రామోజీ భూములను ఎప్పుడు దున్నుతున్నారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ భూములను ఎప్పుడు దున్నుతున్నారు?

రామోజీ భూములను ఎప్పుడు దున్నుతున్నారు?

Written By news on Sunday, August 12, 2012 | 8/12/2012


వాన్‌పిక్‌కు భూముల కేటాయింపును చంద్రబాబు ఎందుకు తప్పుబడుతున్నారు?
నాడు రామోజీ ఫిలిం సిటీ కోసం వేల ఎకరాల కొనుగోలుకు మీరు అనుమతించలేదా?
బాబుకు అధికారం పిచ్చి పట్టుకుంది
అందుకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
పరిశ్రమలకు, సెజ్‌లకు భూముల కేటాయింపుపై బాబు విధానమేమిటో చెప్పాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘వాన్‌పిక్’ భూముల్లో అరక దున్నుతున్న ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు.. రామోజీ ఫిలిం సిటీ భూములను ఎప్పుడు దున్నుతారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం పిచ్చి పట్టుకుందని.. అందుకే అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ పిచ్చి పట్టించే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలకు, సెజ్‌లకు భూములను కేటాయించే విషయంలో చంద్రబాబు విధానం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా.. వద్దా? సెజ్‌లు అవసరమా.. లేదా? అవి కావాలంటే ప్రభుత్వం భూములను కేటాయించాలా.. వద్దా? చంద్రబాబు స్పష్టంగా చెప్పాలి. వాన్‌పిక్ భూములను దున్నుతున్న బాబు అక్కడికే పరిమితమవుతారా? లేక ప్రభుత్వం పరిశ్రమలకు, సెజ్‌లకు కేటాయించిన భూములన్నింటినీ దున్నుతారా? రామోజీ ఫిలింసిటీ భూముల మాటేమిటి? నగరం నడిబొడ్డున రహేజాకు కేటాయించిన భూములను కూడా దున్నుతారా? వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూముల్లోనే దున్నుతారా? కిరణ్‌కుమార్‌రెడ్డి కేటాయించిన వాటిలో కూడా దున్నుతారా? అంతెందుకు తన తొమ్మిదేళ్ల పరిపాలనలో పరిశ్రమలకు కేటాయించిన స్థలాల్లో కూడా దున్నుతారా?’ అని నిలదీశారు. ఆ కార్యక్రమం షెడ్యూలును విడుదల చేస్తే బాగుంటుందన్నారు.

రామోజీ ఫిలింసిటీకి 2,000 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించిన బాబు.. వాన్‌పిక్‌కు భూములను కేటాయించడాన్ని ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. ‘ఈనాడు రామోజీరావు ఆనాడు గొర్రెల పెంపకం కోసం అని ఎకరా ఐదారు వేల రూపాయలకు కారుచౌకగా కొనుగోలు చేశారు. అప్పుడు తప్పుగా అనిపించనిది.. ఇప్పుడు వాన్‌పిక్ విషయంలోనే ఎందుకు తప్పుగా అనిపిస్తోందో చెప్పాలి’ అని అన్నారు. అరక దున్నుతున్న బాబుకు కాడికి ఉన్న ఎద్దుల్లో ఏది వలపటిది.. ఏది దాపటిది? అనే విషయం తెలుసా అని అన్నారు.

అసలు వ్యవసాయం గురించి బాబుకు తెలుసా? ఇప్పుడు రైతు వేషం వేస్తే సరిపోతుందా? అని గట్టు ప్రశ్నించారు. ‘వాన్‌పిక్ సంస్థ తమ భూములను కొనుగోలు చేసినా.. వాటిని స్వాధీనం చేసుకునే వరకూ తమను వ్యవసాయం చేసుకోనిచ్చిందని.. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ స్థానిక రైతులు చెబుతున్నా.. బాబు మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బాబుకు అధికారం లేక పూర్తిగా నిరాశానిసృ్పహల్లో ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఒకందుకు చంద్రబాబును అభినందించాలని.. ఎవరేమనుకున్నా సిగ్గూశరం లేకుండా ప్రజల్లోకి ఆయన వెళుతూనే ఉంటారని గట్టు ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు తన పరిపాలనలో తన బినామీలకు మేలు జరిగేలా నిజాం, పాలేరు షుగర్స్ వంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కారు చౌకగా అమ్మేశారు. పాలేరును కొన్నది ఆయన పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావే. నామా హెరిటేజ్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎంపీ అయిన తరువాత ఆ షేర్లను బాబుకే వదలివేశారు’ అని చెప్పారు. ప్రభుత్వం వాన్‌పిక్‌కు కేటాయించిన భూముల్లోకి చంద్రబాబు వెళ్లి.. అరక దున్నుతున్నా.. అంతకు ముందు రాష్ట్ర మంత్రి వెళ్లి దున్నినా.. రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. 
Share this article :

0 comments: