
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిరసన ప్రదర్శన
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాలపై దాడిచేయటంతోపాటు ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన వారిని అరెస్టు చేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. సత్తెనపల్లిలోని అంబటి కార్యాలయం నుంచి నల్లజెండాలు, నల్లరిబ్బన్‌లతో ప్రదర్శన జరిపారు. అనంతరం గుంటూరు - మాచర్ల ప్రధాన రహదారిపై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు పథకం ప్రకారం...ఎంపీటీసీలు, వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేసేందుకు దొంగల్లా వచ్చారన్నారు. దాడికి కారకులు, భాగస్వాములపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శాసనసభ హక్కులు కాపాడాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు... దౌర్జన్యాలు, దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 13న తమపై జరిగిన దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు మాట్లాడారు.
0 comments:
Post a Comment