‘ఇందిర జలప్రభ’ నత్తనడక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఇందిర జలప్రభ’ నత్తనడక

‘ఇందిర జలప్రభ’ నత్తనడక

Written By news on Friday, July 27, 2012 | 7/27/2012

 రెండేళ్లలో లక్ష బోర్లు తవ్వించి, 10 లక్షల ఎకరాలకు నీరందించడం పథకం లక్ష్యం
* ఇప్పటిదాకా తవ్విన బోర్లు 4 వేలు.. అందులో మోటార్లు బిగించి, కరెంటు కనెక్షన్లు ఇచ్చిన బోర్లు కేవలం 720 ఒకటి ఫెయిలైతే... రెండో బోరు భారం 
* లబ్ధిదారులే భరించాలని తాజా ఉత్తర్వులు

నల్లగొండ జిల్లాలో ఇందిర జలప్రభ పథకం కింద 230 చోట్ల బోర్లు వేశారు. 150 బోరు బావుల్లో జలధార ఉప్పొంగింది. అందులో ఇప్పటిదాకా ఎన్ని బోర్లకు కరెంటు మోటార్లు బిగించారో తెలుసా..? కేవలం 10! 
మిగతా బోర్లలో ఒక్కదానికి కూడా విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. కరెంటు స్తంభాలు పాతడానికి ఒక్క గుంత కూడా తీయలేదు. 150 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తే 1,500 ఎకరాలకు నీరందుతుంది.

విజయనగరం జిల్లాలో ఇందిర జలప్రభ ద్వారా కొత్తగా 40 వేల ఎకరాలు సాగు యోగ్యంలోకి తేవాలనేది లక్ష్యం. అందుకు 1,200 బోర్లు అవసరమని గుర్తించారు. ఇప్పటిదాకా 930 బోర్లు వేయాల్సి ఉన్నా.. ఏడు నెలల్లో 76 బోర్లు మాత్రమే వేశారు. అందులో కేవలం నాలుగు బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు!!

ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో వచ్చే రెండేళ్లలో రూ.1,800 కోట్లతో లక్ష బోర్లు తవ్వించి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పూర్తిగా చతికిలపడింది. బీడువారిన భూముల్లో సిరులు కురిపిస్తామంటూ కిందటేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ‘ఇందిర జలప్రభ’ పథకం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మొదటి ఏడాదిలో 60 వేల బోర్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4 వేల బోర్లు మాత్రమే వేశారు. వీటిలో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, మోటార్లు బిగించిన బోరు బావులు కేవలం 720! పథకం ఓవైపు నత్తనడకన సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వమే రోజుకో మెలికపెడుతూ లబ్ధిదారులకు చుక్కలు చూపెడుతోంది. 

తాజాగా పథకం లబ్ధిదారులకు మరో ఝలక్ ఇచ్చింది. పథకం కింద ఒకసారి వేసిన బోరులో నీరురాకపోతే.. రెండో బోరు వేయాలంటే అందుకయ్యే వ్యయాన్ని లబ్ధిదారులే భరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రహస్యంగా మెమో రూపంలో ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి వేసిన బోరులో నీరు సమద్ధిగా వస్తే మాత్రం ఆ భారాన్ని భరించే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని పేర్కొంది. పది ఎకరాలను ఒక బ్లాక్‌గా చేసి.. ఆ భూమి యజమానులందరినీ కలిపి బోరు యూజర్ గ్రూపు (బీయూజీ)గా పరిగణిస్తారు. ఒక బీయూజీకి ఒక బోరు వేసి ఆరుతడి పంటల సాగుకు దోహదపడడం పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఐదారుగురు రైతులను కలిపి ఒక గ్రూపుగా చేయడం వల్ల నీటి పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదీగాకుండా భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రాంతాల్లోనే బోర్లు వేస్తున్నప్పటికీ నీరు పడడం లేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు వేసిన 4 వేల బోర్లలో దాదాపు 20 నుంచి 25 శాతం మేరకు బోర్లు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండోసారి వేసే బోరుబావిలో నీరు రాకుంటే ఆ వ్యయాన్ని లబ్ధిదారులపైనే రుద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం. అలాగే ఒక బ్లాక్‌లో నీరు సమృద్ధిగా ఉంటే రెండో బోరు వేసుకోవచ్చని, అయితే అందుకు జియాలజిస్టు నుంచి ధ్రువపత్రం తెచ్చుకోవాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జయలక్ష్మి మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదెకరాలలోపు బ్లాక్‌లో మాత్రం రెండో బోరు వేయడానికి వీల్లేదని, అలాగే భూగర్భ జలాలు అధికంగా వినియోగించే ప్రాంతంలోనూ రెండోబోరు తవ్వకంపై నిషేధం ఉన్నట్లు తెలిపారు.

ఈ ధరలు గిట్టుబాటు కాదు..
బోరు బావులు తవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని పలు జిల్లాల్లోని రిగ్ యజమానులు చెబుతున్నారు. వారు ముందుకు రాకపోవడంతో బోర్ల తవ్వకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో ఆయా జిల్లాల్లోని భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ధర నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు కట్టబెట్టింది. అనంతపురం, విజయనగరం, తూర్పుగోదావరి, చిత్తూరు, మెదక్, కడప జిల్లాల్లో డ్రిల్లింగ్ ధరను పెంచారు. అందువల్లే 4 వేల బోర్ల తవ్వకాలు అయినా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

అడుగడుగునా నిర్లక్ష్యమే..
వివిధ శాఖల మధ్య సమన్వయ లేమితో పథకం నీరుగారుతోంది. బోర్లు వేయడానికి అనువైన ప్రాంతాలను గుర్తించడానికి సర్వే మొదలుకుని.. తవ్విన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు అమర్చడం వరకు అన్నింటా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. జియాలజిస్టుల కొరత కారణంగా బోరు పాయింట్ల గుర్తింపు ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. తవ్విన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటిదాకా 4 వేల బోర్లు తవ్వితే.. సుమారు 900 బోర్లకు మాత్రమే కరెంటు కనెక్షన్ ఇచ్చారు. అలాగే మోటార్ల ధరపై కూడా స్పష్టత లేదు. దీనిపై అధికారులు ఇప్పటివరకు మార్గదర్శకాలు ఇవ్వలేదు. 

రాష్ట్రస్థాయిలో ఒక ధర నిర్ణయించే వరకు జిల్లా కమిటీలు నిర్ధారించిన ధరలు అమల్లో ఉంటాయని మాత్రమే చెబుతున్నారు. మోటార్ల ధర నిర్ణయించడానికి టెండర్లు పిలవగా.. దానిపై రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల యజమానులు కోర్టుకెళ్లారు. దీంతో టెండర్లు రద్దయ్యాయి. ఆ తర్వాత మోటారు ధర నిర్ణయంపై ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బోర్ల కింద బిందు, తుంపర సేద్యమే చేయాల్సి ఉన్నందున... మైక్రో ఇరిగేషన్ పరికరాల సరఫరా బాధ్యతలను ఉద్యానవన విభాగానికి అప్పగించారు. ఇలా పలు శాఖలతో ముడిపడి ఉండడం.. వాటి మధ్య సమన్వయం లోపించడంతో పథకం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది.
-న్యూస్‌లైన్, హైదరాబాద్/న్యూస్‌లైన్ నెట్‌వర్క్

జిల్లాల్లో ఇదీ పరిస్థితి...

* వరంగల్ జిల్లాలో 33 వేల ఎకరాలను ఇందిర జలప్రభ కింద సాగులోకి తెచ్చేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఇప్పటివరకు 141 బోర్లు వేయగా.. 128 బోర్లలో నీళ్లు వచ్చాయి. ఇందులో 19 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

* చిత్తూరు జిల్లాలో ఆరు నెలలుగా పథకం ముందుకు సాగడం లేదు. రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఒప్పందం కుదుర్చుకున్న డ్రిల్లింగ్ యజమానులు బోర్లు తవ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా 1,090 బోర్లు వేయూల్సి ఉండగా.. 280 మాత్రమే వేశారు. 123 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

* కృష్ణా జిల్లాలో పథకం కింద ఒక్క బోరు కూడా వేయలేదు. పైసా ఖర్చు పెట్టలేదు. జిల్లావ్యాప్తంగా 67 బోర్‌వెల్స్ వేయాలని నిర్ణయించగా.. 56 బోర్లకు అనుమతి లభించింది. అందులో 6 బోర్లకు సంబంధించిన పనులు మాత్రమే జరుగుతున్నాయి. మిగతా 50 బోర్ల పనులు మొదలుపెట్టలేదు.

* గుంటూరులో పథకానికి మొత్తం రూ.7.48 కోట్లు మంజూరు కాగా.. రూ.98.22 లక్షలు ఖర్చు చేశారు. 102 బోర్లు మంజూరయ్యాయి. ఇప్పటిదాకా 49 బోర్లు వేశారు.

* ఆదిలాబాద్ జిల్లాలో 765 బోర్లను గుర్తించినా.. ఇప్పటి వరకు 185 బోరు బావులే తవ్వారు. అందులో 12 బావులకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.

* నిజామాబాద్ జిల్లాలో రెండేళ్లలో 1,500 బోర్లు వేయాల్సి ఉంది. కానీ ఐదు నెలల్లో కేవలం 62 బోర్లు తవ్వి, వాటిలో 39 బోరు బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.
Share this article :

0 comments: