ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష 6లేదా 7 నుంచి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష 6లేదా 7 నుంచి

ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష 6లేదా 7 నుంచి

Written By news on Saturday, September 26, 2015 | 9/26/2015


ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష 6లేదా 7 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ‘ప్రత్యేక హోదా’ సాధన కోసం అక్టోబర్ 6 లేదా 7వ తేదీన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్షకు కూర్చునే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభించ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్న పార్టీ నాయకత్వం తదుపరి ఎప్పటి నుంచి చేపట్టాలన్న అంశంపై సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఈమేరకు ఒకటి, రెండు రోజుల్లో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో గుంటూరు ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్‌లో తలపెట్టిన దీక్షకు అనుమతి నిరాకరించడంతోపాటు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. దీంతో ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టు తలుపు తట్టారు. నిరవధిక దీక్షకు పోలీసులు అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

దీక్షకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి గురువారమే పిటిషన్ దాఖలు చేసి హౌస్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారించాలని కోరారు. హౌస్‌మోషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే దృష్టికి తీసుకెళ్లింది. గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో... శుక్రవారం మరోసారి ఆ పిటిషన్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లింది.

హైకోర్టుకు వరుస సెలవు దినాలు కావడం, సంబంధిత సబ్జెక్ట్(హోం) చూసే న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో సాధారణ పనిదినాల్లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. హైకోర్టు సూచన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై పార్టీ సీనియర్లు శుక్రవారం సాయంత్రం సమావేశమై చర్చించారు. అక్టోబర్ తొలివారంలో తిరిగి దీక్షను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు, ప్రధానంగా 6, 7 తేదీల్లో ఏదో ఒక రోజు దీక్షను ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చారు.
 
రాజకీయ కారణాలతోనే నిరాకరణ...
రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ తలపెట్టిన నిరవధిక దీక్షకు రాజకీయ కారణాలతోనే గుంటూరు పోలీసులు అనుమతిని నిరాకరించారని మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. మొదట జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో, అంబేద్కర్ విగ్రహం(లాడ్జి సెంటర్), హిందూ కాలేజీ సెంటర్ ఈ మూడు చోట్లలో ఏదో ఒక చోట దీక్షకు అనుమతినివ్వాలని కోరామని, అందుకు పోలీసులు నిరాకరించారన్నారు.

ఈ నేపథ్యంలోనే తాము ఉల్ఫ్ హాల్ గ్రౌండ్‌ను ఎంపిక చేసుకుని అనుమతి కోరినా, దానికీ నిరాకరించారన్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో చంద్రబాబు రాష్ట్ర విభజనకు నిరసనగా ధర్నా చేస్తే అందుకు పోలీసులు అనుమతినిచ్చారన్నారు. ఇప్పుడు కేవలం రాజకీయ కారణాలతోనే దీక్షకు అనుమతిని నిరాకరించారని పిటిషన్‌లో తెలిపారు. హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు దీక్షను తిరిగి ఏ రోజు నుంచి ప్రారంభించాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు.
 
ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ...
అనేక పోరాటాలు నిర్వహించినా, ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడాన్ని నిరసిస్తూ తానే స్వయంగా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈనెల 26 నుంచి గుంటూరు కేంద్రంగా నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించడమే కాకుండా ఈ నెల 12వ తేదీనే పోలీసుల అనుమతి కోరారు. ప్రభుత్వ స్థలాల్లో ఎలా నిర్వహిస్తారంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నగరంలోని ఏసీ కాలేజీ ఉల్ఫ్‌హాల్ స్థలాన్ని ఎంపిక చేసి మరోసారి అనుమతి కోరారు. అలా కోరిన రెండు గంటల్లోనే వివిధ కారణాలు చూపిస్తూ దీక్షకు అనుమతి నిరాకరించారు.
 
ఆది నుంచీ అన్ని వేదికల్లోనూ పోరాటం...
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అన్ని వేదికల్లోనూ పోరాటం సాగిస్తోంది. ఎన్నికల అనంతరం తొలిరోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం విన్నవించింది. ఆ తర్వాత మంగళగిరిలో దీక్ష చేపట్టింది. వైఎస్ జగన్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ఆగస్టు 29న ఒకరోజు ధర్నా చేసి ప్రత్యేక హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటిచెప్పారు. అదే రోజు మార్చ్ టూ పార్లమెంట్ నిర్వహించారు.

‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో ఆగస్టు 29న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా విఫలం చేసేందుకు చంద్రబాబు అనేక కుయుక్తులు ప్రదర్శించినప్పటికీ విజయవంతమైంది. వైఎస్ జగన్ పదేపదే చేసిన డిమాండ్ మేరకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఈ నెల ఒకటిన ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించింది.

ఇదే క్రమంలో విద్యార్థులు, యువత.. తమకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరుపతి, 22న విశాఖలో యువభేరి సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సులకూ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. చివరకు సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ పైనా నిబంధనలకు విరుద్ధంగా చర్యలకు ఉపక్రమించింది. నిర్బంధాలతో అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విద్యార్థులు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ ఆకాంక్షను వ్యక్తంచేసి విజయవంతం చేశారు.
Share this article :

0 comments: