బోయపాటి డైరెక్షన్ లో చంద్రబాబు యాక్షన్. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బోయపాటి డైరెక్షన్ లో చంద్రబాబు యాక్షన్.

బోయపాటి డైరెక్షన్ లో చంద్రబాబు యాక్షన్.

Written By news on Friday, July 17, 2015 | 7/17/2015


బోయపాటి డైరెక్షన్ లో చంద్రబాబు యాక్షన్..
పుష్కరాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని సీఎం నిర్ణయం
సాక్షి, రాజమండ్రి/ హైదరాబాద్: గోదావరి పుష్కరాలను మహా కుంభమేళాకు దీటుగా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పుష్కరస్నానాల ప్రారంభం, సీఎం కుటుంబసభ్యుల పుణ్యస్నానాలు, లక్షలాది భక్తుల హాజరు, ఘాట్‌లలో హడావుడి... అన్నీ కలిపి ఒక డాక్యుమెంటరీ తీసి, విదేశీ ప్రతినిధులను చూపి అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని భావించారు.

ఈ మేరకు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ సలహాదారును రంగంలోకి దింపారు. డాక్యుమెంటరీ నిర్మాణం కోసం ఆయన కొన్ని జాతీయ ఛానళ్లను సంప్రదించారు. చివరకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్న నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో (ఎన్‌జీసీ) ఒప్పందం కుదుర్చుకోవడం, డాక్యుమెంటరీ రూపకల్పన, ప్రసారం, వసతి తదితర సౌకర్యాల కోసం దాదాపు రూ.ఏడు కోట్ల కేటాయింపు అత్యంత రహస్యంగా జరిగిపోయాయి. ఆయా చానల్స్ ప్రతినిధులు పుష్కరాల ప్రారంభానికి దాదాపు రెండు రోజుల ముందే రాజమండ్రికి చేరుకున్నారు.

వీరికి ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసిన ప్రభుత్వ సలహాదారు రాచమర్యాదలు చేయడం మొదలుపెట్టారు. తాము చిత్రీకరించాల్సిన అంశాలు, వాటిని చిత్రీకరించే ప్రదేశాలు నిర్ణయించుకునేందుకు ఆ మీడియా ప్రతినిధులు అన్ని పుష్కరఘాట్లను సందర్శించారు. లైటింగ్ సహా ఇతర అంశాల్లో వారే కొన్ని మార్పుచేర్పులు సూచించారని తెలిసింది. మరోవైపు చంద్రబాబు ఆస్థాన సినీరంగ ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు.

ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ సినీ ప్రముఖుడి ఆధ్వర్యంలో వారంతా పలుమార్లు రాజమండ్రికి వచ్చి పుష్కర ఘాట్లను పరిశీలించారు. వారు సూచించిన మేరకే గోదావరి హారతి కార్యక్రమంతోపాటు లేజర్ షోలు, ఇతర ఆర్భాటాలను చంద్రబాబు ఏర్పాటు చే యించారు. వీటి చిత్రీకరణ బాధ్యతను ప్ర ముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. డాక్యుమెంటరీ ముహూర్తపు షాట్‌గా పుష్కరాల ముందు రోజైన సోమవా రం రాత్రి పుష్కర ఘాట్‌లో సీఎం నిర్వహిం చిన గోదావరి నిత్యహారతిని వాడుకున్నారు. ఆ షాట్ అంతా బోయపాటి డెరైక్షన్‌లో తీశారు.
 
‘స్పెషల్ ఎఫెక్ట్’ కోసం ఘాట్ మార్పు...
రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా వీఐపీలు, వీవీఐపీలు స్నానం చేయడానికి ప్రభుత్వం సరస్వతి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఘాట్‌ను ఏర్పాటు చేసింది. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతోసహా మంగళవారం ఉదయం ఆ ఘాట్‌లోనే పుష్కరాలను ప్రారంభించాల్సి ఉంది. దీనికోసం భద్రతాధికారులు సోమవారం రాత్రి అడ్వాన్డ్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) పేరుతో భద్రతను పర్యవేక్షించే రిహార్సల్స్ సైతం నిర్వహించారు.

అయితే మంగళవారం తెల్లవారుజామున ఏఎస్‌ఎల్ పూర్తయిన తరవాత క్షేత్రస్థాయి సిబ్బందికి సీఎం పుష్కరాలను ‘పుష్కర’ ఘాట్‌లో ప్రారంభించనున్నారంటూ సమాచారం వచ్చింది. సీఎం స్థాయి వ్యక్తి పుష్కరాలను ప్రారంభిస్తున్న ఘట్టాన్ని తాము డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తామని, దీనికోసం చుట్టూ భారీ జనం ఉంటే ఎఫెక్ట్ బావుంటుందని సినీ, టీవీ చానల్ ప్రతినిధులు చెప్పడంవల్లనే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం కోసం లక్షలాది భక్తులను ఎక్కువసేపు ఆపడం సమంజసం కాదంటూ క్షేత్రస్థాయి సిబ్బంది హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం ఉండదని భావించిన ఉన్నతాధికారులు ఆయన చెప్పినట్లే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఘాట్‌కు చేరుకోవడానికి కొన్ని గంటలముందు మరోసారి పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఆ మీడియా ప్రతినిధులు ఇతర ఘాట్లలో ఉన్న వారినికూడా ఇక్కడకు మళ్ళిస్తే షాట్స్ ఇంకా బాగా వస్తాయని సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిసింది.

దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు భక్తుల్ని పుష్కరఘాట్‌కు మళ్లించారు. బయట భక్తులు పోటెత్తుతున్న క్రమంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తెలిసినా స్వయంగా ముఖ్యమంత్రే లోపల ఉండటంతో పోలీసులు అనివార్యంగా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కుటుంబం పుణ్యస్నానం, పితృదేవతలకు పిండప్రదాన క్రతువులు, వాటి చిత్రీకరణ కోసం సుమారు రెండున్నర గంటలపాటు భక్తులను గేటు బయటే నిలిపివేశారు. చివరకు గేట్లు తెరిచినప్పుడు తొక్కిసలాట జరిగి అందులో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

సీఎం వ్యక్తిగత ప్రచారం కోసం చేపట్టిన డాక్యుమెంటరీ చిత్రీకరణ ఇంతమంది ప్రాణాలను బలిగొనడానికి కారణమైందన్న చర్చ మం త్రుల మధ్యే నడుస్తోంది. మరోవైపు ఘాట్ బయట, లోపల జనసమూహం ఎక్కువ సమ యం ఉండిపోవడంవల్లనే ఈ దుర్ఘటన జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొనడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

పుష్కర ఘాట్‌కు వెళ్లి తప్పు చేసింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని లోకం అంతా కూడై కూస్తున్నా అధికారులపై వేటు వేసేందుకు రం గం సిద్ధం చేయడంపట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. పుష్కరాలు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్‌పైన బదిలీ వేటు వేయనున్నట్లు తెలిసింది. అలాగే జిల్లా ఎస్పీపైన బదిలీ వేటా లేదా సస్పెండ్ చేయడమా అనే అంశంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు.
 
ఘాట్ల పర్యటనలు వద్దు బాబోయ్...
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన బుధవారం నుంచి సీఎం చంద్రబాబు సహా ఇతర మంత్రులు, ప్రముఖులు వరుసపెట్టి ఘాట్లను సందర్శించడం, భక్తులతో మాట్లాడటం మొదలెట్టారు. ఇది తమకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందని క్షేత్రస్థాయిలో ఉండే పోలీసు సిబ్బంది, అధికారులు వాపోతున్నారు. మొదటి రోజు జరిగిన ఘటనతో నిద్రాహారాలుమాని విధులు నిర్వర్తిస్తున్న తమకు ఇలా ఘాట్లకు వస్తున్న వీఐపీలకు బందోబస్తు, భద్రత కల్పించడం మరో ఇబ్బందిగా మారిందని స్పష్టం చేస్తున్నారు.

ఏ ప్రముఖుడినైనా భక్తులు అడ్డగించడం, తమ సమస్యలపై ప్రశ్నించడం తదితరాలు జరిగితే పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలను ఆస్కారం లేకుండా ఉండాలంటే ఆయా ప్రముఖులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు ఇతర కంట్రోల్‌రూమ్స్‌లో ఉండి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, సమయానుకూలంగా అక్కడినుంచే తమకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలోనూ ఉన్నతాధికారులు సీఎం సహా ప్రముఖులకే వంతపాడుతున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు.

http://www.sakshi.com/news/home-latest-news/babu-devotion-to-international-direction-257933?pfrom=home-top-story
Share this article :

0 comments: