బాబు హయాంలో 8 సార్లు, కిరణ్ హయాంలో 4 సార్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు హయాంలో 8 సార్లు, కిరణ్ హయాంలో 4 సార్లు

బాబు హయాంలో 8 సార్లు, కిరణ్ హయాంలో 4 సార్లు

Written By news on Monday, March 24, 2014 | 3/24/2014

పన్నులతో  పేదల్ని బాదేశారు
చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలపై వైఎస్ విజయమ్మ ధ్వజం

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ హయాంలలో పన్నులు అమాంతం పెంచి పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల జీవితాలతో చెలగాటమాడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు హయాంలో 8 సార్లు, కిరణ్ హయాంలో 4 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వీటితోపాటు ఆర్టీసీ, నీటి పన్నులు, మున్సిపాలిటీ పన్నులు, గ్యాస్, పెట్రో ల్, డీజిల్, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేశారన్నారు.

రూ.32 వేల కోట్ల కరెంట్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిన కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే చంద్రబాబు విప్ జారీచేసి మరీ కాపాడారన్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీల పేరుతో మరో రూ.5,600 కోట్ల భారం వేయబోతున్నారని నిప్పులు చెరిగారు. ‘‘ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఉన్నారు. ఆయన పాలన సువర్ణ యుగం. అలాంటి పాలన జగన్‌బాబుతోనే మళ్లీ సాధ్యమవుతుంది.


ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని జగన్‌బాబును సీఎంను చేద్దాం’’ అని విజయమ్మ కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో పైసా పన్ను, చార్జీలు పెంచకుండా రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటన కర్నూలు జిల్లాలో నాలుగో రోజు ఆదివారం కొనసాగింది. విజయమ్మ డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో రోడ్ షో, బహిరంగ సమావేశాలు నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు విజయమ్మకు ఎదురొచ్చి ఘనస్వాగతం పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.

 పాల్గొన్న నేతలు..

 కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, డోన్, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మణిగాంధీ, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి, ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

పార్టీలోకి మసాల ఈరన్న

ఆలూరు మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఎమ్మిగనూరులో విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. ఈయనతో పాటు పార్టీలో చేరిన పలువురు మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లతోపాటు వెయ్యి మందికి విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Share this article :

0 comments: