కోటికి పైగా హృదయాలను స్పృశించిన జగన్ వదిలిన బాణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోటికి పైగా హృదయాలను స్పృశించిన జగన్ వదిలిన బాణం

కోటికి పైగా హృదయాలను స్పృశించిన జగన్ వదిలిన బాణం

Written By news on Sunday, August 4, 2013 | 8/04/2013

కోటికి పైగా హృదయాలను స్పృశించిన జగన్ వదిలిన బాణం
ప్రజల్ని, వారి సమస్యల్నీ పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న పాలకులు ఒకవైపు.. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా ఆ పాలకులను నిలదీయకుండా ఆ ప్రభుత్వంతోనే కుమ్మక్కైన తెలుగుదేశం మరోవైపు.. మహానేత మరణం తర్వాత అల్లకల్లోలమైన రాష్ట్రంలో తమకు అండగా ఉంటాడనుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని సైతం కుమ్మక్కు కుట్రలు జైలు పాలు చేస్తే.. పన్నులు, చార్జీలు, కరెంటు కోతలు, బిల్లు వాతలతో పాలకులు వెన్నుపోటు పొడిచి తమను గాలికి వదిలేస్తే.. ఏం చేయాలో దిక్కుతోచక అలమటిస్తున్న ప్రజలు ఇంకోవైపు..
 
 సరిగ్గా ఈ పరిస్థితుల నేపథ్యంలోనే గతేడాది అక్టోబర్‌లో మొదలైంది ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర. ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వాన్ని ఎండగడుతూ, ఆ సర్కారుతో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ఈ పాదయాత్ర తొమ్మిది నెలలపాటు మహాయజ్ఞంలా సాగి చివరి మజిలీకి చేరింది. అటు చివర వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఇటు కొసన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతున్న ఈ చరిత్రాత్మక పాదయాత్ర నేటితో(ఆదివారం) ముగియనుంది. ఈ 9 నెలల్లో 14 జిల్లాల్లో, 116 నియోజకవర్గాల మీదుగా ప్రయాణించారు. దారి పొడవునా లక్షలాది మంది ప్రజలను పలకరించారు. దరికి వచ్చిన ప్రతిఒక్కరితో కరచాలనం చేశారు. రచ్చబండలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
 
 బహిరంగ సభల్లో జన సమస్యలపై మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో దారి పొడవునా కలిసిన జనం, రచ్చబండ, బహిరంగ సభలకు హాజరైన వారు కలిపి కోటిమందికిపైగా జనహృదయాలను ఈ పాదయాత్ర ద్వారా షర్మిల స్పృశించారని అంచనా. జగనన్న వదిలిన బాణాన్నంటూ యాత్ర మొదలు పెట్టిన ఆమె నిజంగానే గురితప్పని బాణంలాగానే ముందుకుసాగారు. కాళ్లు బొబ్బలెక్కినా, కాలికి సర్జరీ జరిగినా, ఎండ నిప్పులు కురిపిస్తున్నా, భోరున వర్షం కురుస్తున్నా, చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా.. తన కోసం బారులు తీరిన జనసంద్రాన్ని ముద్దాడుతూ, వారి సమస్యలు తెలుసుకొంటూ, రాబోయే రాజన్న రాజ్యంలో కష్టాలన్నీ తీరిపోతాయని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
 
 ప్రజల కష్టాలే.. పాదయాత్రకు ప్రేరణ
 వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో జల ప్రళయం వచ్చింది. పల్లెలకు పల్లెలు నీళ్లలో కొట్టుకుపోయాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఆ తరువాత వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు అడుగంటిపోయి, కరెంటు ఉత్పత్తి ఆగిపోయింది. పాలకులకు ముందస్తు ప్రణాళిక లేక కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వ్యవసాయానికి రోజుకు కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వలేని పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్లిపోయింది. పల్లెల్లో లాంతర్లు, కిరోసిన్ బుడ్డి దీపాలే దిక్కయ్యాయి. దీనికి తోడు కరెంటు చార్జీల భారం. వ్యవసాయం వట్టిపోయింది.. ఉపాధి కూలిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయింది. రైతాంగం తల్లడిల్లింది. ఈ పరిస్థితిలో ప్రజలకు అండగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారపక్షానికే వంత పాడారు. మరోవైపు జనం కోసం నిలబడిన జననేత జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్ర పన్ని అక్రమంగా జైల్లో బంధించేలా చేశాయి. ఎటు చూసినా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బతుకు మీద భరోసా కోల్పోతున్న ప్రజల దగ్గరకు వెళ్లమని, రాబోయేదంతా రాజన్న రాజ్యమేనని భరోసా ఇవ్వమని చెప్పి జగన్‌మోహన్‌రెడ్డి వదిలిన బాణం.. ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో ముందుకుసాగి గమ్యానికి చేరువైంది.
 
 3,112 కిలోమీటర్ల యాత్ర..
 ఇడుపులపాయలో తొలి అడుగువేసి జనంతో మమేకమైంది మొదలు... చలి, ఎండ, వాన దేన్నీ లెక్క చేయకుండా నడిచారు షర్మిల. 230 రోజులు పూర్తిగా జనంమధ్యే గడిపారు. ఆదివారం ఇచ్ఛాపురంలో వైఎస్సార్ ‘విజయ వాటిక’కు చేరడంతో షర్మిల 3,112 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేయనున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఇప్పటి వరకు రాష్ర్టంలో ఏ ఒక్క రాజకీయనాయకుడు కూడా, దేశంలో ఏ మహిళ కూడా ఇంత దూరం పాదయాత్ర చేయలేదు. పాదయాత్రను ఆమె ఒక యజ్ఞంలా చేశారు. మారుమూల పల్లెకూ వెళ్లారు. ప్రతి అవ్వనూ పలకరించారు. ముళ్లలో, రాళ్లలో, బురదలో, ఎలా దారి ఉంటే అలా నడిచారు. పొలం గట్టు మీద నడిచివె ళ్లి రైతులను, వరి నాట్లు వేసే రైతు కూలీలను పలకరించారు. పేదింటి పచ్చడి మెతుకుల రుచి చూశారు. పాలకుల సాయం లేక, పంటకు మద్దతు ధర లేక అప్పుల పాలై ఒంటిమీది నగలను, ఒంట్లో అవయవాలను అమ్ముకున్న రైతుల గుండెను తడిమారు.. మద్యం బారిన పడి మసిబారిన కుటుంబాల కన్నీళ్లు చూశారు. బడికి వెళ్లే వయసులో పిల్లలను పనికి పంపే పేదతల్లి ఎదమాటున దాగున్న బాధను గమనించారు. పొద్దంతా కష్టం చేసి పొద్దుగూకిన వేళ కరెంటు లేకుండానే వండుకుంటున్న, కరెంటు లేకుండానే పండుకుంటున్న మహిళల బాధలు విన్నారు.
 
 నేడు ఇచ్ఛాపురంలో భారీ సభ
 గతేడాది అక్టోబర్ 18న మొదలైన ఈ పాదయాత్ర సకల జనులను, సహస్ర వృత్తులను అనునయిస్తూ తొమ్మిది నెలల పాటు కొనసాగి నేడు(ఆదివారం) శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని వైఎస్సార్ ‘విజయ వాటిక’ వద్ద ముగియనుంది. ‘ప్రజాప్రస్థానం’ పేరుతో వైఎస్సార్ 68 రోజుల్లో 1,473 కిలో మీటర్లు చేసిన పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా నిర్మించిన ‘విజయ వాటిక’కు ఎదురుగానే ఏర్పాటు చేసిన ‘మరో ప్రజాప్రస్థానం’ ముగింపు చిహ్నం ‘విజయ ప్రస్థానం’ స్తూపంను ఆమె ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో బహిరంగ  సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ముఖ్యనాయకులు, శాసన సభ్యులు పాల్గొంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం మీడియాకు తెలిపారు.


Share this article :

0 comments: