ఎటాక్ జగన్.. చంద్రబాబు ఆదేశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎటాక్ జగన్.. చంద్రబాబు ఆదేశాలు

ఎటాక్ జగన్.. చంద్రబాబు ఆదేశాలు

Written By news on Friday, September 20, 2013 | 9/20/2013

ఎటాక్ జగన్.. చంద్రబాబు ఆదేశాలు
సమైక్యోద్యమాన్ని పక్కన పెట్టండి
నాలుగు రోజులూ ప్రెస్‌మీట్లతో హోరెత్తించండి 
తర్వాత మన మీడియా చూసుకుంటుంది
నేను కూడా ఢిల్లీలో చేయాల్సిందంతా చేస్తా
సాక్షి, హైదరాబాద్: 
‘‘ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు ఏ రోజూ వదలకుండా జగన్‌పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ విపరీతంగా ప్రచారం చేయండి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో హోరెత్తుతున్న ఉద్యమం గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఇదెందుకని నన్నడగకండి. అది తర్వాత చూసుకుందాం. ముందుగా నేను చెప్పినట్టుగా రోజూ విలేకరుల సమావేశం పెట్టి జగన్ టార్గెట్‌గా ఆరోపణలు గుప్పించండి. మన పత్రికలు వాటినెలా ప్రచురించాలన్నది నాకు వదిలిపెట్టండి. ఈ మూడు రోజులు నేను ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ నేను చేయాల్సింది చేస్తా’’ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా జారీ చేసిన ఆదేశాలివి!
 
 గురువారం పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కొద్ది రోజులుగా టీడీపీ నేతలు పెడుతున్న విలేకరుల సమావేశాలను, గుప్పిస్తున్న విమర్శలను పరిశీలించారు. రానున్న నాలుగు రోజులు మాత్రం జగన్‌పై ఆరోపణలను పెంచాలని, ఇంకా ఘాటుగా స్పందించాలని ఆదేశించారు. రోజువారీగా ఏ ఏ అంశాలపై దృష్టి సారించాలి, ప్రెస్ మీట్లలో ఎలా మాట్లాడాలన్న దానిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, ఎ.రేవంత్‌రెడ్డిలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. జగన్‌ను టార్గెట్ చేస్తూ అవసరమైతే రోజూ ఉదయం 11 గంటలకు ఒకసారి, సాయంత్రం మరోసారి ప్రెస్ మీట్లు పెట్టాలన్నారు. బెయిల్ కోసం జగన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సెప్టెంబర్ 9 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించడం, ఆ సమయంలో కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించడం తెలిసిందే. దాంతో బెయిల్ కోసం జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో, ఆయనపై మరింతగా ఆరోపణలు గుప్పించాలని బాబు నిర్ణయించినట్టు టీడీపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడువు ముగిసేదాకా కూడా జగన్‌పై బాబు, టీడీపీ నేతలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తూ రావడం తెలిసిందే.
 
 ‘‘జగన్‌పై హైకోర్టులో కేసు నమోదు చేసింది మొదలు, దర్యాప్తు సాగినంతకాలం ఏదోరకంగా సీబీఐకి సహకరించాం. ఇప్పుడు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెబుతోంది గనుక ఇక సీబీఐపైనా విమర్శలు ఎక్కుపెట్టండి’’ అని నేతలకు బాబు చెప్పినట్టు ఆ వర్గాలు తెలిపాయి. దాంతో గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో, టీడీఎల్పీలో వర్ల, రేవంత్, గాలి వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. జగన్ బెయిల్ వ్యవహారం, సీబీఐ దర్యాప్తు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, సాక్షి మీడియా గ్రూపు తదితరాలపై వారు విమర్శలు గుప్పించారు. పలు చానళ్లలో అవి ప్రముఖంగా ప్రసారమయ్యాయి. సీబీఐ వైఎస్సార్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని వర్ల ధ్వజమెత్తారు. జగన్ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దానిపై సీబీఐ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లను సీబీఐ ఎందుకు మూసివేయలేదని రేవంత్ ప్రశ్నించారు. వాటిని మూసేస్తే అంతా సంతోషించేవారన్నారు. ‘‘జగన్‌కు వేళకు టిఫిన్, భోజనం లభిస్తున్నాయి. అలాంటప్పుడు బెయిల్ ఎందుకు కోరుతున్నారో చెప్పాలి’’ అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలన్నీ బోగస్ అని గాలి విమర్శించారు.
 
 21 నుంచి 23 వరకూ ఢిల్లీలో చంద్రబాబు
 చంద్రబాబు శనివారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లి, సోమవారం రాత్రో, మంగళవారం ఉదయమో హైదరాబాద్ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించామని, మరికొందరు పెద్దలను కూడా కలిసే అవకాశముందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు.

Share this article :

0 comments: