‘పుర’మైనా.. ‘ప్రోలు’ అయినా.. ఇసుకేస్తే రాలునా..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పుర’మైనా.. ‘ప్రోలు’ అయినా.. ఇసుకేస్తే రాలునా..!

‘పుర’మైనా.. ‘ప్రోలు’ అయినా.. ఇసుకేస్తే రాలునా..!

Written By news on Monday, March 24, 2014 | 3/24/2014

‘పుర’మైనా.. ‘ప్రోలు’ అయినా..  ఇసుకేస్తే రాలునా..!
అనురాగం, ఆత్మీయత, ఆపేక్ష,
ఆదరణ, ప్రేమ, మమత! ఇవే కాదు.. ఒక వ్యక్తి పట్ల మరో వ్యక్తికి ఉండే మృదువైన, ఆర్ద్రమైన భావనలను వ్యక్తీకరించే పదాలెన్నో తెలుగుభాషలో ఉన్నాయి. తెలుగు నుడికి పెన్నిధి వంటి ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ పురుడు పోసుకున్న పిఠాపురం గడ్డపై.. పైన చెప్పిన పదాలే కాదు.. ‘ఆ నిఘంటువులో ఉన్న అలాంటి అన్ని పదాలూ సరిపోవు’ అనిపించేంతగా జననేత జగన్‌మోహన్‌రెడ్డిపై జనాభిమానం వర్షించింది.
 
‘నీరు పల్లమెరుగు..
నిక్కమైన నేత ప్రజల చెంతకరుగు’ అన్నట్టు.. ఆయన- వారు, వీరు అని తేడా లేకుండా; ఇది రాజవీధి, ఇది ఇరుకు సందు అని ఎంచకుండా తన రాక కోసం ఎదురు చూస్తున్న జనం సమక్షానికి స్వయంగా వెళ్లారు. వారి కష్టనష్టాలను ఆరా తీశారు. అవి తీరే రోజు త్వరలోనే రానుందన్న భరోసాను వారిలో నింపారు. ప్రతిగా.. వెలకట్టలేని వారి వాత్సల్యాన్ని గుండెల్లో నింపుకొన్నారు.
 
 సాక్షి, పిఠాపురం :
బహుశా.. ఆ ఇరుకు సందుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు- కనీసం ఆ వార్డు ప్రజాప్రతినిధులు కూడా ఏనాడూ ప్రవేశించి ఉండరు. అక్కడి వారితో మాట కలిపి..వారి కష్టసుఖాలేమిటో వాకబు చేసి ఉండరు. అలాంటిది ఒక పార్టీ రాష్ర్టఅధ్యక్షుడు ప్రతి సందులోకీ స్వయంగా వెళ్లడం, ప్రతి వారినీ పలకరిస్తూ.. వారి బతుకుల్లోని మిట్టపల్లాలను తెలుసుకోవడం అక్కడ అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. తమ గుండెల్లో కొలువైన మహానేత వైఎస్ రాజేఖరరెడ్డి తనయుడు, జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ముంగిటికి రావడంతో వారి ఆనందానికి నింగే హద్దయింది.
 
జిల్లాలో సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోహన్‌రెడ్డి ఏడవ రోజైన ఆదివారం పిఠాపురంలో రోడ్ షో నిర్వహించారు. ఆయన ఎక్కడకు వెళ్లినా నీరాజనాలు పడుతున్న రివాజే పిఠాపురంలోనూ కొనసాగింది. ఆయనకు ఆడపడుచులు అడుగడుగునా హారతులు పట్టారు. ఆయనపై అభిమానులు కురిపించిన పూలవర్షంలో.. వారి గుండె లోతుల్లోని అనురాగం గుబాళించింది.
 
ఇసుకేస్తే రాలనట్టు ప్రతి పేటా, ప్రతి కూడలీ జనంతో కిక్కిరిశాయి. మండే ఎండను సుతరాము ఖాతరు చేయక.. తనపై కురిసే మమతనే మలయమారుతంలా పరిగణిస్తూ.. జననేత.. ‘ఎలాగున్నావవ్వా.. ఎలాగున్నావ య్యా’ అంటూ ఆబాలగోపాలాన్నీ పలకరించారు. వారు చెప్పిన సమస్యలను ఆసాంతం శ్రద్ధగా ఆలకించారు. కుష్టువ్యాధిగ్రస్తులతో సహా వివిధ రుగ్మతలతో బాధపడే వారిని అణుమాత్రం సంకోచించకుండా అక్కున చేర్చుకున్న జగన్‌ను చూసి వారు ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.
 
 జగన్ ఎందరినో రెండు చేతులతో నుదుటి వద్ద పొదివి పట్టుకుని, ఆప్యాయంగా పలకరించడం, చిన్నారులతో పాటు అవ్వాతాతలను దగ్గరకు తీసుకు ని ముద్దాడడం అందరినీ ఆకట్టుకుంది. యువకులే కాదు..వృద్ధులు, మహిళలు సైతం ‘జైజగన్’ అంటూ ఎలుగెత్తి నినదించారు.

జనం మనిషి వస్తే బతుకులు బాగుపడతాయి..

ఆటోలు కూడా రాని తమ సందుగొందుల్లోకి వరుసగా వాహనాలు రావడంతో పిల్లాపాపలతో సహా ఇంటిల్లి పాదీ ఇళ్లు విడిచి బయటకు వచ్చారు. తమ సమక్షానికి వచ్చిన జననేతను చూసి.. అనుకోకుండా చనువైన చుట్టం వచ్చినట్టు.. సంబరంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక ఆయన నేరుగా తమవద్దకే వచ్చి ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం, ‘ఎలాగున్నావమ్మా, ఎలాగున్నావయ్యా’ అంటూ ఆర్తిగా పలకరించడంతో పులకించిపోయారు.
 
 వైఎస్సార్‌కు పుట్టిన కోహినూర్ వజ్రమయ్యా నువ్వు’ అంటూ ఓ మహిళ, ‘బాబు ఎండనక.. కొండనక తిరుగుతూ చిక్కిపోయాడు’ అంటూ ఒక వృద్ధురాలు, ‘అడగ్గానే ఆటోగ్రాఫ్ ఇచ్చారోచ్’ అంటూ చిన్నారులు, ‘మమ్మల్ని పలకరించారు’ అంటూ యువకులు మురిసిపోయారు. ‘దూరంగా ఉండి, చేతులూపుతూ వెళ్లిపోయే బాపతు నాయకుడు కాదు జగన్.. మా బతుకులను కాచి వడబోసి, వెతలను తీర్చేందుకు కంకణం కట్టుకున్న జననేత’ అంటూ ప్రశంసించారు. ‘ఇలాంటి జనం మనిషి రాష్ట్రాధినేత అయితే అందరి బతుకులూ బాగుపడతాయి’ అని వృద్ధులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
 
 రానున్నది మన సర్కారు.. కష్టాలన్నీ ఇక తీరు
 పిఠాపురం బొజ్జావారితోటలోని చెల్లూరు వేణుగోపాలరెడ్డి ఇంటి నుంచి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన రోడ్ షో పట్టణ పరిధిలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర సాగింది. అంత దూరానికే తొమ్మిది గంటలకు పైగా పట్టింది.
 
 వైఎస్సార్‌సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి పెండెం దొరబాబు, పిఠాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గండేపల్లి రామారావు(బాబీ) జగన్ వెంట నిలవగా రోడ్ షో శెట్టిబలిజపేట, కొత్తపేట, రామా టాకీస్, సత్య థియేటర్, ఇందిరానగర్, మిరపకాయలవీధి, మారెమ్మతల్లి గుడి, స్టూవర్టుపేట, ఉప్పాడ సెంటర్, పప్పుల వీధి, గాలి గంగాలమ్మ గుడి, రథాలపేట, కుంతీమాధవ స్వామి కోనేరు, మాధవస్వామి గుడి, గవర్నమెంట్ ఆస్పత్రి, కత్తుల గూడెం, పక్షుల మర్రి, కొండప్ప వీధి, రాజుగారికోట వెనుకవీధి మీదుగా బైపాస్ రోడ్ వరకు సాగింది.  
 
ఈ వీధులన్నీ ఇరుకైన సందుగొందులే అయినా..అంతటా వీచే ప్రాణవాయువులా జగన్ అందరి దరికీ వెళ్లారు. ‘మరో రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీ కష్టాలన్నీ తీరుస్తాను’ అంటూ వారిలో భరోసా నింపారు. జరుగుతున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పిఠాపురంలో రోడ్ షో అనంతరం గొల్లప్రోలు పాతబస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్ జనభేరి జరిగింది.
 
నియోజకవర్గం నలుమూలల నుంచీ తరలి వచ్చిన జనంతో 216 నంబరుజాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఈ పర్యటనలో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ రావూరి వెంకటేశ్వరరావు, పీబీసీ-1 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావు చిన్నారావు, మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: