ప్రత్యేక హోదాయే సంజీవని: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదాయే సంజీవని: వైఎస్ జగన్

ప్రత్యేక హోదాయే సంజీవని: వైఎస్ జగన్

Written By news on Tuesday, September 22, 2015 | 9/22/2015


విశాఖపట్నం: ప్రత్యేక హోదా మన హక్కు అని, దాన్ని కలిసి కట్టుగా సాధిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ నంబర్ వన్ అవుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

'యువత కదిలితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. ఆ స్ఫూర్తిని చూపిస్తూ, ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా, కట్టడి చేసినా అవన్నీ బేఖాతరు చేస్తూ మీ అందరూ ఇక్కడికొచ్చి పోరాటంలో తోడుగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. ఆత్మీయతను పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరసు వంచి కృతజ్ఞత చెప్పుకొంటున్నాను. ప్రొఫెసర్లు అందరికీ నమస్సులు.

ప్రత్యేకహోదా కోసం నేను మాట్లాడిన ప్రతిసారీ, చేసిన ధర్నాల వల్ల ప్రత్యేక హోదా అంటే ఏంటనే అవగాహన కొంత వచ్చి ఉండాలి. కానీ మన ఖర్మ ఏమిటంటే రాష్ట్రాన్ని నడపాల్సిన ముఖ్యమంత్రిగారికి కూడా ప్రత్యేక హోదా గురించి తెలిసినా మభ్యపెడుతున్నారు. మంత్రులకు కూడా చాలామందికి ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలియదు. అంత దారుణమైన పరిస్థితులున్నాయి.

2014 మార్చి సమయంలో మన రాష్ట్రాన్ని మనం ఒప్పుకోకపోయినా అడ్డగోలుగా విభజించారు. ఆ సమయంలో రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ పక్కకు వెళ్లిపోతోంది, దీనివల్ల తీవ్రమైన నష్టం మన ప్రాంతానికి జరుగుతుందని అందరికీ తెలుసు. అయినా వాళ్లు రాష్ట్రాన్ని విభజించారు. కంప్యూటర్ చదివిన ప్రతి ఒక్కరూ 95 శాతం ఉద్యోగాలు హైదరాబాద్లోనే వస్తున్నాయని అందరికీ తెలుసు. అలాంటి హైదరాబాద్ నగరాన్ని మన నుంచి తీసేశారు. ఏ పరిశ్రమ ఎక్కడ రావాలన్నా.. 70 శాతం హైదరాబాద్లోనే. ఉద్యోగం కోసం ఎవరు వెతకాలన్నా చూసే ప్రాంతం హైదరాబాదే. అలాంటి నగరాన్ని మన నుంచి వేరు చేశారు. దానివల్ల అన్యాయం జరుగుతోందని తెలిసి, దీని బదులు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. అప్పుడు అదే సభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులంతా దానికి మద్దతు తెలిపారు. ఒకడుగు ముందుకేసి, తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. అప్పుడు చంద్రబాబు పార్టీ కూడా రాజ్యసభలో ఉంది. ఆయన కూడా ఓటేసి దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొట్టించారు. అన్ని పార్టీలూ కలిసి ఓటేసి రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పుడే ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రజలతో పని అయిపోయిందన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట ఉంది. ఎన్నికల్లో ఏ టీవీ ఆన్ చేసినా, ఏ గోడ మీద రాతలు చూసినా, చంద్రబాబు మైకు పట్టుకుని ఒకటే మాట చెప్పారు. రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలనేవారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు కావాలనేవారు. మూడో మాట.. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనేవారు. ఈవాళ బాబు సీఎం అయ్యారు. రైతులకు సంబంధించి రుణాలు ఏ ఒక్కరికీ మాఫీకాకపోగా.. గతంలో వడ్డీలేని రుణాలు ఇప్పుడు అపరాధ వడ్డీ 14 శాతం కట్టాల్సి వస్తోంది. బాబు ఇచ్చే డబ్బు వడ్డీలకు కూడా చాలక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా పొదుపు డబ్బులను కూడా బ్యాంకులు జమచేసుకుంటున్నాయి. 0 శాతం వడ్డీ పోయి రెండు రూపాయల వడ్డీ కడుతున్నారు. బాబు సీఎం అయ్యాక, ఉన్న జాబులను ఊడగొడుతున్నారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పుడు తమ ఉద్యోగాలు పోతాయో తెలియక ఆవేదన చెందుతున్నారు. విశాఖలో 5వేల మందికి ఉద్యోగాలు పోయాయి. పోనీ జాబ్ ఇవ్వకపోతే ఇంటికి 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీఎం అయ్యాక.. 1.75 కోట్ల ఇళ్లున్నాయి. ప్రతి ఇల్లూ భృతి కోసం ఎదురుచూస్తోంది. ఆ మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలే ఊడబెరుకుతున్నారు. 1,42,822 లక్షల ఉద్యోగాలున్నాయని రాష్ట్రం విడగొట్టే సమయంలో చెప్పారు. కొత్త రాష్ట్రం వచ్చాక ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. గత అక్టోబర్లో డీఎస్సీ పరీక్షలు పెట్టారు, ఫలితాలు వచ్చాయి కానీ వాళ్లకు ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఉన్న స్కూళ్లను, హాస్టళ్లను తగ్గిస్తున్నారు. ఇక్కడే ఉద్యోగాలు మిగులుగా ఉన్నాయని చెప్పి రోజుకో పేపర్ లీక్ ఇస్తున్నారు. అంటే, డీఎస్సీ రాసిన పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియవు. పిల్లలు గ్రామాల నుంచి వచ్చి హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఏళ్ల తరబడి చదువుకుంటున్నారు. అయినా చంద్రబాబుకు దయలేదు. కనీసం పీఎస్సీ పరీక్షల క్యాలెండర్ కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితిలో చదువుకున్న ప్రతి పిల్లాడికీ సంజీవనిలా కనిపించేది ప్రత్యేకహోదా.

చంద్రబాబు గత చరిత్ర చూసినా ఆయన ఏనాడూ పిల్లల గురించి, వాళ్ల ఉద్యోగాల గురించి ఆలోచించలేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ వల్లే రాష్ట్రం విజయం సాధించిందంటూ పుస్తకం విడుదల చేశారు. 42 ప్రభుత్వ సంస్థలను మూసేశామని గొప్పగా చెప్పుకొన్నారు. ఏరోజూ వీళ్లకు ఉద్యోగాలివ్వాలి, ప్రభుత్వ రంగ సంస్థలు బాగోకపోతే బలపరచాలన్న ఆలోచన లేదు. అవకాశం వస్తే ఆ సంస్థలను ఇంకా అధ్వానంగా చేసి, వాటిని అమ్మేసే కార్యక్రమానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. యూనివర్సిటీలలో 5 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టీచింగ్ స్టాఫ్ లేరు. అయినా 18 నెలల నుంచి సీఎంగారు పట్టించుకోరు. యూనివర్సిటీలు దివాలా తీయాలి, పిల్లలకు చదువు రాకుండా పోవాలి, ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొస్తే మంచిదనే దిక్కుమాలిన ఆలోచన. అక్కడ కన్వీనర్ కోటా ఉండదు, అప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకమే ఉండదు, ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తారు. ప్రైవేటు వర్సిటీలకు ఉచితంగా భూములు, డబ్బులు కూడా ఇస్తారు. కనీసం లోకల్ కోటా కింద ఇంతమంది పిల్లలను ఇక్కడినుంచి తీసుకోవాలని కూడా చెప్పరు. రీజనల్ రిజర్వేషన్స్ కథ దేవుడెరుగు, లోకల్ రిజర్వేషన్లు కూడా ఉండవు. అయినా చంద్రబాబు ఈ ప్రైవేటు యూనివర్సిటీలనే తెస్తారు.

గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ సంవత్సరం కడతామంటారు. విద్యార్థులు వెళ్లి గొడవ చేస్తే, ధర్నాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా వ్యాన్లలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ప్రపంచబ్యాంకు నెంబర్ 2 ర్యాంకు ఇచ్చిందని ఘనకార్యంలా చెప్పుకొంటున్నారు. ఈయనెలా మిస్ లీడ్ చేస్తారంటే, ఆయనెలా మోసం చేస్తారంటే.. ఆ స్టేట్మెంట్ చూద్దాం. ప్రపంచబ్యాంకు ఈమధ్య ఓ రిపోర్టు ఇచ్చింది. డిపెప్, కేపీఎంజీ అనేసంస్థ, సీఐఐ, ప్రపంచబ్యాంకు కలిసి ఈ రిపోర్టు తయారుచేశారు. మోదీ మేకిన్ ఇండియా అనే కార్యక్రమం కింద ఉత్పత్తి రంగాన్ని దేశంలో మెరుగు పరచాలని అన్నారు. అందులో అందరు సీఎస్ లను పిలిచి, 98 పాయింట్లు ఇచ్చారు. వీటిని ఏ రాష్ట్రమైనా ఎంత త్వరగా చేస్తారో చెప్పండి అన్నారు. చాలామంది అవి చూసి భయపడ్డారు. అందులో ఉన్నవి కార్మిక సంస్కరణలు. పనిచేసేవాళ్లను తీసేసే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. యూనియన్లు ఉండవట. అలాంటి సంస్కరణలు ఉంటే చాలామంది సీఎంలు, సీఎస్లు భయపడ్డారు. మన చంద్రబాబు మాత్రం కుడి, ఎడమ చూడకుండా సంతకాలు పెట్టేశారు. ఆయనకు పోయేదేమీ లేదు. భోగాపురంలో భూములు తీసుకుని ప్రైవేటువాళ్లకు ఎక్కువ రేటుకు అమ్మేస్తారు. ఇలా చంద్రబబు సంతకాలు పెడితే.. ఆయనకు రెండోస్థానం ఇచ్చారు. కానీ ఆమాట చంద్రబాబు ఎప్పుడూ చెప్పరు. పక్కనున్న కర్ణాటక, తమిళనాడు వాళ్లంతా భయపడ్డారు. సంతకాలు పెడితే ఏమవుతుందని ఆలోచించారు.

ప్రత్యేక హోదా రాగానే రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది. కారణం, ఈ హోదా వస్తే రెండు ప్రధానమైన మేళ్లు జరుగుతాయి. కేంద్రం మనకిచ్చే నిధులు గ్రాంటుగా.. అంటే తిరిగి ఇవ్వక్కర్లేకుండా 90 శాతం వస్తాయి. పది శాతమే రుణంగా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా లేకపోతే 70 శాతం రుణంగా ఉంటుంది, 30 శాతమే గ్రాంటుగా ఉంటుంది. హోదావస్తే రాష్ట్రానికి అప్పులు తగ్గుతాయి. రెండోది.. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం వందశాతం ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయపన్ను మినహాయింపులు ఇస్తుంది. రవాణా ఛార్జీలు కూడా వెనక్కి ఇచ్చే సదుపాయం ఉంటుంది. ఇవి ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు మాత్రమే వస్తాయి. ఈ విషయాలు పరిశ్రమలకు తెలిస్తే.. మన రాష్ట్రం నుంచి చాలామంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తారు. లక్షల కోట్లు పెట్టుబడిగా తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఇది తెలిసినా చంద్రబాబు పట్టించుకోరు. ఆయన ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగాలు తెప్పించే ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయరు. అసలు ఆయన మనిషేనా అనిపిస్తుంది. ఆయనను ఈమధ్య చూస్తే బాగా తెలుస్తోంది. ఆయన ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటూ లంచాలుగా తీసుకున్న డబ్బు.. పట్టిసీమ నుంచి అన్నీ లంచాలే. మట్టి, ఇసుక, మద్యం లైసెన్సులు, కరెంటు కోసం బొగ్గు కొనుగోలు చేయాలన్నా అన్నీ లంచాలే. ఈ డబ్బుతో చంద్రబాబు నాయుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా పంచుతూ అక్కడ ఎమ్మెల్సీని గెలవాలన్న తపనతో ఒక్కొక్కరికి 5 నుంచి 20 కోట్ల వరకు 18 మంది ఎమ్మెల్యేలకు ఎర చూపించారు. ఆడియో, వీడియో టేపుల్లో నేరుగా దొరికిపోవడాన్ని కూడా మనం చూశాం. కేంద్రంలో ఉన్న మంత్రులను ఉపసంహరించుకుంటానని ఈయన చెప్పరు. కారణం అక్కడి వాళ్లు కీ ఇస్తారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం ముందు సాగిలపడాలి. ఇలాంటివాళ్లను చూస్తే మన ఖర్మ అనిపిస్తుంది. కేసులు అందరికీ ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు ప్రత్యర్థులు ఎక్కువ. ఆరోజుల్లో నామీద కేసులు పెట్టినవాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, చంద్రబాబు కలిసి పెట్టారు. రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు జగన్ మంచోడే. ఎప్పుడైతే జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారో జగన్ చెడ్డోడు అయిపోయాడు. చంద్రబాబు సోనియాగాంధీకి తందానా అన్నారు, నామీద కేసులు పెట్టారు. అయినా నేను భయపడలేదు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని నిజాయితీగా పోరాడింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. కేసులు వస్తాయనే భయంతోనే చంద్రబాబు ముందుకు రావట్లేదు. కేసులు వస్తాయని రాష్ట్రాన్ని పణంగా పెడితే పిల్లలు మనవైపు చూస్తున్నారు. వాళ్లకు మనం రోల్ మోడల్స్గా ఉండాలి. కానీ కేసులున్నాయని రాష్ట్రాన్ని అమ్మేసే, పణంగాపెట్టే కార్యక్రమం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెబుతున్నా. కేంద్రం ఎటూ ప్రత్యేక హోదా ఇవ్వదని చంద్రబాబు ప్లేటు మారుస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు, దానికంటే ప్యాకేజి మేలని ఆయన చెబుతున్నారు. అదేంటని ఆయనను నిలదీయండి. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మన రాష్ట్రానికి పోలవరం కడతామని, కారిడార్ ఇస్తామని, రోడ్లు, భవనాలు కడతామని, యూనివర్సిటీలు తెస్తామని.. రకరకాల హామీలిచ్చారు. ఆ హామీలన్నీ కూడా వాళ్లు ఇంత డబ్బులవుతాయని లెక్కకట్టి, దాన్నే ఒక ప్యాకేజిగా ఇస్తామంటున్నారు. ఇవన్నీ అప్పుడు చెప్పినవే కదా, అంటే మన హక్కే కదా.. ఇప్పుడు మరి ప్రత్యేకంగా తెచ్చేదేంటని నిలదీయండి. అదేదో తాను కొత్తగా తెస్తున్నట్లు ఈయన మభ్యపెట్టి, ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తున్నారు. చంద్రబాబు వస్తే గట్టిగా నిలదీయండి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల గురించి చంద్రబాబు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి ఆయన మంత్రులు అంటారు.. ఒడిసా, తమిళనాడు, మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదని అంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రాష్ట్రాలు లేవా, వాళ్లు ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కాదనడం ఏంటి?

14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు కాబట్టి హోదా ఇవ్వడంలేదని మరో అబద్ధం చెబుతున్నారు. మేమంతా చదువుకున్నవాళ్లమే. మాకూ తెలుసు. ఆర్థిక సంఘం పరిధి, ప్రణాళికా సంఘం పరిధి, ప్రత్యేక హోదా ఇచ్చేదెవరో మాకు తెలుసు, మా చెవిలో పూలు పెట్టొద్దని బాబుకు చెప్పండి. దేశంలో పన్నుల రూపేణా వసూలు చేసిన డబ్బులను ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనే నిష్పత్తిని చూసేది ఆర్థిక సంఘం. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాలు చూస్తుంది. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా కేబినెట్ నిర్ణయం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్.. దానికి అధ్యక్షుడు ప్రధాని. నీతి ఆయోగ్కు అధ్యక్షుడు కూడా ప్రధానమంత్రి. ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి అవునా కాదా అని నిలదీయండి. మార్చి 3న ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పటికి 18 నెలలైనా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని అడగండి. ఇంత పచ్చిగా అబద్దాలు చెబుతున్నారు. దీన్ని గట్టిగా నిలదీయాల్సింది మనం. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్లో జరిగిన అభివృద్ధి చూద్దాం. అక్కడ 2వేల పరిశ్రమలు వచ్చాయి 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా 10వేల పరిశ్రమలు వచ్చాయి. ఇది ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేలు. మనకు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే, కలిగే ప్రయోజనాల వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ప్రత్యేక హోదా గురించి తెలుసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, స్పెషల్ స్టేటస్ అని గూగుల్లో కొడితే బోలెడు వెబ్సైట్లు వస్తాయి. వాటిని చూసి చంద్రబాబు ప్రభుత్వానికి మీరే అవగాహన కల్పించవచ్చు.
Share this article :

0 comments: