విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి: విజయమ్మ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి: విజయమ్మ లేఖ

విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి: విజయమ్మ లేఖ

Written By news on Saturday, September 7, 2013 | 9/07/2013

విభజన నిర్ణయాన్ని ఉపసంహరించండి: విజయమ్మ లేఖ
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోందని.. ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ మొదటి నుంచీ చెప్తున్నట్లుగా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజయమ్మ శుక్రవారం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు లేఖ రాశారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజన అన్యాయానికి వ్యతిరేకంగా గత 38 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయంటూ తీవ్ర ఆందోళన, విచారం వ్యక్తం చేశారు. ఇది మౌలిక న్యాయసూత్రాలకు విరుద్ధమని, వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎంలు విభజనకు పూర్తిగా వ్యతిరేకమన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించటమేనని తప్పుపట్టారు. ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని ఆపివేయాలని, విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రికి విజయమ్మ రాసిన లేఖ పూర్తి పాఠం... 
 
 ‘‘గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే గారికి, 
 మేం పదే పదే ఆందోళనలు వ్యక్తంచేసినప్పటికీ.. రాష్ట్రంలో 60 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గత 38 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ రూపకల్పనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మేం మీడియా ద్వారా తెలుసుకున్నామని మీకు తెలియజేయటానికి విచారిస్తున్నాం. 
 
 ఇది మౌలిక న్యాయసూత్రాలను విస్మరించటమే అవుతుంది. రాష్ట్ర విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఐ(ఎం)లు వ్యతిరేకమన్న వాస్తవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే అవుతుంది. ఈ అన్యాయాన్ని ఆపాలని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని మేం పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కేవలం ఓట్లు, సీట్ల కోసం మాత్రమే ఈ అన్యాయం చేయటానికి కేంద్రం ముందుకు వెళ్లటం దురదృష్టకరం. 
 
 కనీసం ఇప్పటికైనా.. మా రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ అన్యాయాన్ని ఆపివేయాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం. వైఎస్సార్‌సీపీగా మేం గతంలోనే చెప్పినట్లు ఈ విభజన చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ’’
 కృతజ్ఞతలతో 
 వై.ఎస్.విజయమ్మ
Share this article :

0 comments: