తెలంగాణకు సత్వర పరిష్కారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణకు సత్వర పరిష్కారం

తెలంగాణకు సత్వర పరిష్కారం

Written By news on Tuesday, October 30, 2012 | 10/30/2012


ఎవరికి అన్యాయం జరగకుండా సమస్యను పరిష్కరించాలన్నదే జగన్ అభిమతం
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి
వైఎస్ విజయమ్మకు బ్రహ్మరథం పట్టిన భువనగిరి
రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ కింద
రాష్ట్రాలను విభజించాల్సింది కేంద్రమే!
తెలంగాణలో పేదరికాన్ని వైఎస్ గుర్తించారు..అభివృద్ధికి తపనపడ్డారు
జగన్ బయటకు వస్తారు.. వైఎస్ నాటి సువర్ణయుగం అందిస్తారు
జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిక

భువనగిరి నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరం తపన పడ్డారని, జలయజ్ఞం మొదలు అనేక పథకాల్లో ప్రాధాన్యత కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. రాయలసీమలో మాదిరిగానే తెలంగాణలోనూ తీవ్ర పేదరికం ఉందని వైఎస్ గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణపై జగన్‌బాబు పార్టీ ప్లీనరీలోనే స్పష్టంగా చెప్పారన్నారు. వైఎస్‌తో పాటు జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణకు గానీ, తెలంగాణ ప్రజానీకానికి గానీ ఎన్నడూ వ్యతిరేకం కాదని విజయమ్మ స్పష్టం చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా ఈ సమస్యను పరిష్కరించాలని జగన్ చెప్పారన్నారు.

సోమవారం రాత్రి యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి సహా పలువురు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నల్లగొండ జిల్లా భువనగిరిలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘తెలంగాణ ఇచ్చేవారమూ కాదు, తెచ్చేవాళ్లమూ కాదు, రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ కింద రాష్ట్రాలను విభజించాల్సింది కేంద్రమే! ఈ విషయంలో కేంద్రం చేయాల్సింది సత్వరమే చేయాలి. తెలంగాణలో ఇంతమంది చనిపోయారంటే అందుకు కేంద్రమే బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రజల్లో ఉన్న బలీయమైన ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని తమ పదవులకు రాజీనామాలు చేసిన ఆరుగురు ఎమ్మెల్యేల స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా పెట్టలేదు.

మా పార్టీ స్వార్థపూరిత అవకాశవాద పార్టీ కాదు, విశ్వసనీయత గల పార్టీ. ఉన్నవారు, లేనివారు ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందడం కోసమే వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అందులోని చాలా వ్యాధులను తొలగించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చింది’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ తొలి సంతకం చేసిన ఉచిత విద్యుత్ పథకం వల్ల రాష్ట్రం మొత్తం మీద 24 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే ఒక్క తెలంగాణలోనే 14 లక్షల మందికి మేలు జరిగిందని తెలిపారు. అలాగే కరెంటు బకాయిల రద్దు వల్ల అధికంగా తెలంగాణ రైతులకు మేలు జరిగిందన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైఎస్ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.51 వేల కోట్లను ఖర్చు చేస్తే అందులో తెలంగాణ ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ప్రధాని ప్రత్యేక నిధి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో రుణాల రీషెడ్యూలింగ్ చేయించిన విషయం గుర్తుచేశారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణా నది నుంచి మంచినీటిని అందజేయాలనే లక్ష్యంతో పథకాలు చేపట్టి 90 శాతం గ్రామాలకు మేలు చేశారని, మరో పది శాతం గ్రామాలే ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పారు. అలీసాగర్, గుత్ప, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులు వైఎస్ హయాంలో పూర్తయ్యాయని వివరించారు. ఎల్లంపల్లి, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులకు వైఎస్ అన్ని అనుమతులు తేగలిగినా.. ఇప్పటి ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేక పోతోందన్నారు. తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జలసంఘం నుంచి అనుమతులు తెచ్చినా, ఇటీవల మహారాష్ట్ర సంసిద్ధత వ్యక్తం చేసినా దాని నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

బాబు దొంగ మాటలు ప్రజలు నమ్మరు

‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు తిండి సరిగ్గా దొరకని పరిస్థితి. చేద్దామంటే కూలీ కూడా ఉండేది కాదు. వ్యవసాయానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కరెంటు బిల్లులు కట్టలేదని బాబు రైతులను వేధించారు. ప్రత్యేకంగా పోలీసుస్టేషన్లు పెట్టి వారిపై కేసులు పెట్టారు. విద్యుత్ చౌర్యం చేస్తే విదేశాల్లో అయితే ఉరి తీస్తారని, తాను కనుక వారిని జైలుకు మాత్రమే పంపుతున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం దండుగ అనీ ఆయన అన్నారు. 4 వేల మంది రైతులు ఆయన హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయలకు కిలో బియ్యం ధరను 5.15 రూపాయలకు పెంచింది బాబే. సంపూర్ణ మద్య నిషేధం ఎత్తి వేసింది ఆయనే. ఇప్పుడేమో బెల్ట్ షాపులను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని వైఎస్ కోరితే ‘పరిహారం ఇస్తే ఆ మొత్తం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు’ అని హేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చెబుతున్న దొంగమాటలు ప్రజలు ఎంతమాత్రం నమ్మరు. 2009లో టీఆర్‌ఎస్‌తో జత కలిసి ఎన్నికల ప్రణాళికలో కూడా తెలంగాణ అంశం చేర్చి ఇప్పుడు వేరే మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి అవకాశవాదం బాబుకే చెల్లు’ అని విజయమ్మ పేర్కొన్నారు.

వైఎస్ హామీలను తుంగలో తొక్కారు: ‘వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన అధికారంతో రాజ్యమేలుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది. రూ.15 వేల కోట్ల మేరకు సర్‌చార్జి పేరుతో కరెంటు చార్జీలను పెంచింది. ఆడవాళ్లకు ఇబ్బంది కలిగించేలా వంటగ్యాస్ సబ్సిడీని 6 సిలిండర్లకే పరిమితం చేశారు. ఎన్నోసార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. కూరగాయల ధరలు పెరిగాయి.

ఇక పథకాల విషయానికి వస్తే అన్నింటినీ నీరు గార్చారు. బీబీనగర్ వద్ద రూ.86 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ స్థాయిలో నిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తే దానిని ఇప్పటికీ వినియోగించుకోవడం లేదు. తెలంగాణలోని 6 జిల్లాల ప్రజలు ఆధునిక వైద్యం కోసం హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా చేయాలని వైఎస్ అభిలషిస్తే.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. పరకాలలో కొండా సురేఖ ఓటమికి వీరి కుమ్మక్కే కారణం’ అని విజయమ్మ అన్నారు. ఎవరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆ దేవుడు ఉన్నాడని, జగన్ బయటకు వస్తారని.. రాష్ట్ర ప్రజలకు వైఎస్ నాటి సువర్ణయుగాన్ని అందిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ బయటకు వచ్చేవరకూ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి సహా పలువురు నేతలను ఆమె ఆశీర్వదించి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి కొండా సురేఖ, వై.వి.సుబ్బారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, హెచ్.ఎ.రెహ్మాన్, డి.రవీంద్రనాయక్, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


విజయమ్మకు భువనగిరి నీరాజనం

భువనగిరి నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు భువనగిరి ప్రజలు నీరాజనం పలికారు. బహిరంగ సభ జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలతో కిటకిటలాడింది. విజయమ్మ ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తున్నపుడు మంచి స్పందన లభించింది. కొండా సురేఖ, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ప్రసంగిస్తున్నపుడు కూడా సభలో ఉత్సాహం ఉరకలు వేసింది. విజయమ్మ రాకకు ముందే జనంతో మైదానం నిండిపోయింది. భువనగిరి పొలిమేరల్లో విజయమ్మ వాహనం ప్రవేశించినప్పటి నుంచే ప్రజలు ఉత్సాహంతో కదం తొక్కారు. ఆమె సభా స్థలికి చేరుకోగానే సమీపంలోంచి చూసేందుకు ఎగబడ్డారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు లేచి నిలబడి విజయమ్మకు దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

‘జై జగన్...జై తెలంగాణ...జోహార్ వైఎస్సార్...’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బలమైన కేంద్రంగా ఉన్న భువనగిరిలో విజయమ్మ సభ ఊహించిన దానికన్నా ఎక్కువగా విజయవంతం కావడం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పార్టీ ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద స్థాయిలో జరిగిన తొలి సభలో తెలంగాణ నేతలంతా హాజరు కావడం స్థానిక నేతలకు మంచి ఊపునిచ్చింది. తెలంగాణపై విజయమ్మ విస్పష్టమైన వైఖరిని ప్రకటించినప్పుడు, ఈ స్పష్టతతో సంతృప్తి చెందుతున్నామని జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్కొన్నప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. తెలంగాణలో దగాపడ్డ బిడ్డలంతా ఇక్కడున్నారంటూ కె.కె.మహేందర్‌రెడ్డి,డి.రవీంద్రనాయక్‌ల పేర్లను జిట్టా ప్రస్తావించినప్పుడు కూడా జనం ఇదే విధంగా స్పందించారు. 
Share this article :

0 comments: