రాహుల్ కోసమే విభజన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాహుల్ కోసమే విభజన

రాహుల్ కోసమే విభజన

Written By news on Tuesday, August 20, 2013 | 8/20/2013

కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాహుల్‌గాంధీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన వైఎస్‌ఆర్‌సీపీ కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బీ అంజద్‌బాష, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తనయుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మేసా ప్రసాద్, అంబకపల్లె రాఘవరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డితో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ 19 రోజులుగా రాష్ట్రం ఉద్యమాలతో అట్టుడుకుతుంటే కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. విభజన అంటూ జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.
 
  కృష్ణా జలాలపై ఆధారపడిన రాయలసీమ రైతాంగం దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సివస్తుందన్నారు. రాయలసీమలోని గాలేరు- నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, వామికొండ, సర్వరాయ సాగర్, చిత్రావతి ప్రాజెక్టులకు కృష్ణ మిగులు జలాలే శరణ్యమన్నారు. జూరాల పైన ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టీఎంసీల కృష్ణ మిగులు జలాలు తీసుకుపోవాలని ఇటీవల జీఓ కూడా విడుదల చేశారని,  ఇదే జరిగితే రాయలసీమలోని ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆదాయం 70వేల కోట్లు అయితే అందులో 36వేల కోట్లు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోందన్నారు. అలాంటి మహానగరాన్ని ఒకే ప్రాంతానికి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదన్నారు. వైఎస్  మరణానంతరం రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. వైఎస్ అభివృద్ధి మంత్రం ముందు వేర్పాటువాదం ముందుకు వచ్చేది కాదన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యమాన్ని రెట్టింపు స్థాయిలో ముందుకు తీసుకుపోతామని తెలిపారు.
 
 చిత్తశుద్ధితో రాజీనామాలు చేయాలి:  అంజద్‌బాష :
 సీమాంధ్రలోని కేంద్ర మంత్రులు, ఎంపీలు, చిత్తశుద్ధితో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ కడప సమన్వయకర్త ఎస్‌బీ అంజద్‌బాష తెలిపారు. కాంగ్రెస్‌లో వెన్నెముక లేని నాయకులు అధిష్టానం నిర్ణయమంటూ సమైక్య ఉద్యమంలో పాల్గొనకుండా డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ప్రజలు వారికి రాజకీయ జీవితమనేదే లేకుండా చేస్తారని హెచ్చరించారు. 2008లో తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
 
 రాష్ట్ర విభజన వల్ల ముస్లిం మైనార్టీలకు కూడా భద్రత కరవవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకు ముందు రెండవ గాంధీ బొమ్మ నుంచి ర్యాలీగా వచ్చి మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ తిరుపాల్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వైఎస్ కొండారెడ్డి, డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, నాయకులు పాకా సురేష్‌కుమార్, బి.నిత్యానందరెడ్డి, నారు మాధవరెడ్డి, పులి సునీల్‌కుమార్, సమర్‌నాధరెడ్డి, ఎస్‌ఎ షంషీర్, బి.అమర్‌నాధరెడ్డి, కరీముల్లా, షఫి, చంద్ర, శంకర్‌రెడ్డి, ధనపాల జగన్ ఉన్నారు.
 
Share this article :

0 comments: