అధికారులను బలిపశువులను చేసేందుకే న్యాయ విచారణకు ఆదేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారులను బలిపశువులను చేసేందుకే న్యాయ విచారణకు ఆదేశం

అధికారులను బలిపశువులను చేసేందుకే న్యాయ విచారణకు ఆదేశం

Written By news on Wednesday, July 15, 2015 | 7/15/2015

* తక్షణమే ఏపీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి
* కాశి వెళ్లి గంగలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

* అధికారులను బలిపశువులను చేసేందుకే న్యాయ విచారణకు ఆదేశం
* పుష్కర ఏర్పాట్ల వైఫల్యంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 
సాక్షి, రాజమండ్రి: ‘‘గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజే ఇంతమంది దుర్మరణం పాలవడానికి ముమ్మాటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. ఈ మరణాలకు ఆయనే బాధ్యత వహించాలి. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేసి, కాశీ వెళ్లి గంగలో మునిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పుష్కరఘాట్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వచ్చారు. జిల్లా వైద్యవిధానపరిషత్ ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శిం చారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 ‘ఇవాళ ఇక్కడ జరిగిన సంఘటన ఏం జరిగిందో, ఎలా జరిగిందో మనమంతా చూశాం. ఈ సంఘటన మీద చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారని విన్నాను. ఆయన వైఖరిని చూసినప్పుడు నిజంగా ఆయన మనిషేనా అనిపిస్త్తుంది. ఈ ఇన్సిడెంట్‌కు కారణం ఎవరు? సరస్వతి ఘాట్ అని వీఐపీలకు ప్రత్యేకంగా కట్టారు. అక్కడ సాధారణ యాత్రికులకు అనుమతి లేదు. అక్కడ వీఐపీలు ఎంతసేపున్నా, ఏం చేసినా సాధారణ యాత్రికులకు ఏ ఇబ్బందీ ఉండదు.
 
 సామాన్యుల ఘాట్‌కు ఎందుకెళ్లావు?
 సీఎం హోదాలో బాబు వీఐపీ ఘాట్‌లో స్నానం చేసి ఉన్నా, అక్కడకు వెళ్లి గంటల తరబడి పూజలు చేసినా ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. ఆయన ఏం చేశాడు? తానేం చేసినా పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తాడని అందరికీ తెలుసు. దాని కోసమే సరస్వతి ఘాట్‌కు వెళ్లకుండా పుష్కర ఘాట్‌కు వచ్చాడు. సీఎం రావడంతో యాత్రికులను లోనికి రానీయకుండా గేట్లన్నీ మూసేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు భక్తులెవరూ నీళ్లలోకి దిగే అవకాశం లేకుండా చేశారు. దీంతో కిలోమీటర్ల పొడవునా భక్తులు కిక్కిరిసిపోయి ఒకరి మీద ఒకరు పడుతూ నరకం చూశారు.. వారు  వెనక్కు వెళ్లేందుకు మార్గాల్లేవు. రెండున్నర గంటలపాటు అక్కడే నిలువు కాళ్లపై వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత బాబు తన పూజలు అయిపోయాయి.. జనాల్ని వదిలేయండని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఆయన బయల్దేరిన తర్వాత.. గేట్లను ఒకేసారి తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 27 మంది చనిపోయారని తెలిసింది. ఈ సంఖ్య పెరిగే పరిస్థితి ఉందంటున్నారు.
 
 న్యాయ విచారణ కాదు.. జైల్లో పెట్టాలి..
 ఈ ఘటనపై న్యాయ విచారణ కావాలా? దీనికి ఎవరు బాధ్యులో తెలియదా? న్యాయవిచారణ కాదు.. బాబును వెంటనే జైల్లో పెట్టాలి. బాధ్యతగల సీఎం స్థానంలో ఉండి నువ్వు చేసింది ఏమిటి? వీఐపీ ఘాట్‌లో నువ్వు పూజలు ఎందుకు చేసుకోలేదు? ఆ ఘాట్‌ను వదిలిపెట్టి పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్‌కు వచ్చావ్. వేలాది మంది ప్రజలను లైన్‌లో నిలబెట్టి రెండుగంటలపాటు ఒకరి మీద ఒకరు పడేటట్టుగా చేసి వెనక్కిపోయే పరిస్థితి లేకుండా చేశావ్. తర్వాత ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయిం చి తోపులాటకు కారణమయ్యావ్. ఇంతమంది చావుకు చంద్రబాబు కారణం కాదా? మళ్లీ న్యాయువిచారణ ఎందుకు? మళ్లీ అధికారులను బకరాలను చేసి.. తాను చేసిన తప్పును అధికారులపై నెట్టేసి, వారి ఉద్యోగాలు ఊడబెరికేసి తాను మంచోడన్నట్టుగా బాబు తప్పించుకోడానికే ఈ న్యాయ విచారణా? అని ప్రశ్నిస్తున్నా.
 
 అంతా పబ్లిసిటీ కోసమే...
 రెండు రోజులుగా చంద్రబాబు ఇక్కడే ఉన్నాడు. ఏం చేశాడు? పైగా చివరకు ఎండోమెంట్ మినిస్టర్ నన్ను ఇన్వాల్వ్ చేయడం లేదు. ఏర్పాట్లలో నాకు స్థానం కల్పించడం లేదని అంటే మీ మంత్రులు ఏమన్నారు? సాక్షాత్తూ చంద్రబాబే ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎండోమెంట్ మిని స్టర్ ఇన్వాల్వ్ అయితే ఏమిటి? కాకపోతే ఏమిటి? అని అన్నారు. చివరకు అంతా నేనే చేశాను.. పబ్లిసిటీ అంతా తనకే రావాలి.. అని ఎవరికీ బాధ్యతలు ఇవ్వకుండా రెండు రోజు లుగా ఇక్కడే ఉండి అన్నీ పర్యవేక్షిస్తూ ఆయనే చూసుకుంటున్నాడు. చివరకు ఆయనే ఈ చావులకు కారణమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా కిరాతకం బహుశా మరొకటి ఉండదేమో? దీనికి చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలి. తనలో ఏమాత్రం మానవత్వం ఉన్నా పదవి నుంచి పక్కకు తప్పుకోవాలి. వెంటనే రాజీనామా చేసి కాశీకి పోయి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చావులకు లెక్కగట్టే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడే వస్తుంది. చంద్రబాబు మనిషే కాదు. దీనికి బాధ్యత వహించాల్సింది బాబు. తప్పుకోవాల్సిందీ ఆయనే. ఎవరో ఒకరిమీద నెపం నెట్టేసి తాను తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు, గాయపడినవారికి వైఎస్సార్‌సీపీ  తోడుగా ఉంటుంది’ అని జగన్ అన్నారు.
Share this article :

0 comments: