గుంటూరు- విజయవాడ మధ్య దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు- విజయవాడ మధ్య దీక్ష

గుంటూరు- విజయవాడ మధ్య దీక్ష

Written By news on Monday, May 11, 2015 | 5/11/2015


5, 6 తేదీల్లో జగన్ నిరశన
5, 6 తేదీల్లో జగన్ నిరశన
ఏడాది బాబు పాలన వైఫల్యంపై పోరు
⇒ గుంటూరు- విజయవాడ మధ్య దీక్ష
⇒ వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి, నాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలపు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు రాష్ట్ర విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వచ్చేనెల 5, 6 తేదీల్లో నిరశన దీక్షకు దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రైతు విభాగపు అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డిలు ఆదివారం హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వం విజయోత్సవ యాత్రలు జరపాలన్న సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది.

ఏడాది పాలనలో వైఫల్యాల జాబితా తప్పితే విజయాలేవీ కనబడడం లేదు. మేనిఫెస్టోలో చెప్పినవి అమలు జరిపిన దాఖలాలూ లేవు. వాళ్లు విజయోత్సవ యాత్రగా కాకుండా వైఫల్యాల యాత్ర అని చెప్పకుంటే  సమంజసంగా ఉండేది. పాలనలో ఎందుకు వైఫల్యం చెందారో ప్రజలకు వివరణ ఇచ్చుకుంటే ఇంకా హుందాగా ఉంటుంది. విజయోత్సవ యాత్రలని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం సరికాదు. అన్నీ వైఫల్యాలే ఉన్నప్పుడు.. విజయోత్సవ యాత్రలు జరుపుకోడానికి వారికి నైతిక అర్హత ఎక్కడుంది?. దీనిని ప్రశ్నించడానికే జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు’ అని వివరించారు. పలువురు పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే విజయవాడ- గుంటూరు ప్రాంతాల మధ్య దీక్ష చేపట్టాలని జగన్ నిర్ణయించారని, దీక్ష చేపట్టే ప్రాంతాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
 
ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటే మాఫీ ఎక్కడ జరిగినట్టు?
‘‘రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం అంటున్నారు. రుణమాఫీ అందని వారు ఫిర్యాదు చేసుకోమంటే కుప్పలు కుప్పలుగా బస్తాల్లో ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు విడతల్లో రైతులకు ఇచ్చింది రూ. 7 వేల కోట్లు కూడా లేదు. రూ.23 వేల కోట్లు రుణమాఫీ చేశామంటున్నారు. ఎందుకు మభ్య పెడుతున్నారో అర్థం కావడంలేదు. రుణమాఫీ చేస్తున్న కొద్ది మందికీ ఏటా 20 శాతం కిస్తీల రూపేణా మీరు ఐదేళ్ల పాటు ఇస్తుంటే, బ్యాంకులు మాత్రం ఏటా 14 శాతం చొప్పున చక్రవడ్డీ వసూలు చేసే పరిస్థితి ఉంది. రుణమాఫీ అంటే రుణం పూర్తిగా మాఫీ కావడమన్నది ఈ రోజున ఎక్కడ జరిగింది?. డ్వాక్రా మహిళలను మోసం చేశారు.

ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడేమో ఒక్కొక్క మహిళ పేరున బ్యాంకులో రూ. 3 వేలు వేస్తామంటున్నారు. ఉద్యోగాలిస్తామని యువతను మోసం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని.. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి అంశంలోనూ వైఫల్యం చెందిన బాబు సర్కారుకి విజయోత్సవాలు జరుపుకొనే అర్హత లేదు. కృష్ణానది పైభాగంలో రికార్డుస్థాయిలో వర్షాలు కురిసి శ్రీశైలం, సాగర్‌లు నిండినా 90 శాతం మాత్రమే వరి పంటను సాగులోకి తేగలిగారు. వేరుశనగ సాగు 35 శాతం, పప్పుధాన్యాల సాగు 33 శాతం తగ్గిపోయిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

స్వామినాథన్ కమిటీ సిపార్సులను అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు కనీస మద్దతు ధరకు కూడా రైతుల నుంచి పంట కొనే పరిస్థితి కల్పించడం లేదు. మద్దతు ధర పెంచాలని కేంద్రంపై వత్తిడి తేలేకపోయారు. కనీసం కేంద్రానికి లేఖనైనా ఎందుకు రాయలేదు?. సాగునీటి రంగంలో.. హంద్రీనీవా పూర్తి చేయడానికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉంటే రూ. 200 కోట్లు బడ్జెట్‌లో పెట్టి దానిని ఈ ఏడాది పూర్తి చేస్తామంటారు. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.1,550 కోట్లు కావాల్సి ఉంటే రూ.153 కోట్లు బడ్జెట్‌లో పెట్టి దానినీ ఈ ఏడాది పూర్తి చేస్తామంటారు. ఇవన్నీ మభ్యపెట్టే మాటలు కాదా?. వీటిని ప్రశ్నించేందుకే.. జగన్ దీక్షకు దిగుతున్నారు.’’ అని ఉమ్మారెడ్డి, నాగిరెడ్డిలు వివరించారు.
Share this article :

0 comments: