వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఖాకీల దమనకాండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఖాకీల దమనకాండ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఖాకీల దమనకాండ

Written By news on Friday, January 10, 2014 | 1/10/2014

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఖాకీల దమనకాండ
  • విజయమ్మ సహా అంతా అదుపులోకి
  •   నిరసనలతో హోరెత్తిన  అసెంబ్లీ లాబీలు
  •   సస్పెన్షన్‌ను నిరసిస్తూ  రోడ్డెక్కిన ఎమ్మెల్యేలు
  •   అరెస్టు చేసి గోషామహల్‌కు తరలింపు
  •   అసెంబ్లీ వాయిదా పడేదాకా నిర్బంధం




 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశాక, వారిపై పోలీసుల అణచివేత చర్యలకు అసెంబ్లీ ఇన్నర్ లాబీల నుంచే తెర లేచింది. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా లాబీల్లోకి తరలించారు. వారంతా మళ్లీ ఇన్నర్ లాబీల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తలుపులు మూసివేశారు. అందుకు ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది పెనుగులాటకు, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కనీసం నిరసన తెలిపేందుకు కూడా ఎమ్మెల్యేలకు పోలీ’జీలు ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు. తమను సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని, తాము లాబీల్లో, ఇన్నర్ లాబీల్లో ఉండవచ్చని సభ్యులన్నారు. ‘హైదరాబాద్ నుంచి మమ్మల్ని తరిమేస్తారా?’ అంటూ తలుపులను బలవంతంగా వాటిని తెరిచి ఇన్నర్ లాబీల్లోకి దూసుకెళ్లారు. వారు సభలోకి వెళ్తారనే అనుమానంతో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మార్షల్స్ విధులు నిర్వరిస్తున్న పోలీసులు ఇన్నర్ లాబీలోని మెట్ల వద్ద అడ్డుకున్నారు. మరోసారి చేతులపై ఎత్తుకుని బయటికి తరలించారు. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలంతా 10 నిమిషాల పాటు లాబీల్లో బైఠాయించారు. సభ నుంచి వాకౌట్ చేసొచ్చిన విజయమ్మ వారితో కలిశారు. అక్కడి నుంచి తరలించేందుకు మార్షల్స్ ప్రయత్నించడంతో నిరసనగా విజయమ్మ నేతృత్వంలో అసెంబ్లీ బయట రవీంద్రభారతి చౌరస్తా దిశగా బయల్దేరారు.
 
సస్పెండైన ఎమ్మెల్యేలతో పాటు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వీరిలో ఉన్నారు. అయితే వారిని ఖాకీలు అడుగడుగునా అడ్డుకున్నారు. సభా ప్రాంగణం నుంచి బయటికొచ్చి సమైక్యాంధ్రప్రదేశ్ ప్లకార్డులను పట్టుకుని బయటకు నిష్ర్కమిస్తున్న వారిని కూడా వదల్లేదు. ఎమ్మెల్యేలు రోడెక్కుతుండగానే, పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం ఒక్క ఉదుటున అందరినీ చుట్టుముట్టారు. అసెంబ్లీ రెండో గేటు గుండా బయటికొస్తున్నఎమ్మెల్యేలను చిత్రించేందుకు ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను, విలేకరులను ఎక్కడికక్కడ లాగిపారేశారు. ప్రత్యేకంగా రోప్ పార్టీని ఏర్పాటు చేసి మరీ ఎమ్మెల్యేల దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకోగానే వారిపై బలప్రయోగం చేశారు.
 
నిరసనగా రోడ్డుపై బైఠాయించిన కొరుముట్ల, గడికోటలను లాగిపడేశారు. విజయమ్మతో పాటు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కె. శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి, బాలినేని, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, విశ్వరూప్, శ్రీకాంత్‌రెడ్డి, భూమన, కాటసాని రామిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. దీన్ని నిరసిస్తూ వారంతా అక్కడే ధర్నాకు దిగారు. సభ్యులను అసెంబ్లీ వాయిదా పడేదాకా నిర్బంధంలోనే ఉంచి, మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున గోషామహల్‌కు తరలి వచ్చి ఎమ్మెల్యేలకు సంఘీభావం ప్రకటించారు.ఎమ్మెల్యేల అరెస్టుపై వైఎస్ విజయమ్మ విస్మయం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: