ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు?

ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు?

Written By news on Friday, November 13, 2015 | 11/13/2015


ప్రజల పక్షాన పవన్ ప్రశ్నించలేదేం?
♦ పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తిన అంబటి
♦ ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు?
♦ చంద్రబాబుకు అధికార ప్రతినిధిగా మారిపోయారా?

 సాక్షి, హైదరాబాద్: ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ఆవిర్భవించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రజా సమస్యలపై ఏమీ ప్రశ్నించకుండానే వెనుదిరగడం వెనుక కథ ఏమిటి? ప్రశ్నించలేని స్థితికి ఎందుకు దిగజారారు? దీని వెనుక జరిగిన రసాయనిక చర్య ఏమిటి? ఆ లాలూచీ ఏమిటి? అని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తీరును దుయ్యబట్టారు.

‘‘సీఆర్‌డీఏ  ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు సంబంధించి రైతులపై రాక్షసపాలన సాగుతోంటే, పంటలను తగులబెట్టి భయోత్పాతం సృష్టిస్తోంటే ఎందుకు ప్రశ్నించలేదు? రూ. 1,350 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి నీళ్లు తెచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా చుక్క నీరు కూడా కృష్ణా డెల్టా రైతులకు ఇవ్వకుంటే ఎందుకు ప్రశ్నించలేదు? రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే వాటిపై ఎందుకడగలేదు?’’ అని సూటిగా ప్రశ్నించారు. పవన్ తన వద్ద డబ్బు లేదని చెప్పారు కనుక ఆయన్ను మోసుకొచ్చిన ప్రత్యేక విమానం ఖర్చు ప్రభుత్వం ఇచ్చిందా? లేక టీడీపీ దోచుకున్న సొమ్ము నుంచి ఇచ్చారా? చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన విస్తరణకు డబ్బు లేదన్న పవన్... తన వద్ద స్క్రిప్టు, డైలాగులే ఉన్నాయి కనుక నిర్మాతను వెతుక్కునే క్రమంలో బాబును కలిశారా? అని ప్రశ్నించారు.

 పవన్ తీరు అనుమానాస్పదం...
 పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే చంద్రబాబుకు అధికార ప్రతినిధిగా వ్యవహరించారనిపిస్తోందని, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఈ అంశం దివంగత వైఎస్  హయాంలోనే ప్రారంభం అయిందని చెప్పడం చూస్తే ఆయనకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేదనే అనుమానం కలుగుతోందని అంబటి విమర్శించారు. బాక్సైట్ తవ్వకాల అంశానికి తానే అంకురార్పణ చేశానని, దుబాయ్ కంపెనీకి ఇచ్చానని అయితే గవర్నర్ సలహా మేరకు, గిరిజనులు వ్యతిరేకించినందున రద్దు చేశానని చంద్రబాబు స్వయంగా డిసెంబర్ 24, 2011న గవర్నర్‌కు రాసిన లేఖలో స్వయంగా పేర్కొన్నారని చెప్పిన అంబటి ఆ ప్రతిని చూపించారు.  పవన్ ప్రశ్నించకుండా అధికారప్రతినిధిగా మాట్లాడటం చూస్తే జనసేన పార్టీని టీడీపీకి బీ-టీంగా తయారు చేసే పనిలో పవన్ ఉన్నారనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లుగా  పవన్ కూడా తన పార్టీని టీడీపీలో కలిపేస్తారని తాను భావించడం లేదని, పరిస్థితులు  ఆ అనుమానాలు నిజమనిపించేలా ఉన్నాయని అంబటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వంగవీటి రంగా హత్యతో బాబుకు సంబంధం ఉందని  హరిరామజోగయ్య ఇటీవల తన ఆత్మకథలో వెల్లడించిన అంశం ఇపుడు సర్వత్రా చర్చగా ఉందని, దాని నుంచి  ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉందని అంబటి ధ్వజమెత్తారు. కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని, రూ.5,000 కోట్లతో వారికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానని బాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వాటిని పూర్తిగా విస్మరించడంతో కాపునేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో పోరాటానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో ఈ భేటీ ఏర్పాటుకావడం గమనించాల్సి ఉందన్నారు.
Share this article :

0 comments: