పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

Written By news on Friday, July 27, 2012 | 7/27/2012


రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో సర్కారు చర్యలపై మండిపడ్డారు. ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాలకులు ప్రజలపై భారం మోపుతున్నారే తప్ప వారి బాధ్యతను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని, జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి బదులుగా ప్రజలపై ఎన్ని రకాలుగా భారాలు మోపాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అన్నిరకాల ధరలు రెట్టింపు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవించడమే కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఐదుసంవత్సరాల మూడునెలల కాలంలో ఎలాంటి భారాలు మోపకపోగా ప్రజల బాధ్యతను స్వీకరించారని వివరించారు. ప్రతీ సంక్షేమాన్ని జయప్రదం చేసి, ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా సువర్ణయుగం అందించారన్నారు. అయితే మహానేత మరణానంతరం పాలనాపగ్గాలు చేపట్టిన వారు అన్ని పథకాలను అవకాశం ఉంటే ‘డిలే’ చేయడం, సాధ్యమైతే ‘డిలిట్’ చేస్తున్నారని మండిపడ్డారు. 

అఖిలపక్షం ఏర్పాటు చేయాలి 

పేదవాడు తన భూములు అమ్ముకోవాలన్నా, లేదా కాస్త ధైర్యం చేసి కొనాలన్నా జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని గట్టు ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్తి విలువలో 0.5 శాతం పెంచితే దాన్ని భరించడం ఎలా? అని ప్రశ్నించారు. ఆఖరికి పెళ్లి రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా 40 రెట్లు పెంచడాన్ని తప్పుబట్టారు. భూములు, భవనాల విలువను పెంచాలని ప్రభుత్వం భావిస్తే అందుకు వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా విద్యుత్ సర్‌చార్జీల విషయంలో రూ.1,500కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరించాలని గట్టు డిమాండ్ చేశారు. మంత్రి పార్థసారథికి నైతికత ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 
Share this article :

0 comments: