విజయమ్మ జయమ్మ అవుతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ జయమ్మ అవుతారా?

విజయమ్మ జయమ్మ అవుతారా?

Written By news on Friday, June 8, 2012 | 6/08/2012

వైఎస్ జగన్...అధికార కాంగ్రెస్‌ను, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని రాజకీయంగా గడగడ లాడిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సర్వం తానై నడిపించిన జగన్ ప్రస్తుతం అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. మళ్ళీ ఆయన బయటికి ఎప్పుడు వస్తారో తెలియదు. అసలు జైలు గోడల మధ్య నుంచి బయట పడతారా అన్నదీ తెలియదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ తీసుకున్నారు. కీలకమైన ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జగన్‌ను జైలుకు పంపడం ఆయన పార్టీకి గట్టి దెబ్బే. సమయం తక్కువగా ఉండటంతో విజయమ్మ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. ఆమెకు తోడుగా కూతురు షర్మిల కూడా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తల్లి, కూతుళ్ళ తొలి ఉప ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆత్మస్థయిర్యాన్ని కలిగించగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మాత్రం దడ పుట్టిస్తోంది. నర్సన్నపేట నుంచి రామచంద్రాపురం వరకు విజయమ్మ ప్రచారానికి విశేష ప్రజాదరణ లభిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలు సమస్య ఇపుడు కాదు. ఉప ఎన్నికల తర్వాత మొదలవుతుంది. ఉప ఎన్నికల వరకు ఆ పార్టీకి ఎటువంటి ఢోకా ఉండక పోవచ్చు. జగన్ ఎపుడు బయటికి వస్తారో తెలియని పరిస్ధితిలో ఆయన బయటికి వచ్చేంత వరకు పార్టీని కాపాడుకోవలసి ఉంటుంది. మరి ఈ బాధ్యతను విజయమ్మ నిర్వహించగలరా? ఎవరితోను పెద్దగా కలవకుండా ముభావంగా ఉండే విజయమ్మ వంటి వారికి మరింత కష్టం. అయితే ఒక విషయం మాత్రం నిజం. అవసరమే నాయకత్వాన్ని, నాయకత్వ లక్షాలను సృష్టిస్తుంది.
పక్కన ఉన్న తమిళనాడులో ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకీ రామచంద్రన్‌కు బాధ్యతలు అప్పగించారు. కానీ నెల రోజులు తిరగకుండానే ఆమె ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో డిఎంకె అధికారంలోకి వచ్చింది. జానకీ రామచంద్రన్‌కు పెద్దగా నాయకత్వ లక్షణాలు లేవు. అసలు ఆమెకు రాజకీయాలే తెలియవు. అమెకు ఉన్న అర్హతల్లా ఎంజి రామచంద్రన్ భార్య అన్నది ఒక్కటే. కానీ ఆ తర్వాత జయలలిత అన్నా డిఎంకె పార్టీ బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీ స్వరూపమే మారి పోయింది. జయలలిత బాధ్యతల్ని చేపట్టకపోయినట్లయి ఇప్పటికి ఆ పార్టీ కనుమరుగయ్యేదేమో. జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టినపుడు ప్రతిపక్షంలో ఉన్నట్టే విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత తరుణంలో ఆ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వైపు పార్టీని జయలలిత నడిపించారు. మరి రాష్ట్రం విషయానికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన విజయమ్మ జానకమ్మ అవుతారా జయమ్మ అవుతారా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.
ఇక్కడ సోనియాకు, విజయమ్మకు కొన్ని పోలికలు కనిపిస్తాయి. రాజీవ్‌గాంధి, రాజశేఖర్‌రెడ్డి, ఇద్దరూ ఆకస్మిక మరణానికి గురైన వారే. సోనియా భర్త రాజీవ్ ఎల్‌టిటిఇ తీవ్రవాదుల హత్యకు గురయ్యారు. విజయమ్మ భర్త రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉంటే విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు. తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలన్నది సోనియా లక్ష్యం అయితే, తన కుమారుడు జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది విజయమ్మ ధ్యేయం. రాహుల్‌కు అండగా ఆయన సోదరి ప్రియాంక ఉంటే ఇక్కడ జగన్‌కు అండగా ఆయన సోదరి షర్మిల ఉన్నారు. తన సోదరుడు రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నది ప్రియాంక కోరికైతే తన సోదరుడు జగన్ ముఖ్యమంత్రి కావాలన్నది షర్మిల కాంక్ష. సోనియా తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేస్తారా, విజయమ్మ తన కుమారుడు జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడగలుగుతారా అన్నది రానున్న రెండేళ్ళలో తేలుతుంది.
ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ బయట ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకే ప్రమాదం తథ్యమని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కానీ జగన్ జైలులో ఉన్న పరిస్థితిలో రానున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నదే ఆసక్తి కలిగిస్తోంది. అయితే జగన్ జైలులో ఉన్నా ఆయన పార్టీలోకి ఎమ్మెల్యేల వలస కొనసాగుతూనే ఉంది. గతంలో జగన్ శిబిరంలో ఉన్న వారే కాకుండా కొత్తగా బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, పార్వతీ పురం ఎమ్మెల్యే జయమణి వంటి వారు కూడా జగన్ శిబిరంలోకి రావడం విశేషం.
వైఎస్సార్ పార్టీలో జగన్ తర్వాత స్థానం ఎవరిదన్నది ఊహించలేనిది. ప్రస్తుతం విజయమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టినా తన నాయకత్వాన్ని నిరూపించుకోవలసి ఉంది. అయితే ఎంవి మైసూరారెడ్డి వంటి నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైసూరా తెలుగుదేశం పార్టీని వీడటం వల్ల ఆ పార్టీకి నష్టం లేక పోవచ్చు. కానీ మైసూరా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడం మాత్రం ఆ పార్టీకి లాభం కలిగించే అంశమే. మైసూరా ప్రజాకర్షక నేత కాకపోవచ్చు. మంచి వక్త కాకపోవచ్చు, కానీ ఒక మంచి వ్యూహకర్త. ప్రత్యర్థులపై రాజకీయ దాడి చేయడంలో తనదైన శైలి మైసూరాది. చట్టాలు,శాసనాలపై పట్టు ఉన్న నేత. మంచి పార్లమెంటేరియన్‌గా అన్ని పక్షాల నుంచి మన్ననలు పొందిన నేత. ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై ఆరోపణలు చేసే తత్వం మైసూరాది కాదు, అందుకే ఎమ్మెల్యేగా ఆయన ఉన్నపుడు అధికార పక్షంలోనైనా, ప్రతిపక్షంలోనైనా అసెంబ్లీలో మాట్లాడేందుకు నిలబడితే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. జగన్ జైలులో ఉన్న పరిస్థితిలో మైసూరా ఆలోచనలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తాయి. ఆయన ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తారు తప్ప ఏదో మొక్కుబడిగా చేసే అలవాటు ఉన్న నేత కాదు. జగన్ జైలుకు వెళ్ళిన పరిస్ధితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.


http://andhrabhoomi.net/content/rachabanda-0
Share this article :

0 comments: