వాస్తవాలను ఒప్పుకోవటం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాస్తవాలను ఒప్పుకోవటం లేదు

వాస్తవాలను ఒప్పుకోవటం లేదు

Written By news on Monday, May 11, 2015 | 5/11/2015


చంద్రబాబు వాస్తవాలను ఒప్పుకోవటం లేదువీడియోకి క్లిక్ చేయండి
అనంతపురం : రైతు ఆత్మహత్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత చేసిందేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఒక్క అనంతపురం జిల్లాలోనే 86మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 11మంది నేతలన్నలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారన్నారు. జిల్లా నుంచి 3లక్షల మంది బతుకుదెరువు కోసం కర్ణాటకకు వలస వెళ్లారని వైఎస్ జగన్ అన్నారు. అయినా చంద్రబాబు వాస్తవాలు ఒప్పుకోవటం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతు రుణాలు రూ.87వేల కోట్లు ఉన్నాయని, ఈ ఏడాది రుణమాఫీకి కేటాయించింది కేవలం రూ.4600 కోట్లు మాత్రమే అని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు రైతు రుణాలు లక్ష కోట్లు దాటుతున్నాయని, రైతు రుణాల మీద వడ్డీ రూ.14వేల కోట్లు అయ్యిందన్నారు. రైతు రుణాలు కాదు కదా...కనీసం వడ్డీ కూడా చంద్రబాబు మాఫీ చేయలేదని ఆయన అన్నారు.  డ్వాక్రా అక్క చెల్లెళ్ల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, చంద్రబాబు ఇచ్చేది డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీకి కూడా సరిపోదన్నారు.

డ్వాక్రా రుణాలపై 18 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన 93మంది ఉద్యోగాలు పోయాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను చంద్రబాబు పట్టించుకోవటం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి కోసం లక్షలమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, చంద్రబాబు దమ్మిడి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. వైఎస్ఆర్ తన హయాంలో హంద్రీ-నీవాకు రూ.5600 కోట్లు కేటాయించారని, చంద్రబాబు తన హయాంలో ఇచ్చింది కేవలం రూ.18 కోట్లు మాత్రమే అన్నారు.

తమ పోరాటం ఇంతటితో ఆగదని, చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే వరకూ సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు మోసం అర్థం అయ్యేలా చేస్తామని,  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తాను చేసే పనులు ఎవరూ చూడరని చంద్రబాబు అనుకుంటున్నారని, అయితే పైనుంచి దేవుడు చూస్తున్నాడన్నారు. చంద్రబాబు తన అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చంపించేందుకు ఉపయోగించుకుంటున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని వైఎస్ఆర్ సీపీ నేతలను చంపడానికి చేస్తున్నారన్నారు.
Share this article :

0 comments: