జగన్ అరెస్టు ముమ్మాటికీ అక్రమం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్టు ముమ్మాటికీ అక్రమం

జగన్ అరెస్టు ముమ్మాటికీ అక్రమం

Written By news on Sunday, June 3, 2012 | 6/03/2012



హైదరాబాద్, న్యూస్‌లైన్: నేర విచారణ చట్టం(సీఆర్‌పీసీ)లోని 41(ఎ) నోటీసుల కింద సీబీఐ ఎదుట హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం ముమ్మాటికీ అక్రమమని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచంద్ర స్పష్టంచేశారు. శనివారం ఆయన ‘సాక్షి’ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఎ) కింద నోటీసులు అందుకొని జగన్ హాజరుకాకపోయి ఉంటే.. సీబీఐ అరెస్టు చేయవచ్చని, అలాకాకుండా మూడు రోజులపాటు ఆయన రోజుకు 9 గంటలపాటు విచారణకు సహకరించినా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సీబీఐ విజ్ఞప్తి మేరకు జగన్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం తప్పు అని, చట్టానికి విరుద్ధంగా ఒక వ్యక్తి గంట జైల్లో ఉన్నా అది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందని తేల్చిచెప్పారు. కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకున్న హైకోర్టు.. చట్టపరిధిలో జగన్ వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో అంత తీవ్రంగా ఆలోచించలేదని అభిప్రాయపడ్డారు. ఒకే నేరంలో అనేక చార్జిషీట్లు దాఖలు చేసే విషయంలో పార్లమెంటు కొత్త చట్టాలు తీసుకురావాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడిందని, అయితే ప్రస్తుతం అలాంటి చట్టాలు లేవని న్యాయమూర్తి భావించినప్పుడు.. జగన్‌ను ఏ చట్టానికి లోబడి జైల్లో పెట్టారని ప్రశ్నించారు.

సీఆర్‌పీసీకి లోబడే దర్యాప్తు సాగాలి...

నేర విచారణ చట్టం(సీఆర్‌పీసీ)కి లోబడే సీబీఐ దర్యాప్తు సాగాలని, కానీ సీబీఐ తమకు ప్రత్యేకమైన విచారణ చట్టం ఉందన్నట్లుగా భావిస్తోందని హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ విమర్శించారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా చార్జిషీట్‌లు దాఖలు చేయాలి. కానీ జగన్‌మోహన్‌రెడ్డిపై దాఖలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు సీఆర్‌పీసీ నిబంధనల మేరకు కొనసాగడం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులను విడగొట్టి దశలవారీగా ఇప్పటికి మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్‌లో హాజరుకావాలని కోర్టు సమన్లు జారీచేసిన తర్వాత జగన్‌ను అరెస్టు చేయడం న్యాయవ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే. జగన్‌ను కోర్టులో హాజరుకావాలని కోర్టు సమన్లు ఇస్తే.. ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. 25, 26, 27వ తేదీల్లో దాదాపు 30 గంటలపాటు జగన్‌ను విచారించారు. ఇన్ని గంటలపాటు విచారించిన తర్వాత కూడా వెంటనే ఆయన్ను అరెస్టు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమే. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడం జగన్ భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమే అవుతుంది. జగన్‌కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సీబీఐ హరించింది. ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో న్యాయపోరాటం చేస్తాం.’’ అని తెలిపారు.
Share this article :

0 comments: