భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ

భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ

Written By news on Wednesday, March 11, 2015 | 3/11/2015


భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ
* లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎంపీలు
* బహుళ పంటల సేకరణ తగదంటూ సవరణ ప్రతిపాదన
* వీగిపోయిన వైఎస్సార్‌సీపీ సవరణ; అయినా 101 సభ్యుల మద్దతు
* విపక్షాల సవరణ ప్రతిపాదనలకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ
* సాగు భూముల సేకరణ తగదన్న మిథున్‌రెడ్డి

 
 సాక్షి, న్యూఢిల్లీ: రైతుల పొట్టగొట్టే భూసేకరణ బిల్లును లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మంగళవారం సాయంత్రం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. బహుళ పంటలు పండే భూముల సేకరణకు తాము వ్యతిరేకమని, అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం తప్పనిసరిగా ఉండాలన్న తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ.. బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ సవరణలకు అధికార పక్షం మద్దతివ్వకపోవడంతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతోపాటు, విపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలకు మద్దతిచ్చింది. బహుళ పంటల అంశం, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనానికి సంబంధించి వచ్చిన సవరణలన్నింటికీ మద్దతుగా ఓటేసింది.
 
  ప్రైవేటు ఎంటిటీ అన్న పదాన్ని తొలగించాలంటూ ఒక సవరణను, బహుళ పంటల భూముల సేకరణ తగదని, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం ఉండాలని మరొక సవరణ ను ప్రతిపాదించాలని వైఎస్సార్సీపీ తొలుత భావించింది. కానీ, ప్రైవేటు ఎంటిటీ అంశానికి సంబంధించిన సవరణను వేరే పార్టీలు ప్రతిపాదించడంతో.. మిగిలిన సవరణను వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించింది. బహుళ పంటల సేకరణ తగదని, సామాజిక ప్రభావం అంచనా అధ్యయనం ఉండాలని.. ఈ మేరకు బిల్లును సవరించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించగా.. ఈ సవరణ వీగిపోయింది.
 
 ఈ సమయంలో సభలో 430 మంది సభ్యులు ఉండగా.. సవరణకు మద్దతుగా 101 ఓట్లు లభించాయి. వ్యతిరేకంగా 311 ఓట్లు పడ్డాయి. మరో 18 మంది ఓటు వినియోగించుకోలేదు. పార్టీ ప్రతిపాదించే సవరణలకు సంబంధించి అనుకూలంగా ఓటేయ్యాలని పార్టీ విప్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విప్ జారీచేశారు. దీంతో పార్టీ సభ్యులంతా ఓటింగ్‌లో పాల్గొని అనుకూలంగా ఓటేశారు. అయితే అనారోగ్య కారణాలతో పార్టీ ఎంపీ వై.ఎస్.అవినాశ్‌రెడ్డి సభకు హాజరు కాలేదు. అలాగే పార్టీకి దూరంగా ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా సభకు హాజరుకాలేదు. పార్టీకి దూరంగా ఉన్న కొత్తపల్లి గీత వైఎస్సార్‌సీపీ జారీచేసిన విప్ ప్రకారం ఆ పార్టీ ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా ఓటేశారు. ఇక టీడీపీ మొదటి నుంచి బిల్లుకు మద్దతు పలుకగా.. టీఆర్‌ఎస్ తాము బిల్లు మొత్తానికి కాకుండా అంశాలవారీగా మద్దతిచ్చామని పేర్కొంది.
 
 ముందేచెప్పాం: మేకపాటి
 బిల్లును వ్యతిరేకిస్తామని ముందే చెప్పామని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లుపై ఓటింగ్ జరిగిన అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో సహచర ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘మొదటి నుంచి చెపుతున్నట్టుగానే ఈ భూసేకరణ బిల్లులో.. నీటి పారుదల వసతులు బాగా ఉండి, బహుళ పంటలు పండే భూములను సేకరించకూడదు అనేది మా వాదన. ఆ విషయాన్నేబిల్లుపై చర్చలో మా పార్టీ తరఫున వైవీ. సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి  చెప్పారు. తర్వాత మా పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డిగారు సవరణలు ప్రతిపాదించారు. దీనిపై డివిజన్ కూడా అడిగాం.  మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వానికి మిగిలిన విషయాల్లో సహకరించాం. ఈ ప్రత్యేక విషయంలో మొదటి నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, మేం వివిధ సందర్భాల్లో  చెప్పినట్టుగానే చర్చలో పాల్గొన్నాం, సవరణలు పెట్టాం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాం’ అని మేకపాటి వివరించారు.
 
 ఓవైపు ఖర్చు.. మరోవైపు సేకరణా?: చర్చలో మిథున్‌రెడ్డి
 వ్యవసాయ భూములకు సాగునీరు కల్పించేం దుకు కోట్లు వెచ్చిస్తూనే మరోవైపు వాటినే సేకరించడం ఎంతవరకు సమర్థనీయమని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో ఓటింగ్‌కు ముందు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘వైఎస్సార్‌సీపీ వైఖరిని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. భూసేకరణ చట్టం ఆధారంగా బహుళ పంటలు సాగయ్యే భూములను తీసుకునే విధానానికి మేం వ్యతిరేకం. అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం నిబంధన యథాతథంగా ఉండాలని కోరుతున్నాం.
 
 ఈ బిల్లు కారణంగా ఆహార భద్రత ప్రమాదంలో పడటంతో పాటు.. భూములు కోల్పోయే రైతులు, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోతారు. ఏటా కేంద్ర సాధారణ బడ్జెట్‌లో, ఇటు రాష్ట్రాల బడ్జెట్‌లో సాగునీటి వసతి కోసం వేల కోట్లు కేటాయిస్తూనే ఉన్నాం. పంట భూములను సేకరించడం వల్ల మనం పెడుతున్న ఖర్చంతా వృథా కదా. అలాగే సామాజిక ప్రభావ అంచనా అధ్యయనం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ అధ్యయనమే ఈ చట్టానికి వెన్నెముక. అలాగే మేం మరో ముఖ్యవిషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా భూసేకరణ విధానం ఒకేలా ఉంటే మంచిది. మేం చెప్పే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోని పక్షంలో ఈ బిల్లును తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం’ అని పేర్కొన్నారు.
 
 వ్యతిరేకించిన ఎంఐఎం
 భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఎలాంటి కారణం లేకుండా ఈ బిల్లును తెచ్చి కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా రైతుల భూములు, మత్స్యకారుల భూములు తీసుకుని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టిన దాఖలాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం 88,419 ఎకరాలను సేకరించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని విమర్శించారు.
 
 మద్దతు పలికిన టీడీపీ..
 ఈ బిల్లుకు కేంద్రంలో భాగస్వామి అయిన టీడీపీ మద్దతు పలికింది. చర్చలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం మాట్లాడారు. ‘ఈ బిల్లుకు మేం సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. అయితే దేశంలో చిన్నచిన్న కమతాలు కలిగిన రైతులు వారి భూములతో అనుబంధాన్ని  పెంచుకున్నారు. చాలావరకు వారి పూర్వీకుల నుంచి వచ్చినవే ఆ భూములు. అందువల్ల వీరి సెంటిమెంటును, జీవనోపాధిని గుర్తించాలి. వారి ప్రయోజనాలను కాపాడాలి. అదేసమయంలో ఆర్థికాభివృద్ధిపై కూడా దృష్టిపెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నాడు’ అన్నారు.
Share this article :

0 comments: