పెద్దల సాక్షిగా ‘క్విడ్ ప్రో కో’! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెద్దల సాక్షిగా ‘క్విడ్ ప్రో కో’!

పెద్దల సాక్షిగా ‘క్విడ్ ప్రో కో’!

Written By news on Sunday, December 9, 2012 | 12/09/2012

తెరచాటు ఒప్పందాలూ, చీకటిమాటున సాగే మంతనాలూ ఎల్లకాలమూ దాగలేవు. చేతులు కలుపుతూ కూడా శబ్దం రాకూడదని కోరుకోవడం అత్యాశే అవుతుంది. మైకు పట్టుకుంటే చాలు... తమ పార్టీ విశిష్టత గురించి, అది కాంగ్రెస్‌తో చేస్తున్న ‘రాజీలేని’ పోరాటం గురించి తెగ మాట్లాడే తెలుగు దేశాధీశుడు చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడంపై రాజ్య సభలో శుక్రవారం జరిగిన ఓటింగ్ సమయంలో టీడీపీ ఎంపీలు ముగ్గురు గైర్హాజరైన ఉదంతం ఆ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన తీరును పట్టిచూపింది. 

ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేంద్రం మూడు నెలలక్రితం నిర్ణయం తీసుకున్న నాటినుంచీ దేశమంతా అట్టుడుకుతున్నది. పాతిక లక్షల కోట్ల రూపాయలకు విస్తరించిన, దాదాపు 30 కోట్ల మంది జీవితాలతో ముడిపడిన చిల్లర వర్తక రంగాన్ని ఇది సునామీలా ఊడ్చిపారేస్తుందని నిపుణులందరూ చెబుతున్నారు. ఈ నిర్ణయం ఎంతటి దుమారం లేపిందంటే... పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాపచుట్టేసే పరిస్థితి ఏర్పడింది. కోట్లాది మందిని వీధులపాలు చేస్తుందంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని లేదా ఆ నిర్ణయంపై పార్లమెంటులో ఓటింగ్‌కు వీలుకల్పించే చర్చకు అనుమతించాలని విపక్షాలన్నీ పట్టుబట్టాయి. 

అందరిలాగే చంద్రబాబు సైతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తన పాదయాత్రలో తూర్పారబడుతున్నారు. వామపక్షాలు, ఇతర పార్టీలూ నిర్వహించిన ‘భారత్ బంద్’లోనూ ఆ పార్టీ హంగామా చేసింది. తీరా ఓటింగ్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ, బీఎస్పీ పార్టీల తరహాలో అఖిల భారతావనికి ‘చేయి’చ్చి కాంగ్రెస్ పంచన చేరింది. ఎంత దగా?! ఎంత మోసం?!

ఎఫ్‌డీఐలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ జరిగిన హోరాహోరీ చర్చలు, ఓటింగ్ తీరు మహా యుద్ధాన్ని తలపించాయి. పాలకపక్షం మైనారిటీలో ఉన్న రాజ్యసభ అయితే మంత్రులకు, కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టించింది. 

ఇక్కడి నుంచి క్షేమంగా గట్టెక్కుతామా... లేక భంగపాటుకు గురై అధికార పీఠానికి దూరమవుతామా అనే సందేహాలతో వారంతా క్షణమొక యుగంగా గడిపారు. ఏమాత్రం ఏమరుపాటును ప్రదర్శించినా తాము మూడున్నరేళ్లుగా నిర్మించుకుంటూ వస్తున్న అధికార సౌధం కుప్పకూలుతుందని భయపడ్డారు. అందుకే, వారు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. లేవలేని స్థితిలో ఆస్పత్రులకే పరిమితమైన ఎంపీలను సైతం స్ట్రెచర్లలోనూ, వీల్ చైర్లలోనూ తీసుకొచ్చారు. లాబీల్లోనే వారి నుంచి ఓటు తీసుకోవడానికి సభాధ్యక్షుడి అనుమతి సంపాదించారు.

బ్రిటన్‌లో ఉన్న విజయ్ మాల్యా సైతం ఆగమేఘాలపై వాలారు. వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్న నామినేటెడ్ ఎంపీలు కంకణబద్ధులై పార్లమెంటు దారిపట్టారు. అటో, ఇటో తేలిపోయే సమయంలో ప్రతి ఓటూ కీలకమైంది గనుక అధికారపక్షం అంత ఆత్రంగా ఉంది. మరి విపక్షాల మాటేమిటి? ఒక్కొక్కరిది ఒక్కో అవస్థ. సభ సభకీ భిన్నమైన వైఖరులు! వీటన్నింటికీ మూలం సీబీఐ అనే భూతం! అందుకే, ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్నామంటూనే రెండు సభల్లోనూ తమ గైర్హాజరుతో కేంద్రాన్ని ఎస్పీ గట్టెక్కిస్తే... లోక్‌సభలో గైర్హాజరుతోనూ, రాజ్యసభకొచ్చేసరికి అనుకూల వైఖరితోనూ బీఎస్పీ ఆదుకుంది. పాలక కూటమిలో ఉంటూనే విపక్షాల బంద్‌లో పాల్గొనే ధైర్యం చేసిన డీఎంకే చివరి సీన్‌లో స్వరం మార్చింది. 

టీడీపీది మాత్రం విలక్షణమైన దోవ. లోక్‌సభలో ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ మాట్లాడి, వ్యతిరేకంగా ఓటేసిన ఆ పార్టీ రాజ్యసభలో విచిత్రంగా ప్రవర్తించింది. అయిదుగురు ఎంపీల్లో ఇద్దరు వ్యతిరేకంగా ఓటేస్తే... ముగ్గురు మాత్రం గైర్హాజరై యూపీఏ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. అందులో దేవేందర్ గౌడ్ రాజ్యసభలో పార్టీ నాయకుడైతే, సుజనా చౌదరి డిప్యూటీ నాయకుడు. మీదు మిక్కిలి చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. 

అధినేతకు చెప్పే వెళ్లామంటున్న ఆ ముగ్గురు ఎంపీలనూ దోషులుగా చేసి బాబును కాపాడటానికి తెలుగుదేశం నేతలు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. గైర్హాజరైన ముగ్గురూ బాబు కనుసన్నల్లో నడిచేవారైతే... సభలో ఉన్న ఇద్దరిలో ఒకరు అవసరమైతే బాబును బహిరంగంగా నిలదీయగలిగిన సత్తా ఉన్నవారు. మరొకరు ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానంపై మాట్లాడిన వారైనందువల్ల తప్పనిసరిగా కూర్చో వాల్సినవారు. 

గైర్హాజర్‌లోని ఆంతర్యాన్ని ఈ వాస్తవాలే పట్టిచూపుతున్నాయి. రాజ్యసభ ఓటింగ్ యూపీఏ ప్రభుత్వానికి ప్రాణ సంకటంగా మారిన నేపథ్యంలోనే ఈ అతి తెలివిని ప్రదర్శించారని కనబడుతూనే ఉంది. బాబుపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా సీబీఐలో కదలిక లేక పోవడానికీ... ఇప్పటి ప్రత్యుపకారానికీ సంబంధం లేదంటే ఎవరూ నమ్మరు. ఒకపక్క దేశ ప్రజలపై ఎఫ్‌డీఐల నిర్ణయాన్ని రుద్దుతున్న పాలకపక్షానికి చెందిన ఎంపీలు స్ట్రెచర్‌లపై వస్తే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పే పార్టీ ఎంపీలు మాత్రం తమకో, తమవారెవరికో ఆరోగ్యం బాగులేక రాలేకపోయామనడం టీడీపీ నడతనే ప్రశ్నార్ధకం చేస్తోంది. 

రాష్ట్రంలో గత మూడున్నరేళ్లుగా కాంగ్రెస్‌కు బాబు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం, అందుకు బదులుగా ప్రయోజనాలు పొందడం బహిరంగ రహస్యం. ఇప్పుడు రాజ్యసభ ఓటింగ్ సమయంలోనూ అదే కొనసాగింది. అందువల్లే టీడీపీ నేతలు ఎంత గందరగోళ పరచాలనుకున్నా కేంద్రం నుంచి ఫోన్లు వెళ్లింది బాబుకా, గైర్హాజరైన ఎంపీలకా అనే సందిగ్ధత సామాన్యులెవరికీ లేదు. పెద్దల సభ సాక్షిగా బయటపడిన కుమ్మక్కు బాగోతం ఇప్పుడు ముంజేతి కంకణం. లక్షల కిలోమీటర్లు నడిచినా దాన్ని కప్పెట్టడం ఇక అసాధ్యం.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53968&Categoryid=1&subcatid=17
Share this article :

0 comments: