ప్రత్యేక హోదా అడిగితే జైలుకు పంపుతారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా అడిగితే జైలుకు పంపుతారా

ప్రత్యేక హోదా అడిగితే జైలుకు పంపుతారా

Written By news on Saturday, March 14, 2015 | 3/14/2015


ప్రత్యేక హోదా అడిగితే జైలుకు పంపుతారా
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆందోళన చేపట్టిన సీపీఐ నేత రామకృష్ణను అరెస్టు చేయడాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అందుకు నిరసనగా శాసనసభ నుంచి శుక్రవారం ఆ పార్టీ వాకౌట్ చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీరో అవర్‌లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అన్ని పక్షాలతోపాటు ప్రభుత్వమే కోరుతోందని, ఇదే అంశంపై సీపీఐ ప్రత్యక్ష ఆందోళన చేపడితే అరెస్టు చేసి, జైలుకు పంపడం దారుణమన్నారు. సీపీఐ నేత రామకృష్ణను ఈ నెల 11వ తేదీన అనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారని, ఆయనపై పలు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, న్యాయస్థానం ఆయనకు 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిందని జగన్‌మోహన్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఈ తరహా దౌర్జన్యమేమిటని ప్రశ్నించారు.
ఈ ఘటనపై హోం మంత్రి తక్షణమే సభలో ప్రకటన చేయాలని పట్టుబట్టారు. రామకృష్ణతో పాటు సీపీఐ నేతల అరెస్టులన్నీ దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన గుర్తుచేశారు. దీనిని అణిచివేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. సీపీఐ నేతల ఆందోళనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతోందని, వారికి మద్దతుగా నిలుస్తామని విపక్ష నేత ప్రకటించారు. జీరో అవర్‌లో వాకౌట్ చేసే సంప్రదాయం ఉందో, లేదో తెలియదుగానీ, సమస్య తీవ్రతను తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కమ్యూనిస్టు నేతల అరెస్టులను నిరసిస్తూ జీరో అవర్ ముగిసే వరకూ పార్టీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

జగన్‌కు సీపీఐ నేతల కృతజ్ఞతలు


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ఆందోళన చేస్తూ అరెస్టయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విడుదలకు డిమాండ్ చేసినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. జైల్లో ఉన్న రామకృష్ణను విడుదల చేయాలని జగన్ శుక్రవారం రాష్ట్ర శాసన సభలో డిమాండ్ చేయడంపట్ల ధన్యవాదాలు తెలిపారు.
Share this article :

0 comments: