రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే...

రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే...

Written By news on Friday, October 4, 2013 | 10/04/2013

72 గంటల బంద్‌కు వైసీపీ పిలుపు
సాక్షి, హైదరాబాద్‌ :
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. గురువారం రాత్రి కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, డీఏ సోమయాజులుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్‌ పాటించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. విభజన వల్ల అన్యాయం జరిగే ప్రాంతాల్లో బంద్‌ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 72 గంటల పాటు సాగుతుందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. 42 లోక్‌సభ స్థానాలున్న ఒక బలమైన రాష్ట్రాన్ని బలహీనపర్చాలని చూడటం అన్యాయమని అన్నారు.
 
కాంగ్రెస్‌, టీడీపీ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అమ్మేశాయని, ఆ పార్టీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోయారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేస్తే విభజన ప్రక్రియను నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన తనతో పాటు మరో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన మిగతా 23 మంది కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని, అప్పుడైనా విభజనను అడ్డుకోవచ్చని జగన్‌ అన్నారు. ‘‘బహుశ ఈరోజు కలిగినంత బాధ... నా 16 నెలల జైలు జీవితంలో కూడా కలగలేదు. 42 లోక్‌సభ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను బలహీనపర్చడం కోసం ఓట్లు, సీట్లు లెక్కలేసుకొని విడగొట్టిన ఇంతటి అన్యాయపు పరిస్థితులు చూస్తూ ఉంటే.. వీళ్లు అసలు మనుషులేనా అని బాధ కలుగుతోంది. గతంలో రెండు రాష్ట్రాలు కలిపినప్పుడు కూడా రెండు అసెంబ్లీలలో తీర్మానాలు చేశారు.
 
అంతేకాదు.. డిసెంబర్‌ 9, 2009న సోనియాగాంధీ పుట్టిన రోజు కానుక అంటూ అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ప్రకటన చేసినƒ ప్పుడు కూడా ఆరోజు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే ప్రక్రియ మొదలవుతుందని చెప్పి.. ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టారు. బీహార్‌ నుంచి జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను విభజించినపుడు కూడా మూడు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాతే విభజనకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేయకుండా పక్కన పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ...ఈ రెండూ కూడా కలిసిపోయాయి కాబట్టే, కుట్ర చే సి ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేశారు.
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మేం శత విధాల ప్రయత్నించాం. అసెంబ్లీని సమావేశపర్చండి అన్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపించాలన్నాం. అందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశాం.. అయ్యా కేబినెట్‌ నోట్‌ రాకముందే అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రంపై ఒత్తిడి పెరగడమే కాకుండా, ఈ పరిణామాలన్నీ దేశం మొత్తం గమనించడంతో విభజన ప్రక్రియ ఆగుతుందని బతిమిలాడాం. అదేవిధంగా చంద్రబాబుకు కూడా చెప్పాం. రాష్ట్రంలో మూడు పార్టీలు విభజనకు వ్యతిరేకంగా, ఐదు పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, చంద్రబాబు గారిని మీరు కూడా మూడు పార్టీల వైపు రావాలని కోరాం. విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వాలని విన్నవించాం. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని బతిమిలాడాం. అందుకోసం లెటర్ల మీద లెటర్లు రాశాం. మీటింగ్‌లలో కూడా నిలదీశాం. అన్ని చేసినా రెండూ కలిసిపోయాయి. ఒకరేమో ఓట్లు, సీట్ల కోసం, మరొకరేమో ఓట్లు రావేమో, సీట్లు రావేమోనని కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఈ ఇద్దరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితులపై మాట్లాడాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అందుకే పార్టీ తరఫున 72 గంటల పాటు బంద్‌కు పిలుపు నిస్తున్నాం’’ అని జగన్‌ పేర్కొన్నారు.
 
రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే...
ఎంపీలందరూ రాజీనామా చేస్తే, ఇప్పటికే మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు విభజన ప్రక్రియ ఆగిపోతుందని జగన్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌, టీడీపీలకు ఆ పార్టీలకు చెందిన వారంతా రాజీనామా చేసి బుద్ధి చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ నుంచి లోక్‌సభలో ఉన్న ఇద్దరు ఎంపీలమూ రాజీనామాలు చేశామని, వాటిని ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను మళ్లీ కోరామని జగన్‌ వివరించారు.
 
మంత్రులంతా రాజీనామా చేయాలి..
 
‘‘అసెంబ్లీలో ఇప్పటికైనా తీర్మానం చేయలేకపోయినందుకు మంత్రులందరూ రాజీనామా చేయాలి. ఇక్కడ కూడా సంక్షోభం సృష్టిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుంది. ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని డిమాండ్‌ చేస్తున్నా’’ అని జగన్‌ అన్నారు. ఈ విభజన ప్రక్రియపై న్యాయస్థానాలకు కూడా వెళ్లి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభ జరుగుతుందా అని విలేకరులు ప్రశ్నించినపుడు తమ పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమవుతున్నామని, అందులో అన్నీ చర్చిస్తామని జగన్‌ సమాధానమిచ్చారు. మరిన్ని ప్రశ్నలు అడగడానికి విలేకరులు ప్రయత్నించగా.. ‘‘ప్లీజ్‌ విషయాన్ని పక్కదోవ పట్టించొద్దు.. మీ అందరి తరఫున సమైక్యానికే పోరాడుతున్నా.. మద్దతివ్వండి. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ మన తరంలోనే, మన కళ్లముందే నాశనమవుతా ఉంటే బాధగా ఉంది’’ అని జగన్‌ అన్నారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయా అని ప్రశ్నించగా.. మేం చేసే ప్రతి డిమాండ్‌, ప్రతి ప్రయత్నం అదేదిశగా ఉందని బదులిచ్చారు. సమన్వయకర్తలు దీక్షలు విరమించాలి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే నిరాహారదీక్షలు చేస్తున్న 175 అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు తక్షణమే దీక్షలు విరమించి బంద్‌లో పాల్గొనాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచించింది. కో-ఆర్డినేటర్లంతా వారి స్థానంలో పార్టీ కార్యకర్తలతో యధావిధిగా దీక్షలు కొనసాగింపజేయాలని, వారు బంద్‌ను పర్యవేక్షించాలని పార్టీ వర్గాలు కోరాయి.
Share this article :

0 comments: