జగన్ రాజకీయాల్లో ఉన్నారు గనుక ఆయనకు ప్రాథమిక హక్కులు వర్తించవనే రీతిలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రాజకీయాల్లో ఉన్నారు గనుక ఆయనకు ప్రాథమిక హక్కులు వర్తించవనే రీతిలో

జగన్ రాజకీయాల్లో ఉన్నారు గనుక ఆయనకు ప్రాథమిక హక్కులు వర్తించవనే రీతిలో

Written By news on Friday, June 8, 2012 | 6/08/2012

మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ 
కౌంటర్ వేయాలని ప్రతివాదులకు ఆదేశం 
విచారణ 21కి వాయిదా
జైలు నుంచి లేఖలు రాసిన ఉదంతాలున్నాయి
జగన్ తరఫు న్యాయవాది శ్రీరామ్ స్పష్టీకరణ
నిబంధనల ప్రకారమే అనుమతి కోరుతున్నాం
మా హక్కులను పరిరక్షించాలంటున్నాం
ఎన్నికల ప్రచారం చేస్తామనడం లేదు
అండర్ ట్రయల్ ఖైదీ తన భావాలను వ్యక్తీకరించేందుకు రాజకీయాలు అడ్డంకి కాబోవని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్న న్యాయవాది
ఓటర్లకు లేఖలు రాసేందుకు నిబంధనలు ఒప్పుకోవన్న ఏజీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో తన భావాలను మీడియా ద్వారా లేఖలు, మౌఖిక సందేశాల రూపంలో ఓటర్లకు తెలియజేసేందుకు అనుమతించేలా చంచల్‌గూడ జైలు అధికారులను ఆదేశించాలంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వుల కోసం చేసిన అభ్యర్థన, ప్రధాన అభ్యర్థన ఒకటే గనుక ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని పేర్కొంది. 

హోం శాఖ దాఖలు చేసే కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే ఏ ఉత్తర్వులైనా జారీ చేయగలమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రతివాదులైన హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జైళ్లశాఖ డీఐజీ, సీబీఐలకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం జూన్ 21కి వాయిదా వేశారు. ప్రజలతో తన భావాలను పంచుకునేందుకు జైలు అధికారులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ జగన్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ భాను గురువారం మధ్యాహ్నం విచారించారు. పిటిషనర్ తరఫున ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించగా, హోం శాఖ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు.
సుప్రీంకోర్టూ చెప్పింది

ముందుగా శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. జగన్ జైలులో ఉన్నప్పటికీ ఓ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా తన భావాలను ఓటర్లకు తెలియచేసే హక్కు ఆయనకు ఉందని గుర్తు చేశారు. ఆ హక్కును అడ్డుకోవడమంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుందని వివరించారు. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ భావాలను, ఆలోచనలను ప్రజలకు చేరవేసే హక్కు రాజకీయ ఖైదీలకు ఉంది. స్వాతంత్య్రానికి ముందు, తరవాత కూడా అనేక మంది నాయకులు జైలు నుంచి లేఖల ద్వారా తమ భావాలను ప్రజలతో పంచుకున్న ఘటనలున్నాయి. ఈ హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం. అంతేగాక మానవ హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుంది. అండర్ ట్రయల్ ఖైదీలకు జైలు నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక సౌకర్యాలున్నాయి. అందులో భాగంగా ఇంటర్వ్యూలు, సందేశాలు పంపవచ్చు. శిక్ష పడిన ఖైదీలకు, అండర్ ట్రయల్ ఖైదీలకు తేడా ఉంది. శిక్ష పడ్డవారికి వర్తించే నియమ నిబంధనలన్నీ యథాతథంగా వారికి వర్తించవు. 

జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, న్యాయవాదులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అండర్ ట్రయల్స్ లేఖలు రాయవచ్చు’’ అని వివరించారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, న్యాయవాదులకే తప్ప, ఓటర్లకు లేఖలు రాయవచ్చనని జైలు నిబంధనల్లో ఎక్కడా లేదు కదా అని ప్రశ్నించారు. ఆ విషయంలో నిషేధం కూడా జైలు నిబంధనల్లో ఎక్కడా లేదని శ్రీరామ్ బదులిచ్చారు. సంబంధిత నిబంధనలను చదివి విన్పించారు. ‘‘ఎన్నికల ప్రచారం చేస్తానని గానీ, ఓటర్లనుద్దేశించి ప్రసంగిస్తానని గానీ పిటిషనర్ చెప్పడం లేదు. రాజ్యాంగం తనకు ప్రసాదించిన హక్కులను పరిరక్షించాలని మాత్రమే కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మేమేదీ కోరడం లేదు. జైలు నిబంధనల్లోని చాప్టర్ 27 ప్రకారం అండర్ ట్రయల్ ఖైదీలు ఇంటర్వ్యూలు, సందేశాలు పంపవచ్చు. 

దాని ప్రకారమే మాకు అవకాశం కల్పించాలని అడుగుతున్నాం. అండర్ ట్రయల్స్‌కు మాత్రమే ఉద్దేశించిన ఈ చాప్టర్ కింద పంపే లేఖలు, సందేశాలను జైలు అధికారులు పరిశీలించాల్సిన అవసరం కూడా లేదు. శిక్ష పడిన ఖైదీలకు, అండర్ ట్రయల్స్‌కు వేర్వేరుగా స్పష్టమైన నిబంధనలున్నాయి. జూన్ 10 వరకే ప్రచారం చేసుకునే అవకాశముంది. అందుకే మేం కోర్టును ఆశ్రయించాం. ఆ తర్వాత అనుమతించినా మాకు పెద్ద ప్రయోజనముండదు’’ అని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వుల అభ్యర్థన, ప్రధాన అభ్యర్థన ఒక్కటేనని జస్టిస్ భాను గుర్తు చేశారు. ప్రతివాదుల కౌంటర్లు పరిశీలించి, వారి వాదనలు విన్నాకే తగిన నిర్ణయం తీసుకోగలనని స్పష్టం చేశారు. శ్రీరామ్ స్పందిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని న్యాయమూర్తికి నివేదించారు. ‘‘కోర్టుల కంటే ముందే ఆ మీడియానే శిక్షలు ఖరారు చేస్తోంది. ఈ సమయంలో పిటిషనర్ తన భావాలను ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు. ఆ మీడియా వర్గం తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. సీబీఐ అధికారులకు మాత్రమే తెలియాల్సిన 164 స్టేట్‌మెంట్లు ఆ మీడియా వద్ద కూడా ఉంటున్నాయి. సాక్షులు సీబీఐకి చెప్పే వివరాలను వారు స్వయంగా విన్నట్టే రాస్తున్నారు. విచారణ గురించి ఏం చెప్పినా సీబీఐ అధికారులు అధికారికంగా చెప్పాలి. కానీ వారు ఇప్పటిదాకా అలా ఏమీ చెప్పలేదు. అయినా జగన్‌ను ప్రజల్లో చెడుగా చిత్రించేందుకే ఆ మీడియా వర్గాలు ఇదంతా చేస్తున్నాయి. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నదే ఆయన ఉద్దేశం. 

అందుకే లేఖలు, సందేశాలకు అనుమతి కోరుతున్నాం’’ అని వివరించారు. గతంలో జైలు నుంచి ఇలా లేఖలు, సందేశాలు పంపిన సందర్భాలున్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అలాంటివి అనేకమున్నాయని, స్వాతంత్య్రానికి ముందూ తర్వాత కూడా జరిగాయని శ్రీరామ్ వివరించారు. జగన్ రాజకీయాల్లో ఉన్నారు గనుక ఆయనకు ప్రాథమిక హక్కులు వర్తించవనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని అన్నారు. వ్యక్తుల గురించి అవసరం లేదని, చట్టం, నిబంధనల గురించి చెప్పాలని న్యాయమూర్తి సూచించారు. లేఖలు, సందేశాలు పంపేందుకు చట్టం అనుమతిస్తుందో లేదో వివరించాలన్నారు. జైల్లో ఉంటే హక్కుల గురించి మాట్లాడొద్దనేలా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారని శ్రీరామ్ బదులిచ్చారు. ‘‘జగన్ తన తల్లికీ, స్నేహితులకు, న్యాయవాదులకు లేఖలు రాయవచ్చు. వాటిలో రాజకీయాల గురించి ఉంది గనుక ఆ లేఖలను బయటకు పంపడానికి వీల్లేదనడం సరికాదు. ఆ కారణంతో లేఖలను ఆపే అధికారం జైలు అధికారులకు లేదు. 

స్వాతంత్య్రానికి పూర్వమంటే రాజకీయాలను నేరంగా, నాయకులను దేశ ద్రోహులుగా పరిగణించారు గనుక అలాంటి నిబంధనలు రూపొందించారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రాజ్యాంగ ప్రసాదించిన ప్రాథమిక హక్కులే ప్రధానం’’ అని తెలిపారు. జార్జి ఫెర్నాండెజ్ జైలుకెళ్లినప్పుడు ఏం జరిగిందంటూ న్యాయమూర్తి ఆరా తీశారు. అప్పుడు ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా పని చేసే మీడియా లేదని శ్రీరామ్ చెప్పగా, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేకున్నా ప్రింట్ మీడియా ఉంది కదా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు జగన్ విషయంలో వ్యవహరిస్తున్నట్టుగా ఫెర్నాండెజ్ విషయంలో ప్రింట్ మీడియా వ్యవహరించలేదని శ్రీరామ్ గుర్తు చేశారు. పీయూసీఎల్ కేసులో ఓ పార్టీ అధ్యక్షుని మనోభావాలను తెలుసుకునే హక్కు ఓటర్లకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కూడా జగన్ మనోభావాలను తెలుసుకునే హక్కు ఓటర్లకుంది. అండర్ ట్రయల్ ఖైదీ తన భావాలను వ్యక్తం చేసేందుకు రాజకీయాలు ఏ మాత్రమూ అడ్డంకి కాదని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ భక్తవార్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అండర్ ట్రయల్స్ హక్కుల గురించి ఇలా ఎన్నో తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసినా జైలు అధికారులకు అవేవీ పట్టడం లేదు. నిబంధనలు అనుమతించవంటూ లేఖల విడుదలకు నిరాకరిస్తున్నారు’’ అని వివరించారు.

ఇప్పటికిప్పుడు శిక్షించజూస్తున్నారు

జైలు నిబంధనల ప్రకారం ఓటర్లకు లేఖలు రాసేందుకు వీల్లేదని ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు. శిక్ష పడ్డ ఖైదీలకు, అండర్ ట్రయల్స్‌కు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. సమయమిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. జైలు అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని శ్రీరామ్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు జగన్‌తో పాటు జైలు అధికారులు కూడా దానిపై సంతకం చేయాల్సి ఉండగా వారు రెండు రోజుల పాటు సంతకం చేయలేదని ఆరోపించారు. జగన్‌ను ఇప్పటికిప్పుడు శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతోందని, కాని అలా జరగడం లేదని వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: