ప్లీనరీలో జగన్ ప్రసంగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్లీనరీలో జగన్ ప్రసంగం

ప్లీనరీలో జగన్ ప్రసంగం

Written By news on Monday, February 3, 2014 | 2/03/2014

ప్లీనరీలో జగన్ ప్రసంగంఇడుపులపాయ ప్లీనరీలో ప్రసంగిస్తున్న జగన్వీడియోకి క్లిక్ చేయండి
వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం (02.02.2014) జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రస్థానం పేరుతో నిర్వహించిన పార్టీ రెండవ ప్లీనరీలో వైఎస్ జగన్మోహన రెడ్డి  ప్రసంగంలో కొంత భాగం  ఈ దిగువ ఇస్తున్నాం.

 మొదటి ప్లీనరీ 2011 జులై 8న  దివంగత నేత రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా జరిగింది. ఇవాళ్టికి సరిగ్గా రెండున్నర సంవత్సరాలవుతోంది. ఈ రెండున్న సంవత్సరాలలో చాలా చూశాం. చాలా చాలా కష్టాలు చూశాం. చాలా చాలా కుతంత్రాలు చూశాం. చాలా చాలా అన్యాయమైన రాజకీయాలు చూశాం. నిజాయితీ లేని రాజకీయాలు చూశాం. ఇన్ని జరుగుతూ ఉన్నా ఎక్కడా కూడా, ఎప్పుడూ కూడా, ఎవ్వరూ కూడా తొణకలేదు. బెణకలేదు. అదరలేదు.. బెదరలేదు. (ప్రజల హర్షధ్వానాలు)

 ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలాడడానికైనా సిద్ధమైన రాజకీయాలు చూశాం. ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ గడ్డయినా తినడానికి వెనుకాడని రాజకీయాలు చూశాం. ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక మనిషిని తప్పించే కార్యక్రమాన్ని చూశాం. ఓట్ల కోసం, సీట్ల కోసం దొంగ కేసులు పెట్టే కార్యక్రమాన్ని చూశాం. ఓట్ల  కోసం, సీట్ల కోసం ఒక మనిషిని జైలుకు పంపడానికి కూడా మనస్సాక్షి అడ్డురాని నీచమైన రాజకీయాలు చూశాం. ఓట్ల కోసం, సీట్ల కోసం బంగారం లాంటి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి వెనుకాడని రాజకీయాలు ఈ రోజు చూస్తున్నాం. ఈ రెండున్న సంవత్సరాల్లో చాలా చాలా చూశాం. ఇటువంటి రాష్ట్రం బంగారుతల్లిని అడ్డగోలుగా నిజాయితీలేని, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు అమ్మేస్తున్న పరిస్థితిని చూశాం. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి. రెండున్నర సంవత్సరాలలో 16 నెలలపాటు నన్ను ఏకంగా జైలులో కూడా పెట్టారు. రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉంటాయని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. అన్యాయమైన రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయీ అంటే ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించేందు కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇద్దరూ కూడా కుమ్మక్కై, కోర్టుల దాకా ఒక్కటిగా వెళ్లి కేసులు పెట్టిన రోజులు చూశాం. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నేరం రుజువు కాకముందే, విచారణ కాకముందే మూడు నెలలైతే ఆ వ్యక్తిని ఎవరైనా సరే బెయిలిచ్చి పంపాలి. అయినా కూడా దర్యాప్తు పేరుతో, విచారణసైతం జరగకుండా ఒక వ్యక్తిని 16 నెలలపాటు జైల్లో ఉంచిన నీచమైన రాజకీయాలు చూశాం.

 నన్ను 16 నెలలపాటు జైల్లో పెట్టారు, 16 నెలలపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూశారు. 16 నెలలపాటు జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తిని కనపడకుండా చేయాలని చూశారు. ఎవరినీ కలవకుండా జైల్లో ములాఖత్‌లు నిలిపేశారు. జైల్లో కూడా అన్యాయమైన పరిస్థితుల మధ్య పెట్టారు. ఇన్నిన్ని చేశారు కదా మీరు.. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డిని కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు వెంట్రుక కూడా పీకలేకపోయారు. 16 నెలలు నాకు బాగా గుర్తున్నాయి. ఆ 16 నెలలు నేను మర్చిపోలేని రోజులు. ఆ 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూసినప్పుడు నా గుండె తల్లడిల్లి పోయింది.

ఆ వేళ నాకు బాగా గుర్తింది. పార్లమెంటులో రిటైల్‌రంగలో ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) తీసుకురావడంపై ఓటింగ్ జరుగుతోంది. ఇది చిన్న చిన్న వర్తకులకు సంబంధించిన అంశం. ఆ ఓటింగ్‌ సమయంలో, ఆ వేళ కాంగ్రెస్‌ పార్టీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తిని జైల్లో పెట్టడంతోపాటు పార్టీ శ్రేణులను భయపెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు పత్రికల్లో విపరీతంగా తప్పుడు రాతలు రాయించారు. జగన్‌ను రాష్ట్రం నుంచి బయటకు పంపేస్తారని ఒకరోజు, జగన్ తీహార్ జైలుకు పోతాడని మరోరోజు, జగన్ అసలు తిరిగి రానే రాడని మరో రోజు అన్ని రకరకాల భయాల మధ్య పెట్టారు. అంతచేసినప్పటికీ ఆ ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో ఏం జరిగిందో తెలుసా? జగన్‌మోహన్‌రెడ్డి అనే మనిషి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పేదవాడి తరఫున, ప్రతి వర్తకుడి తరఫున, ప్రతి రైతన్న తరఫున నిలిచి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశాడు. కానీ చంద్రబాబు మాత్రం బయటే ఉన్నారు. బయటే ఉండి  సిగ్గులేకుండా, తన మీద ఐఎంజీ, ఎమ్మార్ కేసుల్లో విచారణ జరగకుండా చూసుకునేందుకు ఇదే కాంగ్రెస్‌తో రాజీపడి, తన ఎంపీలను రాజ్యసభలో గైర్హాజరు చేయించాడు.

నాకు బాగా గుర్తుంది. జైల్లో ఉన్నప్పుడు ఇదే కిరణ్ కుమార్‌రెడ్డి సర్కార్ ప్రజల మీద 32 వేల కోట్ల రూపాయలు కరెంటు బాదుడు బాదింది. ఆ వేళ ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును సాగనంపడం కోసం అవిశ్వాసం తీర్మానం తెచ్చాయి. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా?జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఆయన్ను జైల్లో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇంకా ఇబ్బందులు పెడతామన్నారు. జగన్‌పై రకరకాల రాతలు రాయించారు. అయినప్పటికీ జగన్ జైల్లో ఉన్నా కూడా ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించారు. అంతేకాదు,జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్న తొమ్మది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు టీడీపీ శాసనసభ్యులతో ఓట్లేయించారు.  వాళ్ల పదవులు డిస్‌క్వాలిఫై అయినా కూడా ఫర్వాలేదని ప్రజల తరఫున నిలబేడలా చేశాడు జగన్‌మోహన్‌రెడ్డి. కానీ చద్రబాబు ఏం చేశారో తెలుసా? తన మీద ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో విచారణ జరగకుండా చూసుకునేందుకు ఇదే కాంగ్రెస్‌పార్టీతో, సోనియా గాంధీతో కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం రోజున తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఒక విప్‌జారీచేసి మరీ ఈ కాంగ్రెస్ సర్కారును కాపాడారు.

 294 స్థానాలకు కాంగ్రెస్ అధికారంలో కొనసాగాలంటే 148 మంది సభ్యుల మద్దతు ఉండాలి. కానీ అవిశ్వాసం అయ్యాక చూస్తే,  ఆ వేళ కాంగ్రెస్ సర్కారుకు కేవలం 146 మంది సభ్యుల మద్దతు మాత్రమే మిగిలింది. అంటే మెజారిటీకి ఇద్దరు సభ్యులు తక్కువ. అంటే దానర్థం, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో ఎలా కుమ్మక్కయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 జైల్లో ఉన్నప్పుడు ఇటువంటి రాజకీయాలు చూశాను. జైల్లో ఉన్నప్పుడు భయాల మధ్య, అన్యాయమైన రాజకీయాల మధ్య ఎప్పుడూ కూడా నిజాయితీని, ప్రజల మన మీద పెట్టుకున్న విశ్వసనీయతను ఏ రోజూ నేను వమ్ము చేయలేదు. నేను కాదు ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్త, నేను జైల్లో ఉన్నా కూడా పార్టీ బాధ్యతలను స్వీకరించిన నా తల్లి విజయమ్మ, నా చెల్లి షర్మిల, నాకు తోడుగా నిలిచిన నా భార్య భారతి, ఇక్కడ వేదికపై నిలుచున్న ప్రతి నాయకుడు కూడా ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎవ్వరూ వణకలేదు. తొణకలేదు. బెదరలేదు. వీరందరూ కూడా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ అండగా, నాకు తోడుగా నిలబడ్డారు. వీళ్లేకాదు, లక్షలాదిగా, కోట్లాదిగా ఆ బయట ఉన్న ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వా, ప్రతి తాతల ఆప్యాయత, ఆత్మీయతలు మనలను నడిపించాయి. బయట ఉన్న ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడి ప్రేమ మనలను జీవింపజేశాయి. పై నుంచి దేవుడు ఆశీర్వదించాడు. అంతే ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి దీవెనలను మనల్ని నడిపించి, ఇవాళ సువర్ణయుగంలోకి మనల్ని తీసుకొనిపోతున్నాయి. ఇవాళ ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావాలి. నిజాయితీ అన్న పదానికి అర్థం తీసుకురావాలి. కష్టంలో అయినా నష్టంలో అయినా కూడా వైఎస్సార్‌లా ప్రజల తరఫున నిలబడే మనిషి మళ్లీ రావాలి. దివంగత నేత ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం, బతికినంతకాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని అని. ఆ వ్యవస్థ మళ్లీ తిరిగి రావాలి.

 ఇవాళ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒకసారి సువర్ణయుగం గురించి మాట్లాడేముందు ముగ్గురు పరిపాలన గురించి చెప్పాలి. మొదట చంద్రబాబు పాలన, దివంగత వైఎస్ పరిపాలన, తర్వాత కిరణ్‌ సర్కారు పరిపాలన. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. వైఎస్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు భయానక పాలన సాగుతూ ఉండేది. ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్లినప్పుడు గ్రామాల్లో అవ్వా, తాతల పరిస్థితి చూసినప్పుడు, దయనీయంగా కనపడేది. వారు నన్ను చూసి,  నాయనా నాకు కాస్త పింఛను ఇప్పించు నాయనా అని అడిగే పరిస్థితి. గ్రామాల్లో చూస్తే   ఆ పెన్షన్ కేవలం 70 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా గ్రామాల్లో 200 మంది లేదా 150 మంది వృద్ధులుంటే,  కేవలం పది పదిహేను మందికే పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. ఆ అవ్వా, తాతల దయనీయ పరిస్థితి చూసి ఆర్డీవోలకు, ఎమ్మార్వోలకు ఫోన్‌ చేసినప్పుడు, వాళ్లు చెప్పిన సమాధానాలు నేను ఇవాళ్టికీ కూడా మరచిపోలేను. వాళ్లు అనేవారు ‘గ్రామాలలో మాకిచ్చిన పది పదిహేను మంది కోటా పూర్తయిపోయింది సార్. మిగిలిన వారెవరికైనా పెన్షన్ ఇవ్వాలంటే,  ఈ పది పదిహేను మందిలో ఎవరైనా చనిపోకుండా ఇవ్వలేని పరిస్థితి సార్ అని చెబుతుంటే, గుండెలు తరుక్కుపోయేవి.

 గ్రామాల్లో చదువుకున్న ప్రతి పిల్లాడి దగ్గరకు వెళ్లి ఏం చదువుతున్నావు నాయనా? అంటే,  ఇంజనీరింగ్ చదువుతున్నాను అని చెప్పే సమాధానం వచ్చినప్పుడు, ఇంజనీరింగ్ ఫీజెంత? అంటే, ఏడాదికి 30 వేల రూపాయలు. అంటే,  ఆ సొమ్ము కట్టేందుకు వారి తల్లిదండ్రులు ఇల్లు, ఆస్తులు అమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించే పరిస్థితి లేదు. అటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు వారి దగ్గరకు పోవడంగాని, ఆ పిల్లల కాలేజీ దగ్గరకు వెళ్లి నువ్వు ఎలా చదవుతున్నావమ్మా?  నీ చదువుల కోసం అయ్యే ఖర్చు ఎలా పెట్టుకుంటున్నావమ్మా? ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నావమ్మా? అని ఒక్క రోజు కూడా చంద్రబాబు వాళ్ల దగ్గరకు వెళ్లి అడిగిన పాపానపోలేదు. ఆ భయానకమైన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ గ్రామాలకు మనం వెళ్లినప్పుడు ఆ అవ్వా తాతల దగ్గర నుంచి ఏ ఒక్కరికైనా హఠాత్తుగా గుండె పోటు వస్తే, వారిని పెద్దాసుపత్రుల్లో తీసుకెళ్లి చేర్పిస్తే,  ఆ డాక్టర్ 2 లక్షలు, మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పినప్పుడు,  ఆ సొమ్ము కోసం కుటుంబ సభ్యులు పరుగుపెట్టేవారు. 3 రూపాయల వడ్డీ అయినా సరే, 4 రూపాయల వడ్డీ అయినా సరే, 5 రూపాయల వడ్డీ అయినా సరే తీసుకొచ్చి పేదవాడిని బతికించే ప్రయత్నం చేసేవారు. అతడిని బతికించుకునే వారేమో కాని, ఆ తర్వాత వాళ్లు చేసిన అప్పులు జీవితకాలం ఊడిగం చేసినా కూడా తీరని పరిస్థితి. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజుల్లో ఇంకా దారుణమైన విషయమేంటేంట, ఎవరైనా పేదోడు ఆసుపత్రికి పోతే, వైద్యం సంగతి దేవుడెరుగు. ఇంజక్షన్‌వేసిన దానికి యూజర్‌ చార్జీలు కూడా వసూలు చేసిన దిక్కుమాలిన రోజులవి అని చెప్పడానికి సిగ్గుపడే రోజులవి.

 ఆ రోజుల్లో రైతన్న పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా ఉండేది. వరుసగా కరువులొచ్చి నష్టపోతున్న ఆ రైతన్నలను ఆదుకోండి అని చెప్పి రాజశేఖరరెడ్డి ధర్నాలు, దీక్షలు చేశారు. ఆ రైతన్నలను ఆదుకోండి,  రైతన్నలకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఆదుకోండి అని అడగితే, నిర్వేదంగా చంద్రబాబు తీగలు చూపించి, కరెంటు ఉచితంగా ఇస్తే, ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాకుండా పోతాయన్నారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఆదుకోండి.. ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి అని ప్రాథేయపడితే.. చంద్రబాబు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అవహేళన చేశారు.

 చంద్రబాబు తర్వాత మహానేత వైఎస్సార్ పాలన వచ్చింది. మండుతున్న ఎండల్లో 1500 కిలోమీటర్లు కాలినడకన నడిచారు. తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముందుకుసాగారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీ అన్నది ఎక్కడ ఉందో కూడా తెలీదు. ఆ పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు. ప్రతి పేదవాడి మనసు తెలుసుకున్నాడు. పాదయాత్ర తర్వాత ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత రాష్ట్ర చరిత్రను మార్చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ చేయని విధంగా ప్రతి అవ్వా, ప్రతి తాతకు తాను తోడుగా నిలిచాడు. పేదరికంలో ఉన్న ప్రతి పేదవాడికీ అండగా నిలిచాడు. అనారోగ్యంలో ఉన్న ప్రతి పేదవాడికీ నేనున్నానని ముందుకొచ్చాడు. చదువుకున్న ప్రతి పిల్లాడికి అండగా ఉంటానని ముందుకొచ్చాడు. రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. దేశంలో ఎవరూ చేయని విధంగా చేశారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికీ మంచి చేయడానికి నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డేనని గర్వంగా చెప్పొచ్చు. ఆ దివంగత నేత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, రాముని రాజ్యమైతే నేను చూడలేదు కానీ. రాజశేఖరుని సువర్ణయుగం మనమంతా చూశామని గర్వంగా చెప్పొచ్చు.

 ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత రోశయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్‌రెడ్డి అనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చాక  పాలన ఎలా ఉందీ అని చూస్తే, ప్రతి పేదవాడినీ ఆదుకోవడాని వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి 133 రోగాలను తొలగించి దాన్ని నిర్వీర్యం చేశారు. ఒక్కసారి ఫీజు రీయింబర్స్‌మెంటు గురించి చూస్తే, చదువుకుంటున్న ప్రతి పేదపిల్లాడిని ఆదుకోవడానికి కనీసం 6 వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పెట్టాల్సి ఉంటే.. కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే పెట్టి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి గమనించాం. పిల్లలు రెండో సెమిస్టర్‌లోకి అడుగుపెట్టారు..  మరో రెండు నెలల్లో రెండో సెమిస్టర్ కూడా పూర్తయిపోయే పరిస్థితి ఉన్నా.. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు రూపాయి కూడా రీయింబర్స్‌మెంటు ఇచ్చిన పాపాన పోలేదు. ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు.. ఏకంగా రూ.32 వేల కోట్ల మేర ప్రజలపై కరెంటు బాదుడు బాదుతోంది. నెలతిరిగే సరికి వచ్చే కరెంటు బిల్లు చూస్తేనే షాక్‌కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. బిల్లు చాలదన్నట్లు సర్‌చార్జీలు వేస్తున్నారు. ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌గురించి చెప్పాల్సి వస్తే.. ఒక్కటంటే ఒక్క ఇల్లు లేదు.. ఒక్కటంటే ఒక్క పెన్షన్ లేదు.. కొత్త రేషన్ కార్డు లేదు. ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే.. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న సోనియా గాంధీకి ఆ ప్రక్రియలో  సహకరించేందుకు మాత్రమే కిరణ్ ఎజెండాగా పెట్టుకున్నారు.

 దివంగత నేత రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో పనిచేస్తున్న నాయకుడెవరూ కనిపించడం లేదు. రాజకీయమంటే.. ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలని, ప్రతి పేదవాడి మనసు తెలుసుకోవాలని.. చనిపోయిన తరవాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండడమే రాజకీయమన్న ఆలోచన రాజకీయంలో కరువైన పరిస్థితి. నేను ఓదార్పు చేస్తూ ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినడానికి ప్రయత్నం చేశాను. నేను వెళ్లిన పూరిగుడిసెలకు ఏ రాజకీయ నాయకుడూ ఇంతవరకు వెళ్లిన పరిస్థితి లేదు. ఆ గుడిసెలకు వెళ్లి దాదాపు 700 పైచిలుకు కుటుంబాలను కలిశాను. వారు చెబుతున్న కష్టాలు విన్నప్పుడు.. పేదరికం అంటే ఏమిటో ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అర్థం కావడం లేదని గమనించాను. ఆ కుటుంబ సభ్యులతో కలిసి కట్టుగా మాట్లాడుతున్నప్పుడు.. వారు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతల మధ్య వారు చెప్పిన మాటలు నేను ఎన్నటికీ మర్చిపోలేనేమో.
Share this article :

0 comments: