చంద్రబాబు అబద్ధాలకు అడ్డుకట్ట ఉందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు అబద్ధాలకు అడ్డుకట్ట ఉందా?

చంద్రబాబు అబద్ధాలకు అడ్డుకట్ట ఉందా?

Written By news on Tuesday, September 3, 2013 | 9/03/2013

చిత్తూరు, 3 సెప్టెంబర్ 2013:
http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmila-fired-on-chandrababu-congress.html

 రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర వల్లకాడు అవుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సాగుకే కాదు, తాగడానికి కూడా సీమాంధ్రకు నీళ్లు దొరకవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం బస్సుయాత్ర రెండవ రోజున చిత్తూరు పి.సి.ఆర్. కాలేజి సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కలిసి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను, చంద్రబాబును తరతరాల ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. సీమాంధ్రులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తుంటే.. కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులు చర్చల పేరిట రోజుకు ఒకరి ఇంటిలో సమావేశమై విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. అంతమంది ఎంపీలు ఉండి ఢిల్లీ దర్బార్‌లో వంగి.. వంగి సలాములు కొడుతూ తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు అబద్ధాలకు ఒక అడ్డుకట్ట ఉందా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి, ఎక్కడా లేని విధంగా పాలకపక్షంతో కుమ్మక్కైపోయి ప్రజాస్వామ్యాన్నే ఆయన అవహేళన చేశారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తనకు ఒకసారి అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా గాడిలో పెడతానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం చంద్రబాబు పనిచేయరన్నారు.
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వకపోయి ఉంటే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ సాహసం చేసి ఉండేదే కాదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా చంద్రబాబు మేలుకుని తాను రాజీనామా చేసి, తన ఎమ్మెల్యేలు, ఎం.పి.ల చేత చేయిస్తారనుకుంటే ఏదీ చేయలేదని విమర్శించారు. తెలంగాణకు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమని ఎంతమంది ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా చంద్రబాబు వెనక్కి తీసుకోలేదన్నారు. పట్టపగలే ప్రజల గొంతు కోసి, చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో బస్సు యాత్ర చేస్తున్నారని ఆమె నిలదీశారు. మీరు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎందుకు రాజీనామాలు చేయలేదని నిలదీస్తే.. ఆయన ఉలకరు.. పలకరన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇచ్చారని సీమాంధ్రులు ప్రశ్నిస్తే.. ఏమని సమాధానం చెబుతారు చంద్రబాబుగారూ అన్నారు.

విభజనకు రాజశేఖరరెడ్డిగారు కారణం అంటున్నారు చంద్రబాబుగారు. రాజశేఖరరెడ్డిగారి వైఖరేంటో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని శ్రీమతి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిగారు బ్రతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని స్వయంగా ప్రధాన మంత్రే చెబుతుంటే.. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది చంద్రబాబుగారైతే.. విభజనకు కారణం వైయస్ఆర్‌ అంటున్నారంటే.. అసలు చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా అని ఆమె ప్రశ్నించారు.

రాజశేఖరరెడ్డిగారు బ్రతికి ఉన్నప్పుడు అన్నపూర్ణలా మారిన మన రాష్ట్రం ఆయన వెళ్ళిపోయిన నాలుగేళ్ళకే తలక్రిందులైపోయి కుక్కలు చింపిన విస్తరిలా తయారైపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగేళ్ళుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమానికి పాడె కట్టింది. అభివృద్ధిని అటకెక్కించిందన్నారు. రాజశేఖరరెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఆయన పథకాలన్నింటికీ తూట్లు పెట్టిందని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్‌, నీళ్ళు, మద్దతు ధర లేవని, వేసిన ప్రతి పంటలోనూ నష్టాలు వచ్చి అప్పులపాలైపోయామని రైతులంతా మొత్తుకుంటున్నారని ఆమె విచారం వ్యక్తంచేశారు. అన్ని చార్జీలు, ధరలు పెరిగిపోయి బ్రతుకు భారమైపోయిందని మహాళలు, పేదలు అల్లాడిపోతున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తాను చేసిన పాపాలు చాలవన్నట్టు.. ఇప్పుడు రాష్ట్ర విభజన అంటూ అన్నదమ్ముల మధ్యన అగ్గి పెట్టి చలి కాచుకుంటోందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. గొడ్డలితో నరికినట్టు మన రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నరికి ఓట్ల కోసం, సీట్ట కోసం టిఆర్ఎస్‌ను కలుపుకుని కేంద్రంలో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. తెలుగువారి ఓట్లు దండుకుని తెలుగువారి పైనే వేటు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి భిక్షతో రాష్ట్రంలో, కేంద్రంలో గద్దెనెక్కి, తెలుగువారికే కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోటు పొడిచిందని నిప్పులు చెరిగారు.

ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లు నిండితేనే గాని కర్నాటక నుంచి కృష్ణా నీటిని మన రాష్ట్రానికి వదలని పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నామని, మధ్యలో మరో రాష్ట్రం వచ్చి కృష్ణా నీళ్ళను అడ్డుకుంటే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్ళు ఇంకెలా ఎలా వస్తాయని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ఇప్పటి వరకూ అన్నదమ్ముల్లా బ్రతికిన కృష్ణా ఆయకట్టు రైతులంతా ఇక నీళ్ళ కోసం రోజూ తన్నుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. 
రాయలసీమకైతే ఒక్క పంటకైనా దిక్కుంటుందా? అని కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారామె. రాయలసీమలో రైతులు వ్యవసాయం చేసుకోవాలనా? లేక మానేసుకోవాలన్నదా కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశం అని నిలదీశారు. సీమ రైతు కుటుంబాల్లో అన్నం లేకపోతే గడపగడపకూ ఆత్మహత్యలు జరగవా? అని ఆవేదన వ్యక్తంచేశారు. సీమాంధ్ర అంతా వల్లకాడైపోదా అని కాంగ్రెస్‌ పార్టీని అడుగుతున్నాం అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నాం అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెబుతున్నారని, మధ్యలో మరో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్ళు కిందికి రానివ్వకుండా అడ్డుకుంటే దాన్ని ఏ నీళ్ళతో నింపుతారని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడ ఉందని అన్నారు. కృష్ణా, గోదావరి నీళ్ళను అడ్డుకుంటే సీమాంధ్ర అంతా ఒక మహా ఎడారి అయిపోవడం ఖాయం అని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ తన స్వార్థ రాజకీయం కోసమే కోట్లాది మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుందని నిప్పులు చెరిగారు.

గతంలో మద్రాసును తీసుకున్నారు.. ఇప్పుడు సీమాంధ్రులకు హైదరాబాద్‌ను కూడా దూరం చేస్తారట అని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. అరవై ఏళ్ళ పాటు అందరం కలిసికట్టుగా కృషి చేస్తే హైదరాబాద్‌ ఇలా అభివృద్ధి అయిందని చెప్పారు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్‌లో మీకు భాగం లేదు వెళ్ళిపొండి అంటున్నారన్నారు. చిన్నా, పెద్దా పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఉద్యోగాలూ అక్కడే ఉన్నాయన్నారు. అలాంటిది మీకు దీంట్లో భాగం లేదు వెళ్ళిపొండి అంటున్నారన్నారు. ఇది న్యాయమా? అని కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉపాధి కోసం మొట్ట మొదటిగా చూసేది హైదరాబాద్‌ వైపే అని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఇప్పుడు వారంతా ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నించారు. వారి మీదనే ఆశలు పెట్టుకుని చెమటోడ్చి చదివించిన ఆ తల్లిదండ్రులంతా ఇప్పుడు ఏమైపోవాలో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.

రాష్ట్ర విడిపోయాక ఇస్తామన్న నాలుగైదు లక్షల కోట్లతో రాజధానిని కట్టుకోవడానికే సరిపోతే సంక్షేమ పథకాలు ఎలా నడపాలన్నారు. రాష్ట్ర ‌ఆదాయంలో 50 శాతం కేవలం ఒక్క హైదరాబాద్‌ నుంచే వస్తోందని, ఒక్క సారిగా అంత ఆదాయం రాకపోతే ఉద్యోగులకు సీమాంధ్రలో జీతాలు ఎలా ఇవ్వాలి? సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలని కాంగ్రెస్‌ను శ్రీమతి షర్మిల నిలదీశారు. ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. కింది భాగానికి సాగు నీరు కాదు కదా తాగు నీటికీ దిక్కుండదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత నీచానికి పూనుకుంది ఈ కాంగ్రెస్‌ పార్టీ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఒక పక్కన కృష్ణా, గోదావరి నీళ్ళు ఇవ్వరట. మరో పక్కన రాజధాని కూడా ఇవ్వరట. సంక్షేమ పథకాలు అమలు చేసే దారిక కూడా చూపరట. కానీ విభజన మాత్రం చేస్తారట' అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజన గురించి తెలియగానే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేసి నిరసన తెలిపారని అన్నారు. సీమాంధ్రకు చెందిన ఎంత మంది కాంగ్రెస్, టిడిపి నాయకులు రాజీనామా చేశారని నిలదీశారు. గబ్బిలాల్లా పదవులు పట్టుకుని  వేలాడుతున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిలో మాత్రం ఏ చలనమూ లేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబుగారు. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణను ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్‌ చెక్కు ఇచ్చినట్టుగా అనుకూలంగా లేఖలు రాసి ఇచ్చేశారు చంద్రబాబుగారు. రాష్ట్ర ప్రజలపై చంద్రబాబుకు ఎప్పుడూ ధ్యాస లేదన్నారు. ఎఫ్‌డిఐ బిల్లు సమయంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కైపోయి, తన ఎంపిలను సభ నుంచి గౌర్హాజర్‌ చేసి ఆ బిల్లు ఆమోదం పొందేలా చేశారని గుర్తుచేశారు. తద్వారా కోట్లాది మంది రైతులు, చిన్న వ్యాపారులకు ఆయన అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే.. దాన్ని నిస్సిగ్గుగా విప్‌ జారీ చేసి మరీ కాపాడారని దుయ్యబట్టారు. న్యాయం చేయనప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు కేంద్రానికి లేదని శ్రీమతి షర్మిల అన్నారు. శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం సభకు వేలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
Share this article :

0 comments: