అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన...

అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన...

Written By news on Thursday, September 24, 2015 | 9/24/2015


వైఎస్సార్ ఎవరెస్టు
కరీంనగర్ పరామర్శ యాత్రలో  షర్మిల
తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో వైఎస్
వైఎస్ ఆశయ సాధనకు చేయి చేయి కలుపుదాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దివంగత మహానేత వైఎస్సార్ ఎవరెస్టు శిఖరంలాంటి వారని, ఆయనకు మరణం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజల గుండెలపై వైఎస్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి బుధవారం షర్మిల కరీంనగర్ జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు.

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలికి భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన నిలబడ్డారని, అందుకే వారి గుండెల్లో రాజన్నగా బతికి ఉన్నారన్నారు. ‘‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని రుణమాఫీ చేసి ఆదుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి అండగా నిలబడ్డారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారు.

అందుకే వైఎస్సార్ మరణించి ఇంతకాలమైనా ప్రజ లు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు..’’ అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను, ఆయన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం చేయి చేయి కలిపి ముందుకు సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
అన్నల కోటలో.. కాటారం, మహాదేవపూర్, కమాన్‌పూర్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వరంగల్ జిల్లా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అటవీ ప్రాంతంలోని కుటుంబాలను ఒకే చోటకు పిలిచి పరామర్శించాలని వరంగల్ డీఐజీ చేసిన సూచనను షర్మిల సున్నితంగా తిరస్కరించారు. అలా చేస్తే పరామర్శకు అర్థం ఏముంటుందన్నా అంటూ యాత్రకు పయనమయ్యారు.

దట్టమైన అటవీ మార్గం మీదుగా కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మడక సుశీల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అదే మండలం విలాసాగర్‌లోని మంచినీళ్ల కొమురమ్మ కుటుంబీకులను కలిశారు. తర్వాత కమాన్‌పూర్ మండలం కేకే నగర్‌లో చిలకాని హన్మంతు, సుల్తానాబాద్ మండలం చిన కల్వల గ్రామంలో కుంభం వెంకటలక్ష్మి, చొప్పదండి మండలం వెదురుగట్టులో మడ్డి రామస్వామి, ధర్మారం మండలం నర్సింహులపల్లిలో కునుకుంట్ల రాయమల్లు కుటుంబాలను పరామర్శించారు.

పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ నగేష్, బీష్వ రవీందర్, బోయినపల్లి శ్రీనివాసరావు, సెగ్గం రాజేష్, అక్కినపెల్లి కుమార్, సందమల్ల నరేష్, గోవర్ధన శాస్త్రి, సింగిరెడ్డి ఇందిర,  జిల్లా నాయకులు రాజమ్మ, పద్మ, ఎస్‌కే ముస్తాక్, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
 
అమ్మా... మీ ఇల్లే నా తల్లిగారిల్లు!
తల్లిదండ్రులు లేని ఆ ఆడబిడ్డకు వైఎస్ కుటుంబమే తల్లిగారి ఇల్లు అయింది. ఏ తోడు లేని ఆ నిరుపేదకు వైఎస్ ఇల్లు కట్టిస్తే... పెళ్లీడుకొచ్చిన ఆ యువతికి జగన్ డబ్బు పంపి పెళ్లి చేయించారు. ఇప్పుడు నిండు గర్భిణిగా ఉన్న ఆమె ఇంటికి షర్మిల వెళ్లారు. కాటారం మండలం విలాసాగర్‌కు చెందిన మంచినీళ్ల కొమురమ్మ కూతురు కొమురమ్మ. ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ దశలో ఉండగా.. వైఎస్ హఠాన్మరణంతో తల్లి కొమురమ్మ గుండెపోటుతో చనిపోయారు.  

ఇంటి నిర్మాణం ఆగిపోయింది. మరోవైపు ఆమె కూతురు పెళ్లీడుకు వచ్చింది. పెళ్లి కష్టమనుకున్న సమయంలో జగన్ రూ.లక్ష చెక్కు పంపారు. ఈ డబ్బుతోనే ఊరివాళ్లంతా కలిసి ఆమెకు పెళ్లి చేశారు. ఇంటికి రేకులు తెచ్చి పైకప్పు వేశారు. ఇప్పుడు ఆమె 8 నెలల గర్భవతి. తమ ఇంటికి వచ్చి షర్మిల కొంత డబ్బు చేతిలో పెట్టగానే కొమురమ్మ ఉద్వేగానికి గురైంది. ‘‘అమ్మా.. మా నాయిన నాకు ఏమీయ్యలే.. మీ నాయినే నాకు ఇల్లు కట్టిచ్చిండు, పెళ్లి కాదనుకున్న నాకు జగనన్న డబ్బు ఇచ్చి పెళ్లి చేసిండు. ఇప్పుడు మీరు నా ఇంటికొచ్చి కాన్పుకు సాయమైనరు. తల్లిదండ్రులు లేని నాకు మీ ఇల్లే.. నా తల్లిగారిల్లమ్మా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
Share this article :

0 comments: