9 నుంచి జగన్ ఓదార్పు యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9 నుంచి జగన్ ఓదార్పు యాత్ర

9 నుంచి జగన్ ఓదార్పు యాత్ర

Written By news on Saturday, March 1, 2014 | 3/01/2014

నల్లగొండ: వివిధ కారణాలతో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన వైఎస్‌ఆర్  కాంగ్రెస్ అధినేత, కడప ఎంపీ  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర ఖరారైంది. పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 9వతేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో ఓదార్పుయాత్ర జరగనుంది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో పదుల సంఖ్యలో ఆయన అభిమానులు చనిపోయారు. కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. వీరందరి కుటుంబాలను కలిసి, వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాలని మహానేత రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నల్లకాలువ బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి ఓదార్పు యాత్ర చేపట్టిన ఆయన నల్లగొండ జిల్లాలో మాత్రం పర్యటనను పూర్తి చేయలేకపోయారు.
 
 వివిధ కారణాలు, రాజకీయ అంశాల నేపథ్యంలో ఇన్నాళ్లూ వాయిదా పడింది. జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పలు కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు. ఇప్పటికే కుటుంబాలను గుర్తించడం, ఆర్థిక సాయం కూడా అందించేందుకు ఏర్పాట్లు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రాంతాలు, వాదాలకు అతీతంగా వైఎస్‌ఆర్ అభిమానులు ఉండడం, ఆయన సీఎంగా చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందిన వితంతులు, వికలాంగులు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు ఇలా... పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు.
 
 వైఎస్‌ఆర్ మరణ వార్త విని తట్టుకోలేక కుప్పకూలి పోయిన వారు, తమ ఆత్మబంధువును కోల్పోయామన్న బాధలో బలవన్మరణాలకు పాల్పడిన వారున్నారు. ఇలాంటి కుటుంబాలను కలిసి, వారికి భరోసా కల్పించేందుకు, ‘మీకు నేనున్నాను..’ అన్న ధీమాను ఇచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు  యాత్ర కోసం జిల్లా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. యాత్ర తేదీలు ఖరారు కావడంతో ఏర్పాట్లలో ఉన్నారు. అయితే, యాత్ర ఏ నియోజకవర్గంలో మొదలయ్యి, ఏ నియోజకవర్గంలో ముగుస్తుందో, యాత్ర మార్గం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉందని పార్టీ నాయకత్వం వివరించింది.  
Share this article :

0 comments: