గుంటూరులో జగన్ దీక్షకు అడుగడుగునా సర్కారు అడ్డంకులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరులో జగన్ దీక్షకు అడుగడుగునా సర్కారు అడ్డంకులు

గుంటూరులో జగన్ దీక్షకు అడుగడుగునా సర్కారు అడ్డంకులు

Written By news on Thursday, September 24, 2015 | 9/24/2015


అదే కుట్ర!
 గుంటూరులో జగన్ దీక్షకు అడుగడుగునా సర్కారు అడ్డంకులు
⇒ అనుమతి నిరాకరించిన గుంటూరు పోలీసులు
 ఉల్ఫ్ హాల్ గ్రౌండ్ వద్ద బలవంతంగా ఏర్పాట్లు నిలిపివేత
⇒ పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
⇒ పోలీసులతో వాగ్వివాదం.. ఉద్రిక్తంగా వాతావరణం
⇒ తెరవెనుక సీఎం చంద్రబాబు మంత్రాంగం
⇒ యువభేరి విజయవంతమవడంతో సర్కారులో వణుకు
⇒ జగన్ నిరవధిక దీక్ష చేపట్టకుండా కుట్రలు..
⇒ హోదాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న భావన సర్వత్రా వ్యక్తం


సాక్షి, గుంటూరు, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా... ఉద్యమిస్తున్న ప్రతిపక్షానికి వరుసగా అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు కల్పిస్తోంది. ‘హోదా’పై ఎలుగెత్తే గొంతుకను కర్కశంగా నిలువరిస్తోంది. ప్రత్యేక హోదా వల్లనే ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కుతాయన్న అవగాహనకు వచ్చిన విద్యార్థులు, యువత చేపట్టిన యువభేరి సదస్సులకు వస్తున్న స్పందన చూసిన ప్రభుత్వం ఎక్కడాలేని విధంగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. తిరుపతి, విశాఖల్లో యువభేరి సదస్సులను అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమైన సర్కారు... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ నెల 26న గుంటూరులో చేపట్టనున్న నిరవధిక దీక్షనూ ఎలాగైనా జరగనీయకుండా కుయుక్తులు పన్నుతోంది.

 అందులో భాగంగానే మరో అడుగు ముందుకేసి గుంటూరు ఉల్ఫ్ హాల్ గ్రౌండ్‌లో జరిగే దీక్షకు అనుమతి నిరాకరించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందనే సాకుతో పోలీసు అధికారులు నిరవధిక దీక్షకు అనుమతి లేదని కొత్త పల్లవి అందుకున్నారు. బుధవారం సాయంత్రం అనుమతి నిరాకరించి దీక్షా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను బలవంతంగా నిలిపివేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరునూరైనా వైఎస్ జగన్ దీక్ష చేస్తారని వైసీపీ నేతలు ప్రకటించారు.

 గతంలోనూ  బాబు సర్కారు విఫలయత్నం
 ప్రత్యేక హోదా సాధనకు బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండగా, ఆ పని చేస్తున్న వైఎస్ జగన్ హోదా సాధన కోసం గతంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకున్న తీరు తెలిసిందే. తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొని పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, రోజంతా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సూచనలు ఇస్తూ బంద్‌ను విఫలం చేయడానికి యత్నించిన విషయం విదితమే. బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడంతో చంద్రబాబు సర్కారులో వణుకు మొదలైంది. దీంతో అక్కడితో ఆగక, తిరుపతి, విశాఖలో జరిగిన యువభేరి సదస్సులను అడ్డుకోవడం, విశాఖ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ విధించేందుకు ఉపక్రమించడం, దీక్షకు అనుమతి నిరాకరించడం వంటి చర్యలు చూస్తే ప్రత్యేక హోదా సాధించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

 ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే...
 జగన్ దీక్షను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలందడంతో బుధవారం ఉదయమే పోలీసులు భారీఎత్తున రంగంలోకి దిగారు. ఈస్ట్‌జోన్ డీఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో దీక్షాస్థలికి వచ్చిన పోలీసులు అక్కడ పనులను నిలిపివేయించారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ ఛైర్మన్ తలశిల రఘురామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అక్కడకు చేరుకొని డీఎస్పీ, ఇతర పోలీసులను అడ్డుకుని పనులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు.

 నిరవధిక దీక్షకు మొదట హిందూ కాలేజి దగ్గర, అంబేద్కర్ విగ్రహం, కలెక్టర్ కార్యాలయాలను  ఎంపిక చేసుకోగా, మూడింటినీ నిరాకరించి మరొక స్థలం ఎంపిక చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు కోరిన విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ గుర్తుచేశారు. చివరిగా ఏసీ కాలేజి ఎదుట ఉన్న ఉల్ఫ్ హాలు స్థలాన్ని సంబంధిత యాజమాన్యం నుంచి అద్దెకు తీసుకొని, తగిన రుసుం చెల్లించినట్టు చెప్పారు. ఆ పత్రాలతోపాటు జగన్ దీక్షకు భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరుతూ గతంలోనే జిల్లా ఎస్పీకి లేఖ ఇచ్చామని తెలిపారు. అయినా పోలీసు అధికారులు దీక్షా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని చెప్పడంతో నాయకులు వారితో వాగ్వివాదానికి దిగారు.

 దీక్ష చట్ట వ్యతిరేకమన్న పోలీసులు...
 నిరవధిక దీక్షకు అనుమతిని తిరస్కరిస్తున్నామని పేర్కొంటూ ఈస్ట్‌జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నేతలకు లేఖ ఇచ్చారు. ‘నిరవధిక దీక్ష చట్టవ్యతిరేకమైనందున అనుమతి తిరస్కరించటమైనది’ అని అందులో పేర్కొన్నారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి దీక్షాస్థలానికి చేరుకొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ముఖ్య నేతలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిని కలిశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, సమీపంలోని ఆస్పత్రులు, విద్యాసంస్థలకు శబ్దకాలుష్యమనే అభ్యంతరాలను ఎస్పీ వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్య రాకుండా వాహనాలను దూరంగా నిలిపివేసి వస్తామని, నియమిత డెసిబుల్స్‌లోనే శబ్దం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటామని పార్టీ తరఫున మరో లేఖను ఎస్పీకి అందించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఎస్పీ కోరడంతో పార్టీ నేతలు తిరిగివచ్చారు.

చంద్రబాబు సూచనలతోనే...
 నిరవధిక దీక్ష వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని స్థానిక పోలీసులు భావిస్తున్నా సీఎం చంద్రబాబు సూచనలతోనే వారు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఉల్ఫ్ హాల్ గ్రౌండ్‌లో దీక్ష వల్ల పెద్దగా ఇబ్బందులుండని అర్బన్ పోలీసు ఉన్నతాధికారులు ఇంటిలిజెన్స్ విభాగానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగి అసలు అక్కడ దీక్షే జరక్కూడదని గుంటూరు అర్బన్ పోలీస్ బాస్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో బుధవారం ఉదయమే ఏర్పాట్లు జరుగుతున్న దీక్షా స్థలి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

 ఆది నుంచీ ఇదే తీరు...
 ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలపై చర్చించేందుకు, తద్వారా యువతలో అవగాహన కల్పించేందుకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు యువభేరీ సదస్సులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సాధనపై మొదట్నుంచీ తన గళాన్ని గట్టిగా వినిపిస్తూ.. ఢిల్లీ వరకు పోరాటం నిర్వహించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఈనెల 15న ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో యువభేరి సదస్సుకు మొదట అనుమతిని ఇచ్చి, తర్వాత యూనివర్సిటీలు, కాలేజీల్లో సభలకు అనుమతి లేదని ప్రభుత్వం అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు నిర్వహించారు. సదస్సు విజయవంతం కావడంతో.. ఆ తర్వాత ఈ నెల 22న జరిగిన విశాఖ యువభేరి సదస్సుకూ ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది.

సెక్షన్ 30, 31ని అమల్లోకి తెచ్చి నగరంలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని నోటీసులు జారీ చేసింది. సదస్సుకు వచ్చే ర్యాలీలను అడ్డుకుంది. అయినా, వైఎస్ జగన్ పాల్గొన్న సదస్సుకు యువత ఉవ్వెత్తున తరలివచ్చింది. దీంతో గంగవైలెత్తిన ప్రభుత్వం నిరవధిక దీక్ష జరక్కుండా ఆపడానికి కుట్రలు పన్నుతోంది. అయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ దీక్ష చేపడతారని వైసీపీ నాయకులు పోలీసులకు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం నుంచి దీక్షా స్థలి వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కొలుసు పార్థసారధి, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌లున్నారు.
 నేడు హైకోర్టుకు..: దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు హైకోర్టును గురువారం ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

అనుమతి కోసం చూస్తున్నాం
 ప్రత్యేక హోదా కోసం 26న వైఎస్ జగన్ తలపెట్టిన నిరవధిక దీక్షకు సంబంధించి పోలీసు అధికారులు చెబుతున్న అభ్యం తరాలను పునరాలోచించుకోవాలని లేఖ ఇచ్చాం. ఏసీ కాలేజీకి చెందిన ఉల్ఫ్ హాలు దీక్షాస్థలికి ఎంపికచేసి సంబంధిత యజమాని నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుని అద్దె కూడా చెల్లించాం. ఆ ప్రదేశంలో దీక్షను పోలీసులు బుధవారం తిరస్కరించటంతో సాయంత్రం అర్బన్ ఎస్పీని కలిశాం. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వాహనాలను దూరంగా నిలిపివేస్తామన్నాం. శబ్దకాలుష్యానికి అవకాశం లేకుం డా తక్కువ డెసిబుల్స్ ఉండేలా చూస్తామని వివరించాం. దీనికి కొంత వ్యవధి కావాలని అధికారులు కోరినందున ఎదురుచూస్తున్నాం.   
 - విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


 అడ్డుకుంటే ఆహుతవుతారు..
 అధికారంలో ఉన్నపుడు ఎక్కడ పడితే అక్కడ దీక్షలు చేసిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు నియంతలా అభ్యంతరం చెప్పటం దుర్మార్గం. నవనిర్మాణ దీక్ష పేరుతో సాక్షాత్తూ సీఎం చంద్రబాబు అత్యంత రద్దీ గల విజయవాడ బెంజి సర్కిల్‌లో దీక్ష శిబిరం నిర్వహించింది మరిచారా? చంద్రబాబూ పునరాలోచన చెయ్యి.. నువ్వు సాధించాల్సిన ప్రత్యేక హోదాను ప్రజల హక్కుగా ప్రతిపక్ష నేత జగన్ చేస్తుంటే, అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదు. నరరూప రాక్షసుడిలా బాబు జగన్ దీక్షను అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రత్యేకహోదా దీక్షాయజ్ఞ హోమగుండంలో పడి ఆహుతవక తప్పదు.   
- అంబటి రాంబాబు
Share this article :

0 comments: