తెలుగుదేశం పార్టీలో కలవరం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగుదేశం పార్టీలో కలవరం..

తెలుగుదేశం పార్టీలో కలవరం..

Written By news on Thursday, November 1, 2012 | 11/01/2012

- రాజకీయ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన
- ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నేతలు
- వరుస ఓటములు, వైఫల్యాలు కారణమనే అభిప్రాయం..
- కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగూ కొంపముంచుతోందనే భావన
- చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని అంగీకరిస్తున్న నాయకులు 
- ఇప్పటికే టీడీపీని వీడిన 13 మంది ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ రాజకీయ భవిష్యత్తుపై తెలుగుదేశం పార్టీ నేతల్లో నమ్మకం సడలిపోతోంది. పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదని వారు భావిస్తున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీని వీడిపోతున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం అధినాయకత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అధినేత పాదయాత్ర చేపట్టినా ప్రయోజనం లేకుండా పోతోందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

2004, 2009 సాధారణ ఎన్నికల్లో వరుస పరాజయాల అనంతరం.. పార్టీ ఎలాంటి ఎదుగుదల సాధించకపోవడం, ముఖ్యంగా పార్టీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లడం నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. 2009 సాధారణ ఎన్నికల తర్వాత గత మూడేళ్ల కాలంలో జరిగిన ఏ ఎన్నికలోనూ టీడీపీ తన ప్రభావాన్ని చూపకపోవడంతో నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. సమీప భవిష్యత్తులోనూ పార్టీ పరిస్థితి మెరుగుపడే సూచనలు కానరాకపోవడంతో ప్రత్యామ్నాయం తప్పదని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల అంతర్గత విశ్లేషణ. 2004 సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 46 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆశించినా తీవ్ర నిరాశ ఎదురైంది. 92 స్థానాల వరకు గెలుచుకుని చతికిలపడింది. అనంతరం వరుస పరిణామాల నేపథ్యంలో నాయకత్వంపై నమ్మకం క్షీణించడం, వివిధ అంశాలపై స్పష్టత లేని కారణంగా ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బయటకువెళ్లారు. గత మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లో ఆ పార్టీ చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. వివిధ అంశాలపై స్పష్టత లేకపోవడం, గతంలో సాధ్యం కాదని చెప్పిన వాటినే ఇప్పుడు చేస్తామంటూ హామీలు గుప్పించడం, ఎక్కడాలేని విధంగా అధికార కాంగ్రెస్ పార్టీతో రాజీపడటం, పార్టీ అధినేత చుట్టూ ఏర్పడిన కోటరీ, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల్లో అపరిష్కృతంగా ఉన్న విభేదాలు... వెరసి పార్టీ నాయకత్వం పట్టు కోల్పోయిన కారణంగా నాయకులు వేరే దారులు వెతుక్కుంటున్నారని పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే ఒక నాయకుడు విశ్లేషించారు. 

26 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు 
2009 సాధారణ ఎన్నికల తర్వాత కడ ప, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 14 నియోజకవర్గాలను కలుపుకొని రాష్ట్రం మొత్తంమీద 54 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉప ఎన్నికలు జరిగాయి. ఒక్క బాన్సువాడ ఉప ఎన్నికల్లో మినహా టీడీపీ మిగిలిన అన్ని చోట్లా పోటీ చేసింది. ఏ ఒక్కచోటా పార్టీ అభ్యర్థులు గెలవకపోగా, మొత్తం 26 నియోజకవర్గాల పరిధిలో పార్టీకి డిపాజిట్ దక్కలేదు. 2010 జూలైలో జరిగిన 12 ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ దక్కలేదు. ఎల్లారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూర్ కాగజ్‌నగర్, సిద్ధిపేట, వరంగల్ పశ్చిమ, ధర్మపురి, వేములవాడ, కోరుట్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో డిపాజిట్‌ను కోల్పోయింది. 2011 ఏప్రిల్‌లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరుచోట్ల డిపాజిట్టు రాలేదు. 

ఈ ఏడాది మార్చిలో తెలంగాణలోని ఆరు చోట్ల, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగగా.. కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో టీడీపీ డిపాజిట్‌ను దక్కించుకోలేక చతికిలపడింది. ఇదే ఏడాది జూన్‌లో నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ గెలకవకపోగా, అయిదు చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఆళ్లగడ్డ, రాజంపేట, రైల్వే కోడూరు, నర్సాపురం, రామచంద్రపురం (నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు పట్టణ, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా) డిపాజిట్ కోల్పోయింది. ఈ విధంగా పార్టీ పరిస్థితి దిగజారిపోవడంతో పాటు.. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే టీడీపీ ప్రభావం ఏమాత్రం ఉండదని ఇటీవలి కాలంలో ఎన్డీటీవీ, ఇండియా టుడే, ఇతర సంస్థలు జరిపిన సర్వేల్లోనూ వెల్లడికావడం పార్టీ నేతల్లో ఆందోళనను మరింత పెంచింది.

ఒక్కొక్కరుగా బయటకు...
ఈ నేపథ్యంలో ఇప్పటికే మండల స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో స్థాయి వరకు చాలామంది నేతలు పార్టీని వీడారు. తెలంగాణ అంశంపై పార్టీ వైఖరి స్పష్టం చేయకపోవడానికి నిరసనగా ఎమ్మెల్యేలు నాగం జనార్దనరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, గంపా గోవర్ధన్, చెన్నమనేని రమేష్, జోగు రామన్న పార్టీని వీడారు. వీరిలో కొప్పుల, సముద్రాల మినహా మిగిలిన వారందరూ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి స్వతంత్రంగా, టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి తిరిగి గెలుపొందారు. అలాగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చటాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తర ఫున పోటీచేసి తిరిగి గెలుపొందారు. జగన్‌పై అభిమానంతో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పార్టీని వీడారు. 

చంద్రబాబు తన సొంత సామాజికవర్గ నేతలను ప్రోత్సహించటాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, ఉప్పులేటి కల్పన, ప్రధాన కార్యదర్శి బెరైడ్డి రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముక్కు కాశిరెడ్డి, గొట్టిపాటి నర్సయ్య, డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, చెంగల వెంకట్రావు, సంకినేని వెంకటేశ్వరరావు, ఎస్.రఘురామిరెడ్డి, పీవీ కృష్ణారావు (కృష్ణబాబు), చింతలపూడి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు డాక్టర్ రాజారావు, సీఆర్ జగదీశ్వరరావు తదితరులు పార్టీని వీడారు.

ప్రవీణ్, వనితల సస్పెన్షన్
చంద్రబాబు వ్యవహార శైలి, మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలపై ఎంతోకాలంగా అసంతృప్తితో ఉన్న చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజుల కిందట బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకత్వం తీరు మారకపోతే పార్టీని వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. మంగళవారం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైల్లో కలిసినట్టు టీవీల్లో వార్తలు ప్రసారం కావడంతో.. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా టీడీపీ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి కూడా అధినేత నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ బలోపేతానికి కాకుండా బలహీనపరిచేందుకు అన్నట్లుగా చంద్రబాబు చర్యలున్నాయని ఆయన ఇప్పటికే పలు విమర్శలు చేశారు.

స్థానిక నేత ముళ్లపూడి బాపిరాజు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవట ం పట్ల నిరసన వ్యక్తం చేసిన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనితను కూడా త క్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రసాద్ ప్రకటించారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ బలపరిచిన అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన టీడీపీ ఇప్పటివరకూ తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందించలేదని నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తెలిపారు. ఇదే విషయమై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయటంతో పాటు పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా కోరతానని తెలిపారు. 

పాదయాత్రతోనూ ఫలితం లేదా..!
చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని పార్టీ నేతలే అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇటు పార్టీ నేతలు, అటు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే పేరిట అక్టోబర్ రెండో తేదీ నుంచి 117 రోజుల సుదీర్ఘ పాదయాత్రకు ఉపక్రమించారు. తన యాత్ర పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన ఊహించారు. అందుకు భిన్నంగా ఒకపక్క బాబు యాత్ర కొనసాగుతుంటే మరోపక్క ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు టీడీపీని వీడిపోతుండటం అధినాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 

వారిపై అనర్హత పిటిషన్!
తెలుగుదేశం నుంచి సస్పెండైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిగా టీడీపీ ఇప్పటికే స్పీకర్‌కు పిటిషన్ అందజేసింది. తాజాగా పార్టీ నుంచి సస్పెండైన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), చిన్నం రామకోటయ్య, తానేటి వనిత, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీకి రాజీనామా చేసినా ఇంకా ఆమోదించని కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారిలపై అనర్హత పిటిషన్‌ను త్వరలో స్పీకర్‌కు అందజేస్తామని పార్టీ నేత ఒకరు బుధవారం మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తుపై ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలో చేరితే మంచిదని అన్నారు.
Share this article :

0 comments: