చర్చ జరగనిద్దాం.. బిల్లును ఓడిద్దాం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చర్చ జరగనిద్దాం.. బిల్లును ఓడిద్దాం!

చర్చ జరగనిద్దాం.. బిల్లును ఓడిద్దాం!

Written By news on Tuesday, January 7, 2014 | 1/07/2014

చర్చ జరగనిద్దాం.. బిల్లును ఓడిద్దాం!వీడియోకి క్లిక్ చేయండి
  • సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు
  •  ముందు సమైక్య తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ
  •  పార్లమెంటులో విభజన ప్రక్రియను అడ్డుకోవచ్చని వెల్లడి
  •  సచివాలయ సీమాంధ్ర ఫోరం ఆధ్వర్యంలో అఖిలపక్షం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చను జరగనిచ్చేందుకు కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందు సమైక్య తీర్మానం చేయాల్సిందేనని, ఆ తర్వాతే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని కోరింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సచివాలయ సీమాంధ్ర ఫోరం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఇందుకు వేదికైంది. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీలో పాల్గొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మొత్తం 108 మంది సమావేశానికి హాజరయ్యారు. ై
 
 వెఎస్సార్‌సీపీ మినహా కాంగ్రెస్, టీడీపీ ప్రతినిధులు విభజన బిల్లుపై చర్చకు అంగీకారం తెలియజేశారు. సమైక్యాంధ్ర కోసం తీర్మానం పెట్టాలన్న వైఎస్సార్‌సీపీ ప్రతిపాదనపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు మౌనం పాటించారు. అయితే విభజన బిల్లుపై చర్చ ముగిశాక చివర్లో ఓటింగ్‌కు పట్టుబట్టాలని, అందులో బిల్లును ఓడించి రాష్ట్రపతికి పంపాలని ఆ పక్షాలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైన అంశం కనుక చర్చించేందుకు మరింత సమయం కావాలని రాష్ట్రపతిని కోరవచ్చని, అందుకాయన అంగీకరించకుంటే సీమాంధ్ర ఎమ్మెల్యేలందరి సంతకాలతో కూడిన అఫిడవిట్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రతిపాదించారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ముందు సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలని, ఆ తర్వాత మాత్రమే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని వాదించింది. అలాగైతేనే మున్ముందు పార్లమెంట్‌లో విభజనను అడ్డుకోవడానికి వీలుంటుందని పేర్కొంది.
 
 ఎన్నికల దాకా అడ్డుకోగలిగితే చాలు
 
 మంత్రి తోట నరసింహం చర్చ ప్రారంభించారు. విభజన బిల్లును అసెంబ్లీలో ఓడిస్తే తెలంగాణ ఏర్పాటుపై ముందుకెళ్లేందుకు కేంద్రం సాహసించబోదన్నారు. అసెంబ్లీలో బిల్లు ఓడిపోయాక కూడా రాష్ట్రపతి దాన్ని పార్లమెంటుకు పంపిస్తారని తాను భావించడం లేదని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. ‘‘ఒకవేళ రాష్ట్రపతి అలా చేసినా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సీమాంధ్ర ఎమ్మెల్యేల సంతకాలతో తెలంగాణకు వ్యతిరేకంగా పిటిషన్ వేస్తే విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టు తప్పకుండా స్టే ఇస్తుందని న్యాయ నిపుణులు కూడా సూచిస్తున్నారు’’అని తెలిపారు. 
 
 సాధారణ ఎన్నికల వరకూ విభజనను అడ్డుకోగలిగితే రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించగలమని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నందున అసెంబ్లీ నుంచి బిల్లు రాష్ట్రపతికి వెళ్లిన తరవాత ఉండే సమయం చాలా కీలకమైనదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విభజన బిల్లుపై చర్చ జరిపి దాన్ని ఓడించాలని, చర్చకు మరింత సమయం కావాలని రాష్ట్రపతిని కోరాలని సూచించారు.
 
 చర్చ మొదలైతే విభజనకు ఒప్పుకున్నట్టే
 కానీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైతే విభజనకు అంగీకరించినట్టే అవుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వాదించారు. కాబట్టి చర్చ జరగకుండా అడ్డుకోవాలని సూచించారు. చర్చ జరిగి, చివర్లో బిల్లుపై ఓటింగ్ జరగకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు సభను అడ్డుకుంటే చేయగలిగేది ఏముంటుందని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర మద్దతుగా ఎమ్మెల్యేలందరూ అఫిడవిట్లపై సంతకాలు చేసి రాష్ట్రపతికి అందజేయాలని నెల క్రితమే తాము ప్రతిపాదించినా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. పార్టీలకతీతంగా అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వ్యవహరించాలని, సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాకే బిల్లుపై చర్చను అనుమతించడంపై మిగతా పక్షాలన్నీ ఇప్పటికైనా ఆలోచించాలని కోరారు. 
 
 రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చ జరగకపోవడం సరికాదని మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కాబట్టి అన్ని పార్టీలూ చర్చకు సిద్ధంగా ఉండాలని సూచించారు. చర్చ జరిగాక ప్రతి క్లాజ్‌పైనా ఓటింగ్ ఉంటుందని, ఈ విషయాన్ని బీఏసీ సమావేశంలో స్పీకర్ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. అప్పుడు బిల్లును ఓడించాలన్నారు. అంతే తప్ప అసలు చర్చే జరగకుండా అడ్డుకుని, ఆనక మరింత సమయం కావాలని రాష్ట్రపతిని కోరితే ఫలితముండబోదన్నారు.
 
 నాలుగు తీర్మానాలు
 అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించడం, చర్చలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడడం, పార్టీలకతీతంగా సభ్యులంతా పరస్పరం సహకరించుకోవడం, సమైక్యాంధ్రకు మద్దతుగా నోటరీ అఫిడవిట్లతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడమనే నాలుగు తీర్మానాలను ప్రజాప్రతినిధులంతా ఆమోదించారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ తెలిపారు. అవసరమైతే దీనిపై మరోసారి అఖిలపక్షం నిర్వహిస్తామని, ఉద్యోగుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశాన్నీ ఆలోచిస్తున్నామని అన్నారు. 
 
 అఖిలపక్షంలో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి, కాసు కృష్ణారెడ్డి, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు (వైఎస్సార్‌సీపీ), గాదె వెంకటరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు (కాంగ్రెస్), దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, లింగారెడ్డి (టీడీపీ), ఉద్యోగుల ఫోరం నేతలు మురళీమోహన్, వెంకటసుబ్బయ్య, వెంకట్రామిరెడ్డి, కె. వి కృష్ణయ్య, బెన్సన్ తదితరులు పాల్గొన్నారు. దీనికి అన్ని పార్టీలనూ ఆహ్వానించినట్టు ఫోరం ప్రతినిధులు చెప్పారు.
Share this article :

0 comments: