పూర్తి బాధ్యతారాహిత్యంగా కాంగ్రెస్ హైకమాండ్ కధ నడుపుతుందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పూర్తి బాధ్యతారాహిత్యంగా కాంగ్రెస్ హైకమాండ్ కధ నడుపుతుందా?

పూర్తి బాధ్యతారాహిత్యంగా కాంగ్రెస్ హైకమాండ్ కధ నడుపుతుందా?

Written By news on Saturday, August 10, 2013 | 8/10/2013





రాష్ట్రంలో రాజకీయం వికృతంగా మారుతోంది.వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఎవరికి వారికి తమ రాజకీయ స్వార్ధంపైన దృష్టి తప్ప, నిజాయితీగా ఉద్రిక్తతలు తగ్గించడానికి ఎవరూ ప్రయత్నిస్తున్నట్లు కనబడడం లేదు.తెలంగాణ సమస్య గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర రూపం దాల్చిన తర్వాత కాంగ్రెస్ హై కమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది.దానికి అనుగుణంగా కేంద్రం ప్రక్రియ ఆరంభించింది.నిజమే. ఇందులో చాలా కష్టనష్టాలు ఉన్నాయి. సీమాంధ్రులను కేంద్రం నడిరోడ్డుమీద వదలివేసిందన్న బాధ కలుగుతుంది.కేంద్రం వద్ద స్పష్టమైన హామీలు ఉంటాయని ఆశించినవారికి అది నిరాశ కలిగించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల మాదిరే పూర్తి బాధ్యతారాహిత్యంగా కేంద్రంలోని కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది.సీమాంధ్ర ప్రాంతంలో ఇంత రచ్చ జరుగుతుంటే, అన్నదమ్ముల్లా ఉండవలసిన ఉభయ ప్రాంతాల ఉద్యోగులు పరస్పరం తలపడుతుంటే చోద్యం చూస్తోంది. రాష్ట్రంలో అసలు పాలన అనేది లేకుండా చేసిందా అన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో తెలంగాణ ఆందోళనల సందర్భంగా కట్టుదిట్టంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. అదే మాదిరి ఇప్పుడు కూడా వ్యవహరించవలసి ఉంది.ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వరాదు. ఒకవేళ ఆయనకు ఈ పరిణామ క్రమం ఇష్టం లేకపోతే వెంటనే తప్పుకోవాలి , తప్ప పరిస్థితి అదుపు తప్పేలా చూస్తూ కూర్చోవడం సరికాదు.నిజానికి కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తరవాత జరిగిన పరిణామాలను ఆయన మీడియా ద్వారా ప్రజలకు వివరించి ఉండవలసింది.అసలు ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో చెప్పడానికి, అందులో ఆయన వైఖరి ఏమిటో వివరించి ఉండవలసింది.పిసిసి అధ్యక్షుడు బొత్స మీడియాతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదో తెలియదు.అసలు వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్ర తీర్మానంపై కిరణ్, బొత్సలు సంతకాలు చేయడం అంటే నే పార్టీ వైఖరిని వ్యతిరేకించినట్లు.అలాంటప్పుడు పార్టీ హై కమాండ్ ఎలా ఒప్పుకుంటుంది.వీరు ఎలా సమర్ధించుకుంటారు.లేకుంటే ఇద్దరు కలిసి కధ నడుపుతున్నారని అనుకోవాల్సి ఉంటుంది.సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్న తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది.సీమాంధ్రలో ఉన్నంత సేపు ప్రశాంతంగానే ఉంటారు. ఒక్కసారి ఆవేశం వచ్చిందంటే రెచ్చిపోతారు. జై ఆంధ్ర ఉద్యమం కూడా ఇలాగే సాగింది.అప్పట్లో సమైక్యవాదుల సమావేశాలపై కూడా దాడులు చేశారు.విజయవాడ విమానాశ్రయానికి సమైక్య వాదం నిమిత్తం సభ నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి బయల్దేరిన మంత్రి మండలి తదితరుల విమానాన్ని దిగకుండా ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారంటే, ఆ రోజులలో ప్రత్యేక ఉద్యమం ఎంత తీవ్రంగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.ఆ రోజే విజయవాడలో జరిగిన కాల్పులలో కొంతమంది యువకులు మరణించారు.అప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన కాకాని వెంకటరత్నం కాల్పులలో పిల్లలు మరణించిన సంగతి విని గుండెపోటుకు గురై అమరులయ్యారు. ఒక్క విజయవాడలోనే కాదు. సీమాంధ్ర అంతటా ప్రత్యేక ఉద్యమ జ్వాల రగిలింది.ఆ రోజులలో ఇలా టీవీలు, ప్రచార సాధనాలు కూడా లేవు. అయినా ఎక్కడికక్కడ జన జీవితం రోజుల తరబడి స్తంభించిందంటే ఆశ్చర్యం కాదు.అలాంటిచోట ఇప్పుడు సమైక్య ఉద్యమం రగలడం ఆశ్చర్యంగానే ఉంటుంది.ఇందులో నదీ జలాల అంశం కన్నా, హైదరాబాద్ తో అక్కడి ప్రజలకు ఏర్పడిన అనుబంధమే కారణంగా కనిపిస్తుంది.హైదరాబాద్ మన అందరిది అన్న నినాదం వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది. అందుకే రాజకీయ నాయకులు కూడా హైదరాబాద్ పట్టుబడుతున్నారు.కేంద్ర మంత్రి చిరంజీవి హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా గాని, కేంద్ర పాలిత ప్రాంతంగా గాని చేయాలని డిమాండ్ చేశారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఏకంగా హైదరాబాద్ ను తెలంగాణకు ఎలా ఇస్తారని ప్రశ్నించడం ద్వారా తమ వైఖరిని తెలియచెప్పారు.అలాగే ఆమె కుమార్తె ఏకంగా తల ఒకరికి మెండెం మరొకరికి ఇచ్చి సీమాంధ్రకు అన్యాయం చే్స్తారా?అంటూ ప్రశ్నించారు.దీనిపై తెలుగుదేశం నేతలు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ విధానానికి కట్టుబడి ఉన్నప్పట్టికీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు విభజన తీరును నిరసిస్తూ ఉద్యమిస్తున్నారు.పార్లమెంటును స్తంభింప చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్.పిలు కూడా పార్లమెంటులో పోరాడుతున్నారు.మొత్తం అందరి భావాలను జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాద్ విషయంలో నిర్దిష్టమైన హామీ ఇస్తే ఉద్యమం చల్లబడే పరిస్థితి కనబడుతోంది.అయితే హైదరాబాద్ తెలంగాణ లో భాగంగానే ఉంటుందని పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ తరహాలో పోలీసు,రెవెన్యూ యంత్రాంగం కేంద్రం చేతిలో ఉండేలా చట్ట సవరణ చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల రక్షణకు సంబందించే అందరూ ఆందోళన చెందుతున్నారు.తెలంగాణకు చెందిన నేతలు జైపాల్ రెడ్డి,జానారెడ్డి డి.శ్రీనివాస్ తదితరులు ఎంతగా ఇక్కడివారు కూడా తమవారే నని, వారికి ఎలాంటి డోకా ఉండదని చెబుతున్నా,టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు చేసిన వివాదాస్పద ప్రకటన మొత్తం పరిస్థితికి ఆజ్యం పోసింది. ఆయన రాజకీయం ఆయనది.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనతో సంప్రదించకుండా, తనను అసలు పట్టించుకోకుండా రాజకీయం నడుపుతోందన్న బాధతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది.ఇదే సమయంలో కెసిఆర్ ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని హరీష్ రావు,ఈటెల రాజేందర్ లు సంచలన ఆరోపణ చేశారు.ఇందులో నిజమెంతో నిగ్గు తేల్చవలసి ఉంది. అది నిజమైతే వికృత రాజకీయాలకు పరాకాష్ట అవుతుంది.వెంటనే అందుకు సంబందించినవారిని ఖైదు చేయాలి. అందులో నిజం లేకపోతే టిఆర్ఎస్ నేతలు ఎలాంటి దారుణమైన ఆరోపణలకైనా వెనుకాడరన్న భావన వస్తుంది.కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ పత్రికలలో సైతం వ్యతిరేక వ్యాసాలు వచ్చాయి.ముంబైలో శివసేన మాదిరి హైదరాబాద్ లో కూడా టిఆర్ఎస్ మాట్లాడుతోందని ఒక వ్యాసకర్త వ్యాఖ్యానించారు.ఇలా మాట్లాడుతున్న టిఆర్ఎస్ తో కలిసి చేస్తే సీమాంధ్రలో మరీ ఎక్కువ సమస్య వస్తుందేమోనని కాంగ్రెస్ భయం. పైగా రాజకీయం కోసమే విభజన చేశారన్న విమర్శను జనం పూర్తిగా నమ్మవచ్చు. అందువల్ల వారు టిఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు.పైగా టిఆర్ఎస్ ఎమ్.పి విజయశాంతితో పాటు మరికొందరు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే తెలంగాణ అంశంలో మళ్లీ రాజకీయ క్రీడ కూడా జరుగుతోందన్న మాట.ఒకపక్క రాష్ట,జాతీయ స్థాయిలో నేతలు తెలంగాణ వివాదంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం తమకు ఏమవుతుందోనని ప్రజలు అల్లాడుతున్నారు.చివరికి హైదరాబాద్ బీమా భవన్ వద్దకాని, తాజాగా ఎర్రమంజిల్ జలసౌధ భవనం వద్ద కాని సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు కలహించుకున్న తీరు, పరస్పరం నినాదాలు చేసుకుంటూ వివాద పడిన తీరుకు సంబందించిన దృశ్యాలు చూసినవారికి మనసు కలుక్కుమంటుంది.ఇంత జరిగాక కూడా ఎందుక సమైక్యం అంటున్నారా అన్న భావన ఒకవైపు కలుగుతుంది. మరో వైపు భావ స్చేచ్చ ఉన్న దేశంలో తమ అభిప్రాయాలను చెప్పుకుంటే కూడా అడ్డుకుంటారా అన్న భాద కలుగుతుంది. అయినప్పట్టికీ పరిస్థితిని గమనించి ఉద్రిక్తతలను పెరగకుండా చూడవలసిన బాధ్యత ఉభయ ప్రాంతాల ఉద్యోగ నాయకులపై ఉంటుంది. తమ ప్రయోజనాల పేరుతోనో, మరో కారణంగానో పరిస్థితి విసమిస్తుంటే చూస్తూ కూర్చోకూడదు.దీనివల్ల సమాజం లో మొత్తం వాతావరణం కలుషితం అవుతుంది. హైదరాబాద్ లో తమకు ఇప్పుడే తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్చ ఇవ్వకపోతే రేపు తెలంగాణ ఏర్పాటు అయ్యాక తమకు భద్రత ఉంటుందా అన్న సీమాంధ్ర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎలాగూ కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది కనుక,ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదు కనుక ఎవరైనా హైదరాబాద్ లో సమైక్యాంద్ర అని నినాదం చేసుకుంటే వచ్చే నష్టం ఏమిటో తెలియదు.దానివల్ల వచ్చిన తెలంగాణ వెనక్కి పోతుందా?ప్రస్తుతం లక్షల మంది సీమాంద్రులు హైదరాబాద్ హెచ్.ఎమ్.డి.ఎ పరిధిలో నివసిస్తున్నారు.కారణం ఏదైనా , మన నేతల దూరదృష్టి లోపం వల్ల అన్నీ సంస్థలను హైదరాబాద్ లోనే పెట్టి ఇతర నగరాలను నిర్లక్ష్యం చేశారు.దాని ఫలితంగా అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతం అవడం, మొత్తం ఆదాయ వనరులలో ఎక్కువ భాగం ఇక్కడ నుంచే వస్తుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.దీనికి సంబంధించిన చిక్కుముడులను కేంద్రం విడదీయడానికి కృషి చేయాలి.ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం దీనిని కేంద్రపాలిత ప్రాంతం చేయగలిగితే బాగానే ఉంటుంది. కాని అందుకు హైదరాబాద్ నగరంలోని నేతలతో పాటు తెలంగాణ నేతలు అంగీకరించరు. అందువల్ల పోలీసు,భూమి పాలన వ్యవస్థలు కేంద్రం చేతిలో ఉండడం ద్వారా ఏ కేసు అయినా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతాయన్న నమ్మకాన్ని ,ఎవరూ సీమాంద్రులపై దాడులు చేయరన్న భరోసాను ఇవ్వగలిగితే ఇబ్బంది ఉండదు.అతేకాదు.రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి.లేకుంటే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది.నిజానికి ఇప్పుడు సీమాంధ్రలోని నేతలందరికి ఒక వాస్తవం తెలుసు.విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం దాదాపు లేదని.కాని సీమాంధ్రలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా వారంతా సమైక్య రాష్ట్రం కోరుతున్నట్లు చెబుతున్నారు.లోపల దిగ్విజయ్ సింగ్ వద్ద సమావేశంలో హైదరాబాద్ స్థాయి గురించి పట్టుబడుతున్నారు.ఇది ఒక దురదృష్టకర పరిస్థితి . ఒక అభివృద్ది చెందిన నగరం ఒక ప్రాంతానికి చెందినది కాదని అంటే వినడానికి బాధగానే ఉంటుంది.కాని విభజన వాస్తవం అయితే నగరం సీమంధ్రులది కాదన్నది అంతే వాస్తవం.ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది.అయినప్పట్టీకి మొక్కవోని ధైర్యంతో మరో రాజధాని నిర్మాణానికి ప్రయత్నించాలి తప్ప,ఇదే తమకు గతి అన్నట్లుగా దైన్యంగా ఉండడం, మాట్లాడడం యోధుడి లక్షణంగాదు.కనుక మరో మహానగరాన్ని నిర్మించుకోవాలి. తెలంగాణ కు పోటీగా అభివృద్ది సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి.ఆరంభ శూరత్వంగా కాకుండా, ఆచరణలో చేసి చూపిన నాడు ఒక హైదరాబాద్ కాదు..నాలుగు హైదరాబాద్ లు సీమాంధ్రలో తయారవుతాయి. దానికి ధృఢ సంకల్పం కావాలి.గట్టి నాయకుడు కావాలి.అంతవరకు మాత్రం హైదరాబాద్ లోని సీమాంధ్రుల భద్రతకు అన్ని ఏర్పాట్లు తీసుకోకపోతే చరిత్ర ఈ రాజకీయ నాయకులను కాని,అంతిమ నిర్ణయానికి కారణమైన సోనియాగాందీని కాని క్షమించదు.

source:kommineni
Share this article :

0 comments: