నాలుగోరోజుకు చేరిన విజయమ్మ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగోరోజుకు చేరిన విజయమ్మ దీక్ష

నాలుగోరోజుకు చేరిన విజయమ్మ దీక్ష

Written By news on Thursday, August 22, 2013 | 8/22/2013

‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌వి దొంగ నాటకాలని ఆ రెండు పార్టీలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎవరివి దొంగ నాటకాలో ప్రజలు గమనిస్తున్నారు. నిరంకుశ విభజన నిర్ణయం ప్రకటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కానీ.. కాంగ్రెస్ పార్టీని కానీ ఒక్క మాటైనా విమర్శించారా? పరస్పరం కుమ్మక్కై మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నదెవరో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీల పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ జగమెరిగిన సత్యమే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, 10-జన్‌పథ్‌కు హాట్‌లైన్ ఉందని చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎవరికి హాట్‌లైన్ ఉందో.. చిదంబరం పార్లమెంటు సాక్షిగా చెప్పారు కదా! ‘మీ నాయకుడు మాతో మాట్లాడుతున్నారు’ అని ఆయన టీడీపీ ఎంపీలతో స్పష్టంగా చెప్పారు. అంటే హాట్‌లైన్ ఉన్నది మీకేనని స్పష్టమవుతోంది’’ అని చంద్రబాబు తీరును ఆమె ఎండగట్టారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. తన సొంత పార్టీ అధినాయకత్వం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన పది రోజులకు బయటకు వచ్చి.. ఆయన్ను మనం అడగాల్సిన ప్రశ్నలను మనల్నే ఆయన అడుగుతున్నారు. అసలు ఆయనే ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావటం లేదు’’ అని విజయమ్మ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేలా రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించాలని విజయమ్మ పిలుపునిచ్చారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని, బాధ్యతని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోరాదని.. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బుధవారం మూడు రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమర దీక్ష వేదికపై నుంచి ఆమె పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్తూ.. తన దీక్షను ఆశీర్వదిస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యాంశాలు విజయమ్మ మాటల్లోనే... కాంగ్రెస్‌ను బాబు ఎన్నిసార్లు కాపాడారో... ‘‘చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమయితే.. కాంగ్రెస్‌ది రెండు కాళ్ల సిద్ధాంతం. ఆ రెండు పార్టీల పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ జగమెరిగిన సత్యం. చంద్రబాబు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని కాపాడారో అందరికీ తెలిసిందే. ఎఫ్‌డీఐ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడేందుకు పార్లమెంటులో టీడీపీ ఎంపీలను చంద్రబాబు గైర్హాజరు చేయించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండోసారి అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సందర్భంగా.. తన పార్టీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండాలని విప్ జారీ చేసి మరీ కాపాడారు. కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకే వస్తున్నానంటూ పాదయాత్ర చేసిన చంద్రబాబు.. అసెంబ్లీలో మాత్రం అవిశ్వాసం వీగిపోయేలా చేసి ప్రభుత్వాన్ని కాపాడారు. ఆ రోజు ఆయన అవిశ్వాసానికి మద్దతిచ్చి ఉంటే ఈ ప్రభుత్వం ఉండేది కాదు. ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనంతో తన ఉనికి కోల్పోతున్న చంద్రబాబు వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, జగన్‌బాబును తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. తనపై అవినీతి కేసులు విచారణకు రాకుండా స్టేలు తెచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడేదో ఆత్మగౌరవ యాత్ర చేస్తానంటున్న చంద్రబాబు వంచనను ఎవ్వరూ మర్చిపోలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు చేయాలని చంద్రబాబు రాసివ్వకుండా ఉండే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. నిర్ణయం వచ్చినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి, వారితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిరంకుశ నిర్ణయం తీసుకోబుతున్నారని తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనగా ముందుగానే రాజీనామాలు చేశారు. కానీ.. రాజీనామాలు చేయకుండా విభజన నిర్ణయానికి వంతపాడుతున్న వారు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌వి దొంగనాటకాలు అంటూ దుష్ర్పచారానికి దిగారు. అందరూ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలి... నిరంకుశ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు అన్ని పార్టీల వారూ అందరికీ న్యాయం జరగాలనే మాట మాట్లాడుతున్నారు. వట్టి మాటలు చెప్పటం కాదు.. చిత్తశుద్ధి ఉంటే అందరూ రాజీనామాలు చేసి ప్రజల ముందుకు రావాలని నేను కోరుతున్నా. ప్రజా విశ్వాసం పోగొట్టుకున్న పార్టీ కానీ, ప్రభుత్వం కానీ మనుగడ సాగించలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినపుడు కాంగ్రెస్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దిగివస్తుంది. ఇంతకుముందు రాజీనామాలు చేసినప్పుడు నిర్ణయం వెనక్కు తీసుకున్నారు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నారని నేను అన్ని పార్టీల వారిని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్ష టీడీపీకి కానీ ప్రజల బాగోగులు అవసరం లేదు. కోట్లాది మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా, ఉద్యోగులు సమ్మె చేస్తున్నా వారిలో చలనం లేదు. కానీ.. మనం ఉద్యమం చేసే కొద్దీ మన బలం పెరుగుతుంది. తప్పనిసరిగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుంది. నేను చేస్తున్న ఈ దీక్షను ఆశీర్వదిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రమంతటా ఈ దీక్షల్ని విజయవంతం చేయాలని కోరుతున్నా. సర్పంచుల చెక్‌పవర్ రద్దుపై పోరాటం చేయాలి రాష్ట్రంలోని 21 వేలకు పైగా పంచాయితీల సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ రద్దు చేయటం అన్యాయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 ప్రకారం పంచాయతీలకు నిధులు, విధులు కేటాయించాలని.. అప్పుడే అవి బలపడతాయని రాజీవ్‌గాంధీ చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం జీవో నం. 385 జారీ చేసి సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేసింది. దీనిపై అన్ని పార్టీలు పోరాటాలు చేయాల్సిన అవసరముంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఎటువంటి పెద్ద జబ్బు వచ్చినా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేలా దివంగత వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. ఈ రోజు ఆరోగ్యశ్రీని చూస్తే బాధాకరంగా ఉంది. ఆరోగ్యశ్రీ నుంచి 139 రోగాలు తొలగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలని దాదాపుగా 90 ప్రైవేటు ఆస్పత్రులనూ తొలగించారు. ఈ పథకం కింద వైద్యం కూడా అరకొరగానే అందుతోంది. ఈ రోజు పేపర్లో చదివా... ఎవరికైనా గుండె ఆపరేషన్‌లో స్టెంట్ వేయించుకోవాలంటే గతంలో ప్రభుత్వం రూ. 60 వేలు ఇచ్చేది. కానీ ఈ రోజు రూ. 37 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇవి సరిపోవని, తాము ఆపరేషన్లు చేయలేమని డాక్టర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితి బాధాకరం.’’ తగ్గిన సుగర్ లెవెల్స్ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విజయమ్మ రక్తంలో సుగర్ శాతం తగ్గిందని జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఒ.సునీత తెలిపారు. విజయమ్మకు వైద్యులు బుధవారం పలు పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు అదుపులో ఉందని చెప్పారు. అయితే సుగర్ లెవల్స్ తగ్గటంతో ఫ్లూయిడ్స్ (సెలైన్) ఎక్కించాలని సూచించారు. ఇదిలావుంటే.. సమర దీక్ష చేస్తున్న విజయమ్మను వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ, వై.ఎస్.జార్జిరెడ్డి భార్య భారతమ్మ బుధవారం దీక్షా శిబిరానికి వచ్చి కలిశారు. అండగా మేముంటాం... ‘‘ఎంతోమందికి మేలు చేసిన తల్లివి.. పుట్టెడు కష్టాల్లోనూ ప్రజలకోసం దీక్ష చేస్తున్నావమ్మా.. నువ్ దేవుడి దయ వల్ల చల్లగుండాలి...’’ అని వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో విజయమ్మను ఆశీర్వదిస్తున్నారు. అందరి మంచి కోసం పోరాడుతున్న ఆమెకు బాసటగా ఉంటామంటూ బుధవారం కూడా వివిధ జిల్లాల నుంచి మహిళలు, వృద్ధులు తండోపతండాలుగా లారీలు, బస్సులు, జీపుల్లో స్వచ్ఛందంగా తరలివచ్చారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వివిధ రైతు సంఘాలు గుంటూరుకు తరలివచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపాయి. విజయమ్మతో కరచాలనం చేసేందుకు సమైక్యవాదులంతా వరుసకడుతున్నారు. మూడు రోజుల నిరాహార దీక్షతో కొంత నిరసించినప్పటికీ.. విజయమ్మ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికీ చేతులెత్తి అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు.
Share this article :

0 comments: