వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

Written By news on Tuesday, October 30, 2012 | 10/30/2012

విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరిక 
మాజీ ఎమ్మెల్యే చెంగలతో పాటు విశాఖ టీడీపీ నేతలదీ అదే బాట

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వివిధ రాజకీయపక్షాల నేతల చేరికలు ఊపందుకున్నాయి. ప్రజా సమస్యల పట్ల పాలక, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆయా పార్టీల నేతలు ప్రజాపక్షంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు నేతలు పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి.జి.కుమార్ (మాడుగుల), భూపతిరాజు అచ్యుతరామరాజు (భీమిలి), డాక్టర్ పోలిశెట్టి సునీతిలతో పాటు పెద్ద సంఖ్యలో వారి అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, పెన్మత్స సాంబశివరాజు, జ్యోతుల నెహ్రూ, ఎం.మారెప్ప, ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, టి.బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మూడేళ్లుగా ఎంతో బాధపడ్డా: ‘‘మహానేత వైఎస్ చరిష్మా వల్లే నేను ఎమ్మెల్యేగా గెలిచా. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని నాకు టికెట్ ఇచ్చి నేరుగా అసెంబ్లీకి పంపించారు. అలాంటి కుటుంబానికి మూడేళ్లు దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉంది. ఈ క్షణం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తా’’ అని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దాల రాజేష్ చెప్పారు. వైఎస్ మరణం జీర్ణించుకోలేని వారిలో తాను కూడా ఒకడినని అన్నారు. ఆయన మరణించి మూడేళ్లు అవుతున్నా ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకున్న వారిలో తానూ ఉన్నానని, కొన్నాళ్లపాటు ఆయన వెంట నడిచిన ప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. ‘‘వెనుకబడిన చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గకూడదని వైఎస్ చెప్పేవారు. ఆ మహానేత మాటను నెరవేర్చడం కోసమే మూడేళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గాన్ని రూ.200 కోట్ల విలువైన పనులతో అభివృద్ధి చేయగలిగా’’ అని వివరించారు. ఇన్నాళ్లూ వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నందుకు చాలా బాధపడినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లేఖను స్పీకర్‌కు పంపనున్నట్లు ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

బాబూ టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేయండి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై చెంగల వెంకట్రావ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టని చంద్రబాబు, ప్రజలకు అండగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు, కుతంత్రాలు చేసేందుకు చీకట్లో చిదంబరంను కలుస్తారని దుయ్యబట్టారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం చేతకాకపోతే చిరంజీవి మాదిరిగా చంద్రబాబు కూడా టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు వేరుగా లేవని, రెండూ కలగలిసి ప్రజాసమస్యలను గాలికొదిలేశాయని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుండెల్లో నాటుకుపోయాయన్నారు. ‘‘ఈరోజు ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. మళ్లీ వైఎస్ సువర్ణయుగం కోసం జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు డిసైడయ్యారు’’ అని చెంగల పేర్కొన్నారు. చెంగలతో పాటు పెద్ద ఎత్తున నేతల చేరికతో విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ మరింత బలోపేతమవుతోందని ఎమ్మెల్యే బాబురావు స్పష్టం చేశారు.

పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావులతోపాటు వాల్మీకి సంఘం నేతలు కె.సత్యరాజు, బండి శివ, గోపాల్, బోయ రమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: