పోలవరానికి కొత్త చిక్కులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలవరానికి కొత్త చిక్కులు

పోలవరానికి కొత్త చిక్కులు

Written By news on Sunday, July 22, 2012 | 7/22/2012

న్యాయం చేయకుంటే కోర్టుకు వెళతాం
గతంలో ఓ సంస్థ కోర్టుకెళ్లడంతో టెండర్లు రద్దు
రూ.477 కోట్ల అదనపు భారంపై విమర్శలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలవరం టెండర్ల ప్రక్రియలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ టెండర్లలో అనర్హతకు గురైన రెండు సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. టెండర్ నిబంధనల ప్రకారమే తాము డాక్యుమెంట్లను పొందుపరిచామని, అయినప్పటికీ తమపై అనర్హత వేటును వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలవరం ర్యాక్‌ఫిల్ డ్యాం, స్పిల్‌వే నిర్మాణాలకు సంబంధించి ఆహ్వానించిన టెండర్లలో ఎల్-1గా సోమా సంస్థ నిలిచిన విషయం తెలిసిందే. మొత్తం ఆరు సంస్థలు ఈ టెండర్‌లో పాల్గొనగా సోమా, సూ సంస్థలే అర్హతలను సాధించినట్టు ఇంజనీర్ల రాష్ర్ట స్థాయి కమిటీ నిర్ణయించింది. అనర్హతకు గురైన సంస్థల్లో మధుకాన్, ట్రాన్స్‌ట్రాయ్‌లు కూడా ఉన్నాయి. 

దాంతో ఈ రెండు సంస్థలు తమ అనర్హతపై శనివారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. తమకు సాంకేతికంగా అన్ని అర్హతలు ఉన్నాయని ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీకి ఆ సంస్థల ప్రతినిధులు ఫిర్యాదు లేఖలను అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు ముఖ్యకార్యదర్శి సూచించారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని సదరు సంస్థలు చెబుతుండడంతో సమస్య మరింత ముదరనుంది. గతంలో కూడా ఇలాగే ఒక సంస్థ కోర్టుకు వెళ్లడంతో టెండర్లను రద్దు చేయాల్సి వచ్చింది. మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతుందా? అనే ఆందోళనను అధికారులు వెలిబుచ్చుతున్నారు.

ఆర్థిక శాఖ ఏమంటుందో?

ఈ టెండర్‌కు ఆర్థిక శాఖ అనుమతి కూడా కీలకం. గత టెండర్ రద్దు కావడానికి కోర్టు కేసులు, సంస్థల మధ్య విభేదాలతో పాటు ఆర్థిక శాఖ విముఖత కూడా ఒక కారణం. రద్దయిన టెండర్‌లో 12.61 శాతం తక్కువకే పనుల్ని చేయడానికి సూ సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పుడు ఆర్థిక శాఖ కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని ఎక్కువగా వేయడం వల్లనే 12.61 శాతం తక్కువకు పనుల్ని చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని పేర్కొంది. అంచనా వ్యయాన్ని మరో సారి సరిచూడాలని కూడా అభిప్రాయపడింది. అయితే ప్రస్తుత టెండర్‌లో పాత అంచనా వ్యయమే (రూ.4717 కోట్లు) కొనసాగుతోంది. పైగా ఈ సారి మైనస్ 2.48 శాతం బిడ్ చేసిన సంస్థ ఎల్-1గా వచ్చింది. పాత టెండర్‌తో పోలిస్తే ప్రస్తుత టెండర్ సుమారు రూ.477 కోట్లు అధికం. అంటే ఈ మేర ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. దీనికి ఆర్థిక శాఖ అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఆర్థిక శాఖ ఏమైనా కొర్రీలను వేస్తే.. హై పవర్ కమిటీ తీసుకోబోయే నిర్ణయం కీలకమవుతుంది. మరోపక్క ఈ టెండర్‌పై వివిధ రాజకీయ పక్షాలు స్పందించాయి. లోపాయికారిగా ఒప్పందం కుదరబట్టే.. గతంలో కంటే ఎక్కువ మొత్తానికి టెండర్‌ను దక్కించుకునే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రభుత్వంపై పడే రూ.477 కోట్ల అదనపు భారాన్ని ఆర్థిక శాఖ ఆమోదిస్తుందా? లేదా అనే విషయంపై ఈ టెండర్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Share this article :

0 comments: