ఆ ఏముందిలే వీళ్లు పేదోళ్లు! ఎవరికి చెప్పు కోగలరు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ ఏముందిలే వీళ్లు పేదోళ్లు! ఎవరికి చెప్పు కోగలరు?

ఆ ఏముందిలే వీళ్లు పేదోళ్లు! ఎవరికి చెప్పు కోగలరు?

Written By news on Thursday, September 24, 2015 | 9/24/2015


చెంపలు టపటపా వాయించాలి
‘తల్లి కావడం ఏ తల్లికి ఆనందాన్నివ్వదు చెప్పండి? రెండోసారి గర్భవతినయ్యానని తెలిశాక చాలా సంతోష పడ్డాను. పెద్దాడికి తోడుగా దేవుడు ఇంకో బిడ్డను పంపిస్తున్నాడని సంబరపడ్డాను. ఎంత కష్టమైనా సరే ఇద్దరు పిల్లల్ని బాగా పెంచాలని ఆరాటపడ్డాను. కానీ పొత్తిళ్లలోనే రెండో పిల్లాడు పోవడం.. ఆ బాధ... పగవాడికి కూడా వద్దు. దాన్నుంచి ఇప్పటికీ కోలుకోలేక పోతున్నాం.  కళ్లు మూసినా తెరిచినా వాడే కనిపిస్తున్నాడు.  తట్టుకోలేక ఏదైనా చేసుకుందామని కూడా ప్రయత్నించా. నా భర్త పరిస్థితి కూడా అలాగే ఉంది.

ఇలా జరిగేదా?
 పిల్లోడిని బతికించుకోవాలనే ఆశతోనే గుంటూరు ఆసుపత్రికెళ్లాం.  డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. డాక్టర్లు, నర్సులు పట్టించుకొని ఉంటే ఇలా జరిగేదా? ‘ఆ ఏముందిలే వీళ్లు పేదోళ్లు! ఎవరికి చెప్పు కోగలరు? వీళ్ల మాటలు విని మమ్మల్ని ఎవరేం చేయగలరు’  అనే నిర్లక్ష్యంతోనే మా పిల్లాడిని చంపేశారు.

ఆదివారం రాత్రి (ఆగస్ట్ 23) ఎడమ చేయి అయిదు వేళ్లు, కుడిచేయి రెండు వేళ్లను ఎలుకలు కొరికాయి. ఆ రాత్రి ట్రీట్‌మెంట్ లేదు. సోమవారం ఉదయం డాక్టర్‌ను అడిగా - ‘మా బాబును మాకు ఇచ్చేయండి... బయట చూపించుకుంటాం’ అని. దానికి డాక్టర్ ఒకటే చెప్పారు... ‘బాబు చనిపోయే వరకు ఇంక్యుబేటర్ నుంచి తీయం మేం!’ అని. తర్వాత  సిస్టర్‌కు మందు ఇమ్మని చెప్పి వెళ్లిపోయారు. సిస్టర్ ‘‘అంత జాగ్రత్త వున్నదానివి... ఇలాంటి పిల్లాడిని ఎలా కన్నావే’’ అని వెటకారాలాడింది. ‘‘పెద్దబాబు బాగానే ఉన్నాడుగా... ఈ బాబు మీద ఆశలు వదులుకోండి’’ అంటూ విసుక్కుంది. తొమ్మిది నెలలు మోసింది బిడ్డ మీద ఆశలు వదులుకోవడానికా? మేమడిగినట్టు సోమవారమే పంపించేస్తే మా బిడ్డ మాకు దక్కేవాడు. బుధవారం తెల్లవారుజామున బిడ్డను  రెండోసారి (26 ఆగస్ట్) ఎలుకలు కొరికితే  మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్లు రాలేదు. చనిపోయిన బాబుకు  రెండు గంటల సమయంలో ట్రీట్‌మెంట్  చేయడానికి వస్తారా? ఇదేనా డాక్టర్‌ల బాధ్యత? ఇక నర్సులయితే కబుర్లు చెప్పుకోవడం, వెళ్ళిపోవడం. నైట్ డ్యూటీలో ఉన్నవాళ్లయితే  పదకొండింటికే నిద్రపోతారు. ఎలుకల నుంచి మా బిడ్డలను మేం కాచుకోవాలి. మాకు మేమే కాపాడుకుంటూ, మాకు మేమే ట్రీట్‌మెంట్ చేసుకునేవాళ్లమే అయితే ఈ ఆసుపత్రికి ఎందుకు వెళ్తాం?

ఇప్పుడు ఎలుకలను చూస్తేనే మా బాబు గుర్తుకొస్తున్నాడు. పసిపిల్లాడు.. ఆ బాక్స్‌లో ఎలుకలు కరుస్తుంటే ఎలా భరించాడో నా తండ్రి.. ఎంత క్షోభపడ్డాడో! కిచకిచ శబ్దానికి మెలకువ వచ్చి చూసేసరికే నా బిడ్డ రక్తపు ముద్దయ్యాడు. వెంటనే సిస్టర్‌కి కబురు పెట్టాం. సిస్టర్ వచ్చి ‘మీరు ఉంది ఎందుకు? పిల్లోడి దగ్గర మిమ్మల్ని ఎందుకు పెట్టాం? మీరే చూసుకోవాలి. పదేపదే మమ్మల్ని ఎందుకు పిలుస్తారు?’ అంటూ విసుక్కుంది. తీరిగ్గా వచ్చిన మాధవరావు డాక్టర్ జేబులో చేతులు పెట్టుకొని చూసి వెళ్లిపోయాడు. బాబు మీద చేయి వేసి చూస్తే ఒళ్లు చల్లగా తగిలింది. ఇంక్యుబేటర్ దగ్గర ఉన్న  ఓ చిన్న చెక్క స్టూల్ మీద కూర్చొనే ఎలుకలు రాకుండా కాపలా కాసేదాన్ని.

పెద్దాపరేషన్ అయింది (సిజేరియన్). కుట్లు నొప్పిపుడుతున్నా... అలాగే కూర్చొని  కాపలా కాసేదాన్ని. మొదటిసారి ఎలుకల నుంచి బిడ్డను కాపాడుకున్నా. కానీ రెండోసారి... (ఏడుస్తూ ఆగిపోయింది లక్ష్మి. మళ్ళీ గొంతు పెగుల్చుకొని...) గురువారం ఆపరేషన్ చేశారు. శనివారం మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. కానీ ఎలుకలకు బాబు నైవేద్యం అయిపోయాడు. బాబు పోయాక కూడా  మేం పోలీస్ కేసు పెడితేనే బాబును మాకు అప్పగించారు. రక్తపు ముద్దగా బారిన బిడ్డను చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనిపించింది. బాధ్యత లేని వాళ్ల చెంపలు టపాటపా వాయించాలనిపించింది.

బాధేస్తోంది...
ఇంత జరిగినా బాధ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధేస్తోంది.  ప్రభుత్వం ఆ రోజు మాకిచ్చిన మాటేంటి? డబ్బులిచ్చేసి తమ బాధ్యత అయిపోనట్టు, మా బాధ తీరిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. మా బాధ తీరలేదు. మా బాబు చనిపోవడానికి కారకులైన డాక్టర్లను తొలగిస్తేనే మాకు కొంచెం ఊరట. కొంచెం తృప్తి. మాలాగా ఇంకే తల్లిదండ్రులకూ కడుపుకోత రాకూడదు.

అబద్ధాలు చెప్తున్నారు
కళ్ల ముందే బిడ్డను చంపుకున్న క్షోభను మేం అనుభవిస్తున్నాం. జీవితాంతం ఆ బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పిల్లాడు బతికి, ఎదిగి మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చేవాడో.. అయిదు లక్షల పరిహారం అంత సంతోషాన్నిస్తుందా. పైగా నేను పదిలక్షలు అడిగానని అబద్ధాలు చెప్తున్నారు (డాక్టర్లు, నర్సులు).  మాకు డబ్బు ప్రధానం కాదండి... మాలాగా ఇంకో తల్లీ తండ్రీ బాధపడకూడదు. ప్రభుత్వం నుంచి  మాకు న్యాయం కావాలి.  పసిపిల్లలకు ట్రీట్ మెంట్ ఇవ్వాలంటే జాగ్రత్తగా ఉండాలనే భావం రావాలి. దేవుడి తర్వాత దండం పెట్టేది డాక్టర్‌కే. ఆ గౌరవం కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చేవరకు పోరాడుతాం. ఎంతవరకైనా వెళతాం.

ఒకటే కోరిక...
వార్డుల్లోకి చెప్పులు వేసుకొని రావద్దని చెప్తుంటారు. కానీ డాక్టర్లు మాత్రం దాన్ని పాటించరు. గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో ఆడవాళ్లకు, మగవాళ్లకు బాత్రూమ్స్ ఒకటే. నీళ్ళు రావు. కంపుగొట్టి లేని రోగాలు వస్తున్నాయి. నా బిడ్డకు జరిగినట్టే వాళ్ల బిడ్డలకూ జరుగుతుందేమోనని హాస్పిటల్‌లో ఉన్న మిగతా తల్లిదండ్రులూ భయపడ్డారు. ఆ  ఆసుపత్రి నుంచి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా బయటపడితే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నేను కోరుకునేది ఒకటే... ఏ ప్రభుత్వం వల్ల నేను నష్టపోయానో అదే ప్రభుత్వం మా కుటుంబానికి న్యాయం చేయాలి. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా కల్పించాలి.  కనీసం ఉన్న ఒక్క కొడుకునైనా మంచిగా పెంచుకోవడానికి సహకరించాలి.

ఇన్‌పుట్స్: ఎన్. మాధవ్ రెడ్డి,
సాక్షి, గుంటూరు
జి. రాజారమేష్, సాక్షి టీవి, విజయవాడ

http://www.sakshi.com/news/family/should-give-the-panishment-to-nigligence-people-278646
Share this article :

0 comments: