‘యువభేరి’ ప్రొఫెసర్ సస్పెన్షన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘యువభేరి’ ప్రొఫెసర్ సస్పెన్షన్

‘యువభేరి’ ప్రొఫెసర్ సస్పెన్షన్

Written By news on Thursday, September 24, 2015 | 9/24/2015


‘యువభేరి’ ప్రొఫెసర్ సస్పెన్షన్
- ఇది భావప్రకటన స్వేచ్ఛపై దాడి అంటున్న విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కాలన్న ఆకాంక్షను వినిపించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేసేలా ప్రభుత్వం నిరంకుశ చర్యలకు దిగుతోంది. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో జరిగిన యువభేరి సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను, దాని ఆవశ్యకతను వినిపించిన ఆంధ్రా వర్సిటీ  ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతిథిగా పాల్గొని ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించిన యువభేరి సదస్సుపై బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో అధికారులతో చర్చించారు. సదస్సులో ప్రసంగించిన వర్సిటీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని సస్పెండ్ చేయాలని సమావేశం నుంచే ఆంధ్రావర్సిటీ ఉన్నతాధికారులను ఫోన్లో ఆదేశించారు.
 
మంత్రి ఆదేశాలతో సర్వత్రా విస్మయం..
ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కాల్సిన ఆవశ్యకత గురించి చర్చించడానికి విద్యార్థులు నిర్వహించుకున్న సదస్సులో పాల్గొని తన భావనలను పంచుకున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇది అప్రజాస్వామ్యక ధోరణి అని అనేక మంది మండిపడుతున్నారు.
 
కోదండరాంపై ఏం చర్యలు తీసుకున్నారు?
ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై చర్యలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. పైగా రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాల్సి ఉంది. ఆ ఆకాంక్షను వెలిబుచ్చడం నిబంధనలకు విరుద్ధమెలా అవుతుందన్న ప్రశ ్న ఉత్పన్నమవుతోంది. యూజీసీ నిబంధనల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రజాచైతన్య కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఎక్కడా లేదు. వారు సదస్సులు, చర్చాగోష్టులు, సమావేశాల్లో పాల్గొని తమ భావాలను వ్యక్తపరచవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగాయి.

ఆ సమయంలో వివిధ వర్సిటీల్లోని అధ్యాపకులే ఉద్యమాల్లో క్రియాశీల పాత్రను పోషించారు. ఓయూ ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వంటి వారు కూడా ప్రత్యేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం అలాంటి వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వారిపై కూడా చర్యలేమీ తీసుకోలేదు.

అయితే ఇప్పుడు ప్రత్యేకహోదా అంశం గురించి జరిగిన సదస్సులో పాల్గొన్న అధ్యాపకుడిపై మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ తీరుపై ఉపాధ్యాయ, విద్యార్థి లోకాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణ చివేసే చర్యలకు ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.
Share this article :

0 comments: