
* గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్...
* ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం
* 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి విపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు
* గవర్నర్ ప్రసంగం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఫస్ట్ టైమ్ అన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడటం లేదు. బడ్జెట్ మీద జరిగే చర్చలో మాట్లాడతా. ప్రభుత్వాన్ని కడిగేస్తా. కాస్త ఒపికపట్టండి..’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పక్షానికి సూచించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద విపక్ష నేత జగన్ మాట్లాడకపోవడాన్ని బుధవారం టీడీపీ సభ్యులు తప్పుబట్టారు. ‘ధన్యవాద తీర్మానం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఇదే తొలిసారి. నాయకత్వ దివాలాకోరుతనం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. సీఎం విమర్శకు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలని జగన్ స్పీకర్‌ను కోరారు. చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడమని స్పీకర్ సూచించారు. తమ నేతకు అవకాశం ఇవ్వాలని విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన తర్వాత.. జగన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక్కరోజూ హాజరు కాలేదు... ఆ విషయం గుర్తులేదా? అని జగన్ ప్రశ్నించారు.
ఏపీ తొలి బడ్జెట్ సమావేశంలో తాను మాట్లాడితే.. తాను మిగతా సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. బడ్జెట్ మీద తాను పూర్తిస్థాయిలో మాట్లాడతానని, ప్రభుత్వాన్ని అప్పుడు ఉతికేస్తానని చెప్పారు. ‘మిమ్మల్ని ఎలా కడిగేస్తానో ఆరోజు చూపిస్తా..’ అని అన్నారు. నిబంధనలు తెలియని విపక్ష నేత సభలో ఉన్నారంటూ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు జగన్ ఘాటుగా స్పందించారు. ‘నిబంధనలు, సభా సంప్రదాయాలు తెలియకపోతే తెలుసుకోవాలి. చదువు మీరు (అధికారపక్ష సభ్యులు) నేర్చుకోవాలి. నేర్చుకోని వచ్చిన తర్వాత మాట్లాడండి. ప్రతిపక్ష నేత ఎన్నిసార్లు మాట్లాడతారు. ధన్యవాద తీర్మానం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే మాట్లాడతారు. నిబంధనలు తెలుసుకోవాల్సింది నేను కాదు.. చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment