుకు తాను చేపట్టిన నిరవధిక దీక్ష ఆరంభం మాత్రమేనన్నారు. ప్రాజెక్టుల సాధన కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
 
 ఎన్‌టీ రామారావు మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో 80 శాతం పూర్తి అయిందన్నారు. మిగిలిన పనులు పూర్తి అయ్యేందుకు ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమాత్రం నిధులు కేటాయించలేదన్నారు. నిధులు కేటాయించి ఉంటే నేటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయి నికర జలాలు వచ్చి ఉండేవన్నారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు రూ.1500 కోట్లు కేటాయించాలని దీక్ష చేస్తే ఈ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించక పోవడం దారుణం అన్నారు. జూలై నాటికి గండికోటకు నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎమ్మెల్యేలంతా కలసి అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కమలాపురం నియోజకవర్గానికి గాలేరు-నగరి ప్రాణాధారమని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నియోజకవర్గంలో 81 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపాలన్నారు. భావి తరాల కోసం పోరాడాలని, లేకపోతే వారు క్షమించరని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఉద్యమంచే అఖిల పక్షానికి ప్రజలు అండగా నిలవాలన్నారు.
Share this article :

0 comments: